పదహారేళ్ల తర్వాత వెస్టిండీస్ సిరీస్ విజయం!
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా వెస్టిండీస్ 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే సిరీస్ నెగ్గడం ద్వారా ఊపిరి పీల్చుకొంది...
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా వెస్టిండీస్ 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే సిరీస్ నెగ్గడం ద్వారా ఊపిరి పీల్చుకొంది...
1970 దశకంలో ప్రపంచ క్రికెట్ ను కంటిచూపుతో శాసించిన కరీబియన్ కమ్ వెస్టిండీస్ పరిస్థితి ఇంత బతుకూ బతికి ..అన్నట్లుగా తయారయ్యింది.
ఒకప్పుడు విజయాలు, సిరీస్ విజయాలకు, టెస్టు, వన్డే ప్రపంచకప్ ట్రోఫీలకు చిరునామాగా నిలిచిన వెస్టిండీస్ గత రెండుదశాబ్దాల కాలంలో
పాతాళానికి పడిపోయింది. ఇటీవలే ముగిసిన 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు వెస్టిండీస్ అర్హత సంపాదించలేకపోడం అతిపెద్ద క్రికెట్ విషాదంగా మిగిలింది.
జింబాబ్వే వేదికగా జరిగిన ప్రపంచకప్ అర్హత పోటీలలో నెదర్లాండ్స్, స్కాట్లాండ్ లాంటి చిన్నచితకా జట్ల చేతిలోనూ కరీబియన్ టీమ్ పరాజయాలు చవిచూడటం చూస్తే..ప్రమాణాలు ఎంతగా పతనమయ్యిందీ మరి చెప్పాల్సిన పనిలేదు.
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా.......
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా ద్వైపాక్షిక వన్డే సిరీస్ ను వెస్టిండీస్ చివరి సారిగా 1998లో గెలుచుకొంది. ఆ తర్వాత నుంచి సిరీస్ విజయాల సంగతి అటుంచి ..మ్యాచ్ లు నెగ్గడమే గగనమైపోతూ వస్తోంది.
క్రిస్ గేల్, కిరాన్ పోలార్డ్, యాండ్రీ రస్సెల్, డ్వయన్ బ్రావో లాంటి పలువురు ప్రపంచ మేటి ఆటగాళ్లు రిటైర్ కావడం..జట్టుకు జట్టుకు అందుబాటులో లేకపోడం లాంటి కారణాలతో కరీబియన్ క్రికెట్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది.
గత 15 సంవత్సరాలుగా ఇంగ్లండ్ చేతిలో సిరీస్ వెంట సిరీస్ ఓడుతూ వచ్చిన వెస్టిండీస్ 16వ ఏడాదిలో కానీ తొలిసిరీస్ విజయం సాధించలేకపోయింది.
ప్రపంచ మాజీ చాంపియన్ ఇంగ్లండ్ తో జరిగిన మూడుమ్యాచ్ ల ద్వైపాక్షిక వన్డే సిరీస్ ను వెస్టిండీస్ 2-1తో గెలుచుకోడం ద్వారా సంచలనం సృష్టించింది.
కార్టీ, మాథ్యూల జోరుతో....
మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండువన్డేలలో విండీస్, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో 1-1తో సమఉజ్జీలుగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డేలో
కరీబియన్ జట్టు 4 వికెట్ల విజయంతో సిరీస్ విజేతగా నిలిచింది.
కేసీ కార్టీ బ్యాటింగ్ లోనూ, మాథ్యూ ఫోర్డీ బౌలింగ్ లోనూ రాణించడంతో వెస్టిండీస్ సిరీస్ ను కైవసం చేసుకోగలిగింది. మ్యాచ్ నెగ్గాలంటే 34 ఓవర్లలో 188 పరుగులు సాధించాల్సి ఉండగా..వికెట్ నష్టానికి 78 పరుగులతో శుభారంభం చేసినా..ఒకదశలో 6 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసి ఓటమి అంచుల్లో కూరుకుపోయింది.
అయితే..ఆల్ రౌండర్ రొమారియో షెఫర్డ్ 41 పరుగుల కీలక స్కోరు సాధించడంతో మరో 14 బంతులు మిగిలిఉండగానే కరీబియన్ టీమ్ విజేతగా నిలువగలిగింది.
రెండుసార్లు వన్డే, రెండుసార్లు టీ-20 ప్రపంచకప్ విన్నర్ గా నిలిచిన వెస్టిండీస్ ప్రస్తుతం ప్రపంచకప్ ఫైనల్ రౌండ్లో పాల్గొనటానికి అర్హత సాధించలేకపోడాన్ని మించిన విషాదం మరొకటిలేదు.