జనాభాలో టాప్..ప్రపంచ నంబర్ వన్ గేమ్ లో ఫ్లాప్!

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండుదేశాలలో ఒకటిగా ఉన్న భారత్..ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో మాత్రం అట్టడుగుకు పడిపోతూ వస్తోంది.

Advertisement
Update:2024-04-06 06:47 IST

భారత ఫుట్ బాల్ జట్టు పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారయ్యింది. గత మూడేళ్ల కాలంలో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకొంది.

సంవత్సరాలు గడుస్తున్నా...ఒకే ప్రధాని దేశాన్ని ఏలుతున్నా...శిక్షకులు మారుతున్నా భారత ఫుట్ బాల్ తలరాత ఏమాత్రం మారడంలేదు. రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది.

వరుస వైఫల్యాలతో 121వ ర్యాంక్ లో భారత్!

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండుదేశాలలో ఒకటిగా ఉన్న భారత్..ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో మాత్రం అట్టడుగుకు పడిపోతూ వస్తోంది. 204 దేశాలకు సభ్యత్వం ఉన్న అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 121వ ర్యాంకులో కొట్టిమిట్టాడుతూ వస్తోంది.

అసోం వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన 2026- ప్రపంచకప్ అర్హత పోరులో అప్ఘనిస్థాన్ చేతిలో 1-2 గోల్స్ తో పరాజయం పొందడంతో భారత ర్యాంకు మరింతగా పడిపోయింది.

క్రొయేషియా కోచ్ ఇగోర్ స్టిమాక్ నేతృత్వంలో గత కొద్ది సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తూ 104 నుంచి 99వ ర్యాంక్ వరకూ వచ్చిన భారత్..కొద్దిమాసాల కాలంలోనే పరాజయాలు, వరుస వైఫల్యాల ఊబిలో చిక్కు కొంది.

అప్పుడలా...ఇప్పుడిలా.....

గతంలో ఇంటర్ కాంటినెంటల్ కప్,మూడుదేశాల టోర్నీలతో పాటు శాఫ్ సాకర్ చాంపియన్ ట్రోఫీలు గెలుచుకోడం ద్వారా భారత ర్యాంకు గణనీయంగా మెరుగుపడింది.

అయితే..2023 ఆసియాకప్ టోర్నీలో వైఫల్యాలతో భారత పరాజయాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది.

ఆసియాకప్ టోర్నీలో గెలుపు సంగతి అలా ఉంచి..గోలు సాధించడమే భారత్ కు గగనమైపోయింది. ఆస్ట్ర్రేలియా, ఉజ్బెకిస్థాన్, సిరియాజట్ల చేతిలో పరాజయాలతో ఒకే ఒక్క గోలు మాత్రమే సాధించగలిగింది.

చివరకు అప్ఘనిస్థాన్ చేతిలో సైతం పరాజయం పొందడంతో భారత ఫుట్ బాల్ పతనం పతాకస్థాయికి చేరినట్లయ్యింది. భారత ఫుట్ బాల్ సమాఖ్యలో అంతర్మథనం ప్రారంభమయ్యింది.

మనదేశంలో ఒక్క రాష్ట్ర్రమంతైనా లేని దేశాలు ప్రపంచ మొదటి 30 ర్యాంకుల్లో నిలుస్తూ..ప్రపంచ కప్ కు, ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తుంటే 140 కోట్లకు పైగా జనాభా ఉన్నా..ఫుట్ బాల్ లో భారత్ వెలవెలబోవడం చర్చనీయాంశంగా మారింది.

టాప్ ర్యాంక్ లో అర్జెంటీనా...

ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ఫ్రాన్స్, ఇంగ్లండ్, బెల్జియం, బ్రెజిల్ మొదటి ఐదుస్థానాలలో కొనసాగుతూ వస్తున్నాయి.

భారత ఫుట్ బాల్ జట్టు ప్రపంచ మొదటి 100 ర్యాంకుల్లో నిలవడమే గగనమైపోతుంటే...ప్రపంచకప్ కు, ఒలింపిక్స్ కు అర్హత సాధించాలని కోరుకోడం అత్యాశకాక మరేమిటి.

Tags:    
Advertisement

Similar News