ఐసీసీ టెస్టులీగ్ లో ముగ్గురూ ముగ్గురే!

టెస్టు హోదా పొందిన దేశాల నడుమ జరిగే ఐసీసీ టెస్టులీగ్ లో భారత రికార్డుల హోరు కొనసాగుతోంది. వంద వికెట్ల క్లబ్ లో ముగ్గురు భారత స్టార్ బౌలర్లు చోటు సంపాదించగలిగారు.

Advertisement
Update:2024-03-01 16:50 IST

టెస్టు హోదా పొందిన దేశాల నడుమ జరిగే ఐసీసీ టెస్టులీగ్ లో భారత రికార్డుల హోరు కొనసాగుతోంది. వంద వికెట్ల క్లబ్ లో ముగ్గురు భారత స్టార్ బౌలర్లు చోటు సంపాదించగలిగారు...

అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ ) టెస్టు హోదా పొందిన దేశాల నడుమ నిర్వహిస్తున్న ఐసీసీ టెస్టు లీగ్ టోర్నీలలో భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండుసార్లు ఫైనల్స్ చేరడంతో పాటు రన్నరప్ గా నిలిచిన జట్టుగా, ప్రపంచ నంబర్ వన్ జట్టుగా భారత్ తన ఆధిపత్యం చాటుకోగలుగుతోంది.

ఇంగ్లండ్ తో జరుగుతున్న ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ ను మొదటి నాలుగు టెస్టులు ముగిసే సమయానికే 3-1తో ఖాయం చేసుకొన్న భారత్..ఈనెల 7 నుంచి ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఆఖరిటెస్టుతో సిరీస్ ను 4-1తో ముగించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాలన్న పట్టుదలతో ఉంది.

వంద వికెట్ల క్లబ్ లో భారత బౌలర్లు...

ఐసీసీ టెస్టు లీగ్ చరిత్రలో వంద వికెట్లు పడగొట్టిన భారత తొలిబౌలర్ ఘనతను యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా సాధిస్తే..అదే వరుసలో స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్ , రవీంద్ర జడేజా నిలువగలిగారు.

రాంచీ వేదికగా జరిగిన నాలుగోటెస్టు లో ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా జడేజా శతవికెట్ల క్లబ్ లో చేరాడు. ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు జానీ బెయిర్ స్టోను 30 పరుగుల స్కోరుకు అవుట్ చేయడం ద్వారా జడేజా 100 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు.

36 సంవత్సరాల రవీంద్ర జడేజా 100వ వికెట్ పడగొట్టడంతో టెస్టు లీగ్ చరిత్రలో వంద వికెట్లు పడగొట్టిన బౌలర్ల సంఖ్య 10కి చేరింది.

అగ్రస్థానంలో నేథన్ లయన్....

టెస్టు లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ రికార్డు కంగారూ ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ పేరుతో ఉంది. లయన్ మొత్తం 41 టెస్టుల్లో 174 వికెట్లు పడగొట్టడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.

ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ యాండీ కమిన్స్ 40 టెస్టుల్లో 169 వికెట్లతో రెండు, 165 వికెట్లతో అశ్విన్ మూడు స్థానాలలో కొనసాగుతున్నారు. భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా 25 టెస్టుల్లో 108 వికెట్లు, జడేజా 30 టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టం ద్వారా 9, 10 స్థానాలలో నిలిచారు.

వంద వికెట్లు పడగొట్టిన ఇతర బౌలర్లలో మిషెల్ స్టార్క్, జేమ్స్ యాండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, కిగిసో రబడ, టిమ్ సౌథీ ఉన్నారు.

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా అత్యధిక వికెట్లు...

రాంచీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్..ఇంగ్లండ్ ప్రత్యర్థిగా అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ గా నిలిచాడు. జడేజా 19 టెస్టుల్లో 68 వికెట్లతో 6వ అత్యుత్తమ భారత బౌలర్ గా నిలిచాడు.

ఇంగ్లండ్ పై ప్రస్తుత సిరీస్ లోని 4వ టెస్టు వరకూ 23 మ్యాచ్ లు ఆడిన అశ్విన్ 105 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత నంబర్ వన్ బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

సిక్సర్ల బాదుడులో భారత ప్రపంచ రికార్డు...

సాంప్రదాయ టెస్టు క్రికెట్ చరిత్రలో..ఐదుమ్యాచ్ ల ఓ సిరీస్ లోని మొదటి నాలుగు టెస్టుల్లోనే అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్ లో ప్రారంభమై..రాంచీ లో ముగిసిన మొదటి నాలుగు టెస్టుల్లోనే భారత బ్యాటర్లు మొత్తం 50 సిక్సర్లు సాధించారు.

రాంచీ టెస్టు ముగిసే నాటికి భారత్ మొత్తం 51 సిక్సర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో సాధించిన తన 47 సిక్సర్ల రికార్డును ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లో భారతజట్టు 51 సిక్సర్లతో తిరగరాసింది. 2023 ఆస్ట్ర్రేలియా సిరీస్ లో ఇంగ్లండ్ 23 సిక్సర్లు, 2013-14 ఇంగ్లండ్ సిరీస్ లో ఆస్ట్ర్రేలియా 40 సిక్సర్ల రికార్డులను నమోదు చేశాయి.

ప్రస్తుత భారత్- ఇంగ్లండ్ జట్ల సిరీస్ లోని మొదటి నాలుగు టెస్టుల్లోనే రెండుజట్లు కలసి 83 సిక్సర్లు బాదడం ద్వారా మరో ప్రపంచ రికార్డు నమోదు చేశాయి.

23 సిక్సర్లతో యశస్వీ టాప్....

ప్రస్తుత సిరీస్ లో భాగంగా ఇప్పటికే ముగిసిన నాలుగుటెస్టులు, ఎనిమిది ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా భారత యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

హైదరాబాద్, విశాఖ, రాజకోట, రాంచీ వేదికలుగా జరిగిన టెస్టుల్లో యశస్వీ రెండు డబుల్ సెంచరీలతో పాటు 23 సిక్సర్లతో నంబర్ వన్ సిక్సర్ హిట్టర్ గా నిలిచాడు.

ధర్మశాల వేదికగా జరిగే ఆఖరిటెస్టులో రండుజట్లు కలసి మరెన్ని సిక్సర్లు బాదుతాయో వేచి చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News