ఆసియాక్రీడల్లో తెలుగు అథ్లెట్ల తడాఖా!

చైనాలోని హాంగ్జు నగరంలో కొద్దిగంటల క్రితమే ముగిసిన 19వ ఆసియాక్రీడల్లో తెలుగు అథ్లెట్లు సత్తా చాటుకొన్నారు.

Advertisement
Update:2023-10-09 10:45 IST

చైనాలోని హాంగ్జు నగరంలో కొద్దిగంటల క్రితమే ముగిసిన 19వ ఆసియాక్రీడల్లో తెలుగు అథ్లెట్లు సత్తా చాటుకొన్నారు.

19వ ఆసియాక్రీడల్లో భారత రికార్డు పతకాల సాధనలో తెలుగు రాష్ట్ర్రాల అథ్లెట్లు సైతం తమవంతు పాత్ర పోషించారు. షూటింగ్, బ్యాడ్మింటన్ , ఆర్చరీ, బాక్సింగ్, చదరంగం, అథ్లెటిక్స్, క్రికెట్ అంశాలలో రాణించారు. ఆసియాక్రీడల్లో భారత్ పతకాలవేట స్థాయికి మించి సాగింది. 28 స్వర్ణాలతో సహా 107 పతకాల వద్ద ఆగింది. భారత్ ఈ పతకాల వేటలో తెలుగు రాష్ట్ర్రాల అథ్లెట్లు సైతం తమవంతు బాధ్యతను నిర్వర్తించారు.

మహిళల బాక్సింగ్, పురుషుల క్రికెట్, షూటింగ్ అంశాలలో తెలంగాణా అథ్లెట్లు పతకాలు తెస్తే...విలువిద్య, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ విభాగాలలో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు బంగారు పంట పండించారు.

3 స్వర్ణాల బెజవాడ ఆర్చర్ ....

ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ మూడు విభాగాలలో మూడు బంగారు పతకాలు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. కాంపౌండ్ విభాగంలో మహిళల వ్యక్తిగత, టీమ్ విభాగాలతో పాటు మిక్సిడ్ డబుల్స్ అంశంలో సైతం బంగారు పంట పండించింది.

మిక్సిడ్ డబుల్స్ లో ఓజాస్ దేవ్ తాలేతో జంటగా బరిలో నిలిచిన జ్యోతి సురేఖ తొలిబంగారు పతకం అందుకొంది. కొరియాజోడీతో జరిగిన బంగారుపతకం పోరులో 159- 158 పాయింట్ల తేడాతో భారత్ విజేతగా నిలిచింది.

మహిళల టీమ్ విభాగం గోల్డ్ మెడల్ పోరులో చైనీస్ తైపీ జట్టు పై 230- 229 పాయింట్ల తేడాతో భారత్ విజయం సాధించడంలో జ్యోతి సురేఖ, అదితీ గోపీచంద్ స్వామి, ప్రణీత్ కౌర్ లతో కూడిన భారతజట్టు సఫలమయ్యింది.

మహిళల వ్యక్తిగత విభాగంలో సైతం జ్యోతి సురేఖకు ఎదురేలేకుండా పోయింది. బంగారు పతకం కోసం జరిగిన పోరులో కొరియా ఆర్చర్ ను కంగు తినిపించడం ద్వారా జ్యోతి సురేఖ స్వర్ణాల హ్యాట్రిక్ ను పూర్తి చేసింది.

19వ ఆసియాక్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన ఏకైక తెలుగు అథ్లెట్ ఘనతను సంపాదించింది.

4 పతకాల హైదరాబాదీ షూటర్ ...

మహిళల పిస్టల్ షూటింగ్ విభాగంలో హైదరాబాద్ లో పుట్టిపెరిగిన 19 సంవత్సరాల ఈషా సింగ్ ఏకంగా నాలుగు పతకాలు సాధించడం ద్వారా భారత్ కు మాత్రమే కాదు..తెలుగు రాష్ట్ర్రాలకు సైతం గర్వకారణంగా నిలిచింది. ఆసియాక్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన ఇద్దరు భారత అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది.

గచ్చిబౌలిలోని షూటింగ్ రేంజ్ లో ఓనమాలు దిద్దుకొని..మహారాష్ట్ర్రలోని గగన్ నారంగ్ అకాడమీలో శిక్షణ పొందిన ఈషా సింగ్ 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో బంగారు పతకం సాధించింది. ఇదే అంశం వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించడం ద్వారా తన పతకాల సంఖ్యను రెండుకు పెంచుకొంది. అంతటితో ఆగిపోకుండా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్, వ్యక్తిగత విభాగాలలో రజత పతకాలు సొంతం చేసుకొంది. మొత్తం 4 పతకాలు గెలుచుకోడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచింది.


నిఖత్ జరీన్ చేజారిన స్వర్ణం....

మహిళల బాక్సింగ్ 50 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించడం ఖాయమనుకొన్న తెలంగాణా బాక్సర్ నిఖత్ జరీన్ ..సెమీఫైనల్ ఓటమితో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్ గా ఉన్న నిఖత్ ను ఆసియాక్రీడల సెమీస్ లో దురదృష్టం వెంటాడింది. థాయ్ బాక్సర్ 3-2 పాయింట్లతో నిఖత్ పై సంచలన విజయం సాధించడం ద్వారా బంగారు ఆశల్ని వమ్ము చేసింది.

పురుషుల క్రికెట్లో తిలక్ వర్మకు స్వర్ణం...

పురుషుల క్రికెట్లో బంగారు పతకం సాధించిన భారతజట్టులో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ సైతం సభ్యుడిగా ఉన్నాడు. భారతజట్టు ఫైనల్ చేరడంలో తిలక్ వర్మ అజేయహాఫ్ సెంచరీతో నిలిచాడు.

బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో అపూర్వ విజయం...

బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ విభాగంలో భారత్ తొలిసారిగా గోల్డ్ మెడల్ రౌండ్ చేరుకోడంలో ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు కిడాంబీ శ్రీకాంత్, సాయి సాత్విక్ ప్రధానపాత్ర పోషించారు.

దక్షిణ కొరియాతో జరిగిన సెమీస్ పోరులో భారత్ 3-2తో సంచలన విజయం సాధించడంలో సింగిల్స్ ప్లేయర్ కిడాంబీ శ్రీకాంత్, డబుల్స్ లో సాయి సాత్విక్- చిరాగ్ శెట్టి కీలకంగా వ్యవహరించారు.

రెండుజట్లు చెరో రెండుమ్యాచ్ లు నెగ్గి 2-2తో సమఉజ్జీలుగా నిలిచిన సమయంలో జరిగిన నిర్ణయాత్మక ఆఖరి సింగిల్స్ లో కిడాంబీ శ్రీకాంత్ అసాధారణ విజయంతో తనజట్టును తొలిసారిగా ఫైనల్స్ చేర్చగలిగాడు.

బంగారు పతకం కోసం ఆతిథ్య చైనాతో జరిగిన పోరులో భారత్ 2-3తో పోరాడి ఓడి రజత పతకంతో సరిపెట్టుకొంది. డబుల్స్ లో సాయిసాత్విక్ జోడీ కీలక విజయం సాధించినా..ఆఖరి సింగిల్స్ లో కిడాంబీ శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు.

ఆసియాక్రీడల బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ చరిత్రలోనే తొలిసారిగా బంగారు పతకం సాధించిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయి సాత్విక్ సైతం సభ్యుడిగా ఉన్నాడు.


విశాఖ రన్నర్ జ్యోతికి రజతం...

తన కెరియర్ లో తొలిసారిగా ఆసియాక్రీడల మహిళల 100 మీటర్ల హర్డిల్స్ బరిలోకి దిగిన విశాఖ కమ్ ఆంధ్రప్రదేశ్ రన్నర్ జ్యోతి యర్రాజీ రజత పతకంతో సరిపెట్టుకొంది.

ఆసియా చాంపియన్ హోదాలో రేస్ లో పాల్గొన్న జ్యోతికి అదృష్టం కలసి వచ్చింది. వాస్తవానికి కాంస్య పతకం సాధించిన జ్యోతికి..ప్రత్యర్థి చైనా రన్నర్ ఫౌల్ చేయడంతో..రజత పతకం దక్కింది.

చదరంగం పురుషుల టీమ్ విభాగంలో రజత పతకం సాధించిన భారతజట్టు సభ్యుల్లో తెలంగాణా గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి, ఆంధ్రా గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ ఉన్నారు.

క్రీడారంగంలో తెలుగు రాష్ట్ర్రాలు ఏమాత్రం వెనుకబడి లేవనటానికి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లకు ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్లు సాధించిన పతకాలే నిదర్శనంగా నిలిచిపోతాయి.

Tags:    
Advertisement

Similar News