ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా క్రికెటర్లు భేటీ
పీఎం ఎలెవన్‌తో రెండు రోజుల మ్యాచ్ లో తలపడనున్న ఇండియా
ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌తో టీమిండియా క్రికెటర్లు గురువారం సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆ దేశ పార్లమెంట్ ఆవరణలో ప్రధానితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా అల్బనీస్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సహా ఇండియన్ క్రికెటర్లతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈనెల 30, డిసెంబర్ ఒకటి తేదీల్లో ఆస్ట్రేలియా పీఎమ్స్ ఎలెవన్‌తో టీమిండియా కాన్‌బెర్రా మైదానంలో తలపడనుంది. ఈ మ్యాచ్ లో తాను పీఎమ్స్ ఎలెవన్ జట్టుకే మద్దతునిస్తానని ఆస్ట్రేలియా ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీమిండియాతో పాటు పీఎమ్స్ ఎలెవన్ టీమ్ సభ్యులతో ఆంటోనీ అల్బనీస్ సెల్ఫీలు దిగారు. ఆ ఫొటోలను తన అధికారిక ఎక్స్ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 295 పరుగుల భారీ ఆదిక్యంతో విజయం సాధించింది. రెండో టెస్ట్ డిసెంబర్ ఆరో తేదీన అడిలైడ్ ఓవల్ లో ప్రారంభం కానుంది. మధ్యలో ఎక్కువ రోజులు విరామం ఉండటంతో టీమిండియాతో పీఎమ్స్ ఎలెవన్ జట్టు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో తలపడనుంది.