నా ఆట విరాట్ ఘనతే- హార్దిక్ పాండ్యా

వెస్టిండీస్‌తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ ఆఖరిమ్యాచ్‌లో తాను రాణించడం వెనుక విరాట్ కొహ్లీ ఉన్నాడని భారత స్టాండిన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు.

Advertisement
Update:2023-08-02 15:39 IST

కరీబియన్ జట్టుపై భారత్ కు 200 పరుగుల భారీవిజయం అందించిన నాయకుడిగా పాండ్యా నిలిచాడు. వన్డే క్రికెట్ 10వ ర్యాంకర్ వెస్టిండీస్‌ను కరీబియన్ గడ్డపై వన్డే సిరీస్ లో భారత్ 2-1 ఓడించడంలో స్టాండిన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రధానపాత్ర పోషించాడు. దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలకు విశ్రాంతినిచ్చి.. పలువురు యువబ్యాటర్లతో టీమ్ మేనేజ్ మెంట్ ప్రయోగం చేసినా తాత్కాలిక కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా జట్టును ముందుండి విజేతగా నిలిపాడు. మూడుమ్యాచ్ ల ఈ సిరీస్‌లోని తొలివన్డేకు మాత్రమే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం వహించగా.. ఆఖరి రెండు వన్డేలలో హార్దిక్ సారథ్యం వహించాడు.

వరుస వైఫల్యాల నుంచి తేరుకొని..

గత ఏడాది కాలంగా ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్‌ కే పరిమితమైన హార్దిక్ పాండ్యా.. 50 ఓవర్ల వన్డే ఫార్మాట్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతూ గందరగోళంలో పడిపోయాడు. వెస్టిండీస్ తో ముగిసిన ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండు వన్డేలలోనూ హార్దిక్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. హార్దిక్ వన్డేలు ఆడటమే మరచిపోయినట్లున్నాడంటూ విమర్శలు సైతం వినిపించాయి. అయితే.. టారుబాలోని బ్రయన్ లారా క్రికెట్ అకాడమీ స్టేడియం వేదికగా ముగిసిన కీలక ఆఖరి వన్డేలో మాత్రం హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ పవర్ ఏంటో బయటపెట్టాడు. సంజు శాంసన్ అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన హార్దిక్ చివరి వరకూ బ్యాటింగ్ కొనసాగించి అజేయ హాఫ్ సెంచరీతో నిలిచాడు. భారతజట్టు 351 పరుగుల భారీస్కోరు సాధించడంలో తనవంతు పాత్ర నిర్వర్తించాడు. ఆఖరి 15 ఓవర్లలో హార్దిక్ పాండ్యా సంయమనంతో బ్యాటింగ్ కొనసాగించి.. 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.

క్రీజులో అధికసమయం గడపడంతోనే..

50 ఓవర్ల ఫార్మాట్లో ఓ బ్యాటర్ రాణించాలంటే క్రీజులో అధికసమయం గడపాలని, ఎక్కువ బంతులను ఎదుర్కొనాలని తనకు దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ గుర్తు చేశాడని, తన బ్యాటింగ్ లో అదే ప్రధాన లోపమని వివరించాడని మ్యాచ్ అనంతరం పాండ్యా గుర్తు చేసుకొన్నాడు. దారితప్పిన తన వన్డే బ్యాటింగ్ తిరిగి గాడిలో పడటం వెనుక విరాట్ కొహ్లీ సలహా, సూచనతో పాటు ప్రేరణ ఉన్నాయని చెప్పాడు. కెరియర్ ఆరంభం నుంచి తన బ్యాటింగ్ తీరుపట్ల విరాట్ కు సంపూర్ణ అవగాహన ఉందని, విరాట్ సూచన మేరకు ఆడి, సలహాను పాటించడంతోనే 70 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం పట్ల పాండ్యా సంతృప్తి వ్యక్తం చేశాడు.

ఇలాంటి మ్యాచ్‌లంటేనే మ‌క్కువ‌..

తనకు చావోబతుకో అన్నట్లుగా జరిగే మ్యాచ్‌లంటేనే ఇష్టమని, సిరీస్ విజేతగా నిలవాలంటే నెగ్గితీరాల్సిన మ్యాచ్ ల్లో రాణించడం కోసం ఎదురుచూస్తూ ఉంటానని హార్దిక్ పాండ్యా తెలిపాడు. యువఆటగాళ్లకు తగిన అవకాశాలు ఇవ్వడం కోసం దిగ్గజ బ్యాటర్లు రోహిత్, విరాట్ బెంచ్ కే పరిమితం కావడం గొప్ప విషయమని, వారి క్రికెట్ స్ఫూర్తికి నిదర్శనమని ప్రశంసించాడు. యువజోడీ శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ తో పాటు సంజు శాంసన్ సైతం తమ సత్తాను చాటుకోగలిగారని, యువపేసర్ ముకేశ్ కుమార్ సైతం స్థాయికి తగ్గట్టుగా రాణించడం అభినందనీయమని అన్నాడు.

Tags:    
Advertisement

Similar News