టీ-20 ప్రపంచకప్ లో అతిపెద్ద సంచలనం..పాక్ కు అమెరికా షాక్!
2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గ్రూప్ - ఏ లీగ్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. దిగ్గజ జట్టు పాకిస్థాన్ కు పసికూన అమెరికా ' సూపర్ ' షాకిచ్చింది.
2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గ్రూప్ - ఏ లీగ్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. దిగ్గజ జట్టు పాకిస్థాన్ కు పసికూన అమెరికా ' సూపర్ ' షాకిచ్చింది...
అమెరికా, కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ గ్రూపు లీగ్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్ మేటిజట్లలో ఒకటైన పాకిస్థాన్ కు పసికూన, ఆతిథ్య అమెరికాజట్టు దిమ్మతిరిగే షాకిచ్చింది.
వరుసగా రెండో గెలుపుతో....
డల్లాస్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ రెండోరౌండ్ మ్యాచ్ ముగిసే సమయానికి ఆతిథ్య అమెరికా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది.
భారత సంతతి ఆటగాడు మోనాంక్ పటేల్ నాయకత్వంలోని అమెరికా 4 పాయింట్లతో గ్రూప్- ఏ లీగ్ టాపర్ స్థానం సంపాదించింది. ప్రారంభమ్యాచ్ లో కెనడాను కంగు తినిపించిన అమెరికా..తన ప్రపంచకప్ అరంగేట్రం సీజన్లోనే అతిపెద్ద విజయం సాధించింది.
డల్లాస్ లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ రెండోరౌండ్ పోరులో అమెరికా సూపర్ ఓవర్ సమరంలో పాక్ పై 5 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.
టెస్టు హోదా పొందిన జట్లపై నెగ్గడం గత రెండువారాల సమయంలో అమెరికాకు ఇది రెండోసారి. గత వారం బంగ్లాదేశ్ పై సంచలన విజయం సాధించిన అమెరికా..ఇప్పుడు ప్రపంచ మాజీ చాంపియన్ పాకిస్థాన్ ను సైతం కంగు తినిపించగలిగింది.
' టై 'గా ముగిసిన మ్యాచ్....
డల్లాస్ లోని గ్రాండ్ ప్రయరీ స్టేడియం వేదికగా జరిగిన ఈ కీలక పోరులో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న అమెరికాజట్టు ప్రత్యర్థి పాక్ ను 20 ఓవర్లలో 159 పరుగుల స్కోరుకే పరిమితం చేయగలిగింది.
పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ అజమ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులతో టాప్ స్కోరర్ నిలిచాడు. మిడిలార్డర్లో స్పిన్ ఆల్ రౌండర్ షదాబ్ ఖాన్ 25 బంతుల్లో ఓ ఫోరు, 3 సిక్సర్లతో 40 పరుగులు సాధించడంతో పాక్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగుల స్కోరు సాధించగలిగింది.
అమెరికా బౌలర్లలో కెంజిగీ 3, నేత్రవాల్కర్ 2, అలీఖాన్, జస్ దీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
మోనాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్....
160 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన అమెరికా సైతం 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగుల స్కోరే సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ 38 బంతుల్లో 50 పరుగులు, యాండ్రీస్ గూస్ 26 బంతుల్లో 35 పరుగులు, ఆరోన్ జోన్స్ 26 బంతుల్లో 36 పరుగులు, మిడిలార్డర్ ఆటగాడు నితీష్ కుమార్ 14 బంతుల్లో 14 పరుగులు సాధించడంతో అమెరికా సైతం 159 పరుగుల స్కోరే సాధించగలిగింది.
పాక్ బౌలర్లలో మహ్మద్ అమీర్, నసీం షా, రవూఫ్ తలో వికెట్ పడగొట్టారు.
సూపర్ ఓవర్లో పాక్ సూపర్ ఫ్లాప్...
మ్యాచ్ టైగా ముగియడంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ నిబంధన అమలు చేశారు. సూపర్ ఓవర్ 6 బంతుల్లో అమెరికా వికెట్ నష్టానికి 18 పరుగులు సాధించింది.
సమాధానంగా పాక్ జట్టు సూపర్ ఓవర్ ఆరు బంతుల్లో వికెట్ నష్టానికి 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అమెరికా 5 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకోగలిగింది. అమెరికా పేసర్ సౌరవ్ నేత్రవాల్కర్ కట్టుదిట్టంగా బౌల్ చేసి తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
2007 వన్డే ప్రపంచకప్ లో ఐర్లాండ్ చేతిలో పరాజయం పొందిన పాక్ జట్టు..ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో పసికూన అమెరికా చేతిలో పరాజయం పొందటం విశేషం.
పాక్ కు మూడో సూపర్ ఓవర్ ఓటమి...
పాక్ జట్టుకు టైగా ముగిసిన మ్యాచ్ ల్లో ఇది మూడో సూపర్ పరాజయం. న్యూయార్క్ నసావు కౌంటీ స్టేడియం వేదికగా జూన్ 9న జరిగే కీలక పోరులో భారత్ తో పాక్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.
భారత్- పాక్ జట్ల నడుమ జరిగే దాయాదిజట్ల సమరం టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడుపోడం విశేషం.
గ్రూప్- ఏ లీగ్ ప్రారంభమ్యాచ్ లో ఐర్లాండ్ ను 8 వికెట్లతో చిత్తు చేసిన భారత్...తన రెండోరౌండ్లో చిరకాల ప్రత్యర్థి పాక్ తో తలపడనుంది.