ఫైనల్‌కు ముందే పాక్‌కు శ్రీలంక షాక్!

ఆసియా కప్ సూపర్ - 4 రౌండ్‌లో మాజీ చాంపియన్ శ్రీలంక మూడుకు మూడు విజయాలతో టైటిల్ ఫైట్ కి సిద్ధమైంది. ఆఖరి రౌండ్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో కంగు తినిపించింది.

Advertisement
Update:2022-09-10 11:21 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 15వ ఆసియా కప్ సూపర్ - 4 రౌండ్‌ను ఐదుసార్లు విజేత శ్రీలంక ఆల్ విన్ రికార్డుతో ముగించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన సూపర్-4 ఆఖరి రౌండ్ పోరులో మాజీ చాంపియన్ పాకిస్థాన్‌కు 5 వికెట్ల తేడాతో షాకిచ్చింది. సూపర్ సండే ఫైట్‌గా జరిగే టైటిల్ సమరంలో తలపడటానికి ముందే జరిగిన పోరులో పాక్‌పై శ్రీలంక పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

121 పరుగులకే పాక్ ఆలౌట్...

సూపర్ - 4 రౌండ్ మొదటి రెండు మ్యాచ్ ల్లో భారత్, అప్ఘన్ జట్లపై విజయాలు సాధించడం ద్వారా ఫైనల్లో చోటు ఖాయం చేసుకొన్న పాక్ జట్టు సూపర్ - 4 రౌండ్లో తన ఆఖరి మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా, లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ షదాబ్ ఖాన్‌లకు విశ్రాంతి ఇచ్చింది. రిజర్వ్ ఆటగాళ్లు హసన్ అలీ, లెగ్ స్పిన్నర్ ఉస్మాన్ ఖాదిర్‌లకు తుది జట్టులో చోటు కల్పించింది. ఫైనల్స్ కు డ్రెస్ రిహార్సల్స్ గా జరిగిన ఈ ఆఖరాటలో శ్రీలంక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ అజమ్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిజ్వాన్ 14, ఫకర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్ చెరో 13 పరుగులు, నవాజ్ 26 పరుగులు సాధించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు, తీక్షణ, ముధశాన్ చెరో 2 వికెట్లు పడగగొట్టారు.

నిసంక బ్యాటింగ్ షో...

122 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన శ్రీలంక..ప్రారంభ ఓవర్లలోనే 29 పరుగులకే 3 టాప్ ఆర్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలుపెట్టింది. ఓపెనర్ కుశాల్ మెండిస్, వన్ డౌన్ గుణతిలక, రెండో డౌన్ ధనుంజయ ఒకరి వెనుక ఒకరుగా అవుటయ్యారు. అయితే...మరో ఓపెనర్ నిసంక పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడం ద్వారా విజయానికి మార్గం సుగమం చేశాడు. నిసంక 48 బంతుల్లో ఒక‌ సిక్సర్, 5 బౌండ్రీలతో 55 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. రాజపక్స 24, షనక 21 పరుగుల స్కోర్లకు అవుట్ కాగా...హసరంగ రెండు బౌండ్రీలతో 10 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో.. శ్రీలంక 17 ఓవర్లలో 5 వికెట్లకు 124 పరుగులతో 5 వికెట్ల విజయం సొంతం చేసుకొంది. శ్రీలంక విజయంలో ప్రధానపాత్ర వహించిన లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం(సెప్టెంబర్ 11 ) జరిగే టైటిల్ పోరులో శ్రీలంకతోనే పాక్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.

Tags:    
Advertisement

Similar News