ఢిల్లీ రంజీ కెప్టెన్‌ గా రిషబ్‌ పంత్‌

దేశవాళీ క్రికెట్‌ పై యువ క్రికెటర్ల మొగ్గు

Advertisement
Update:2025-01-16 19:49 IST

ఢిల్లీ రంజీ జట్టుకు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ నాయకత్వం వహించనున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీలో నిలకడైన బ్యాటింగ్‌ చేసిన పంత్‌.. దేశవాళీ క్రికెట్‌ లో నాలుగు రోజుల మ్యాచ్‌కు ప్రాతినిథ్యం వహించి తనలో ప్రతిభను మెరింత మెరుగు పరుచుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈనెల 23 నుంచి రంజీ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సౌరాష్ట్రతో తలపడే మ్యాచ్‌ కు రిషబ్‌ పంత్‌ ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తారని ఢిల్లీ క్రికెట్‌ సంఘం ప్రకటన చేసింది. 2017 -18 రంజీ సీజన్‌ లో పంత్‌ చివరిసారిగా రంజీ మ్యాచ్‌లో ఆడాడు. పంత్‌ తో పాటు యశస్వీ జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి లాంటి టీమిండియా ప్లేయర్లు రంజీల్లో తమ సొంత రాష్ట్రాల జట్లకు ప్రాతినిథ్యం వహించే అవకాశముంది. ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం ముంబయి తరపున రంజీ బరిలోకి దిగకపోవచ్చని తెలుస్తోంది. ఈనెల 20న ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ జట్టును ప్రకటించనుంది. టెస్టుల్లో టీమిండియా రాణించాలంటే ప్రతి ఒక్కరూ డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ చెప్తోంది. బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 1-3 తేడాతో కోల్పోవడానికి ఇండియన్‌ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌ ఆడకపోవడమే కారణమని బీసీసీఐ పెద్దలు ఆక్షేపిస్తున్నారు. ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న విరాట్‌ కోహ్లీ సైతం ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించకపోవచ్చని తెలుస్తోంది. అందుకే పంత్‌ ను కెప్టెన్‌ గా నియమించారని సమాచారం.

Tags:    
Advertisement

Similar News