భారత చీఫ్ కోచ్ గా ద్రావిడ్ కు పొడిగింపు లేనట్లే!

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ..సరికొత్త చీఫ్ కోచ్ కోసం త్వరలో వేట మొదలు పెట్టనుంది. ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును పొడిగించే ఉద్దేశం లేదని బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు.

Advertisement
Update:2024-05-10 13:12 IST

భారత క్రికెట్ జట్టు సరికొత్త ప్రధాన శిక్షకుడి కోసం బీసీసీఐ త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనుంది. 2024 జులై నెలలో కొత్త కోచ్ నియామకం జరుగనుంది.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ..సరికొత్త చీఫ్ కోచ్ కోసం త్వరలో వేట మొదలు పెట్టనుంది. ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును పొడిగించే ఉద్దేశం లేదని బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు.

ప్రపంచకప్ వరకే ద్రావిడ్ కాంట్రాక్టు..

భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా 2021 నవంబర్ లో రవిశాస్త్ర్రి నుంచి పగ్గాలు చేపట్టిన ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు జూన్ లో జరిగే టీ-20 ప్రపంచకప్ తో ముగియనుంది.

భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ తోనే చీఫ్ కోచ్ గా ద్రావిడ్ కాంట్రాక్టు ముగిసింది. అయితే ప్రపంచకప్ లో భారత్ ఆటతీరు, ఫైనల్స్ చేరడం, రన్నరప్ గా నిలవడం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని..టీ-20 ప్రపంచకప్ వరకూ ద్రావిడ్ ను చీఫ్ కోచ్ గా కొనసాగిస్తున్నట్లు గతంలోనే బీసీసీఐ ప్రకటించింది.

అయితే..టీ-20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని శిక్షకుల బృందం కాంట్రాక్టు ముగిసిపోతుందని, భారత చీఫ్ కోచ్ కోసం త్వరలోనే దరఖాస్తులు ఆహ్వానిస్తామని, కావాలనుకుంటే రాహుల్ ద్రావిడ్ సైతం మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ కార్యదర్శి ముంబైలో వివరించారు.

ఫార్మాట్ కు ఓ కోచ్ ఆలోచన లేదు...

టీ-20, టెస్టు, వన్డే ...ఇలా మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కోచ్ లను నియమించే ఆలోచన బీసీసీఐకి లేదని, ప్రస్తుత ఐపీఎల్ ను అతలాకుతలం చేసిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ప్రయోగాత్మకంగా మాత్రమే అమలు చేస్తున్నామని, ఆల్ రౌండర్ల పాలిట శాపంగా మారిన ఈ నిబంధనను వచ్చే సీజన్లో కొనసాగించేది లేనిదీ..అన్ని వర్గాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొంటామని జే షా తెలిపారు.

ఏడాదికి 12 కోట్ల రూపాయల వేతనం...

భారత టెస్టు, వన్డే, టీ-20 జట్లకు ప్రధాన శిక్షకుడిగా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ కు బీసీసీఐ ఏడాదికి 12కోట్ల రూపాయల చొప్పున జీతం చెల్లిస్తోంది. అంటే ద్రావిడ్ నెలకు కోటిరూపాయల చొప్పున వేతనం అందుకొంటూ తన సేవలు అందిస్తున్నాడు.

రాహుల్ ద్రావిడ్ అందుబాటులో లేని సమయంలో భారతజట్టుకు తాత్కాలిక కోచ్ గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ కు నెలకు 50 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తోంది.

రోహిత్, విరాట్ లను మించిన ద్రావిడ్...

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కమ్ దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీలను మించి రాహుల్ ద్రావిడ్ కే బీసీసీఐ అధికంగా జీతం చెల్లిస్తోంది. బీసీసీఐ నుంచి వార్షిక కాంట్రాక్టు ద్వారా ఏడాదికి 7 కోట్ల రూపాయల చొప్పున..రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ వేతనంగా అందుకొంటున్నారు. అయితే..గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో మ్యాచ్ లు ఆడకపోయినా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.

అదే భారత ప్రధాన శిక్షకుడిగా రాహుల్ ద్రావిడ్ మాత్రం కెప్టెన్ రోహిత్, మాజీ కెప్టెన్ కొహ్లీల కంటే 5 కోట్ల రూపాయలు ఎక్కువగా ఆర్జిస్తున్నాడు.

గతంలో భారత్ కు చీఫ్ కోచ్ గా వ్యవహరించిన అనిల్ కుంబ్లే 7 కోట్ల రూపాయలు, రవిశాస్త్రి 9 కోట్ల 50 లక్షల రూపాయలు చొప్పున వేతనం అందుకొన్నారు.

భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తర్వాత..అత్యధిక వేతనం అందుకొన్న క్రికెట్ శిక్షకుడిగా ఆస్ట్ర్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ నిలిచాడు. లాంగర్ జీతం 4 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే.

మొత్తం మీద..భారత్ తరపున 100కు పైగా టెస్టులు, 200కు పైగా వన్డేలు ఆడిన సమయంలో సంపాదించలేని మొత్తాన్ని రాహుల్ ద్రావిడ్..రిటైర్మెంట్ తర్వాత చీఫ్ కోచ్ గా సంపాదిస్తూ వారేవ్వా అనిపించుకొంటున్నాడు.

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వేతనం అందుకొంటున్న ప్రధాన శిక్షకుడు ఎవరంటే రాహుల్ ద్రావిడ్ మాత్రమే అని చెప్పక తప్పదు.

Tags:    
Advertisement

Similar News