డ్రెస్సింగ్ రూమ్ చర్చలు మన మధ్యే ఉండాలి
డ్రెస్సింగ్ రూమ్‌లో లుకలుకలంటూ వస్తున్నవి వార్తలు మాత్రమేనన్న హెడ్ కోచ్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటతీరుపై హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం హీటెక్కిందని.. సెలక్షన్ కమిటీ, కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్‌కు విభేదాలు వచ్చినట్లు ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై తాజాగా కోచ్ గంభీర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్లు, కోచ్‌కు మధ్య చర్చ డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం కావాలని.. అవి బైటికి రాకూడదని సూచించారు.
ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్‌కు ముందు గంభీర్ మీడియాతో మాట్లడారు. డ్రెస్సింగ్ రూమ్‌లో లుకలుకలంటూ వస్తున్నవి వార్తలు మాత్రమే. వాస్తవాలు కాదు. డ్రెస్సింగ్ రూమ్‌లో మేం మాట్లాడుకునేది ఒకే ఒక్క విషయం గురించి. అది ఆటగాళ్ల ఆటతీరుపైనే. వాళ్ల ప్రదర్శనపై నిజాయితీ అక్కడ చర్చిస్తాం. ఇది చాలా ముఖ్యమైనది. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్, ఆటగాళ్ల మధ్య జరిగే చర్చ అక్కడివరకు మాత్రమే పరిమితం కావాలి. బైటికి రాకూడదు. అక్కడ నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉన్నంతవరకు భారత క్రికెట్ భద్రంగా ఉంటుందని గంభీర్ వ్యాఖ్యానించాడు.
జట్టుగా ఏయే విషయాలపై పనిచేయాలనేది ఇక్కడ ప్రతి వ్యక్తికి తెలుసు. టెస్ట్ మ్యాచ్‌లు ఎలా గెలవాలన్నదానిపైనే మేం చర్చించుకున్నాం. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోనూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు అని హెడ్ కోచ్ ఈ సందర్భంగా తెలిపాడు.
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 20.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి టీమిండియా పరాజయం పాలైన విషయం విదితమే. దీని అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి గంభీర్ కఠిన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగింది చాలు అని గంభీర్ అన్నాడట. జట్టు ప్రదర్శనను విశ్లేషించే క్రమంలో ఆగటగాళ్ల తప్పులను ఎత్తిచూపెట్టడానికి అతను మాత్రం వెనుకాడలేదు. ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించనప్పటికీ కొందరు ఆటగాళ్లు పరిస్థితులకు తగినట్లు ఆడకుండా, సహజమైన ఆట పేరుతో సొంత ఆట ఆడుతున్నారని గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇది చర్చనీయాంశంగా మారడంతో దీనిపై కోచ్ స్పష్టతనిచ్చాడు.