హార్థిక్ పాండ్యాకు టీమ్ మేనేజ్ మెంట్ హుకుం!

భారత మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు టీమ్ మేనేజ్ మెంట్ హుకుం జారీ చేసింది.టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటు కావాలంటే బౌలింగ్ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.

Advertisement
Update:2024-04-20 17:57 IST

భారత మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు టీమ్ మేనేజ్ మెంట్ హుకుం జారీ చేసింది.టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటు కావాలంటే బౌలింగ్ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది..

కరీబియన్ ద్వీపాలు, అమెరికా సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు ఎంపికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ జట్టు కూర్పుపై ఊహాగానాలు జోరందుకొన్నాయి.

రోహిత్ శర్మ నాయకత్వంలోని 15 మంది సభ్యులజట్టులో 10 మంది ఆటగాళ్లకు చోటు ఖాయం కాగా ..మిగిలిన ఐదుస్థానాల కోసం పోటీ రసవత్తరంగా సాగుతోంది.

పేస్ ఆల్ రౌండర్ గానే పాండ్యాకు చోటు...

ప్రస్తుత ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్థిక్ పాండ్యాకు భారత టీమ్ మేనేజ్ మెంట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. కేవలం బ్యాటింగ్ తోనే జట్టులో చోటు కావాలంటే కుదరదని, తన కోటా నాలుగు ఓవర్లు బౌల్ చేసి తీరాలని స్పష్టం చేసింది. దానికి తగ్గట్టుగా ఫిట్ నెస్ మెరుగుపరచుకోవాలని సూచించింది.

మీడియం పేస్ ఆల్ రౌండర్ గానే హార్థిక్ పాండ్యాకు భారతజట్టులో చోటు కల్సిస్తామని వివరించింది.

ఎవరా ఐదుగురు...?

ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్, యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, పేస్ జోడీ మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ లతో పాటు స్పిన్ జాదూ కుల్దీప్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ లకు ఇప్పటికే చోటు ఖాయమైపోయింది. ఈ పదిమంది ఎంపిక తథ్యంకాగా..మిగిలిన ఐదుస్థానాల కోసం పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లు పోటీపడుతున్నారు.

ప్రయోగాలకు తావేలేదు....

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక సంఘం కొత్త ఆటగాళ్లతో ప్రయోగాలకు దిగే ఆలోచన లేనేలేదని పరోక్షంగా తెలిపింది. ప్రస్తుత ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్ల ఆటతీరు, ఫామ్ ను దృష్టిలో ఉంచుకొనే మిగిలిన ఐదుస్థానాలను భర్తీ చేయాలని భావిస్తోంది.

చివరి ఐదు బెర్‌ ల్లో బ్యాకప్ ఓపెనర్, రెండో వికెట్ కీపర్, ఫినిషర్, బ్యాకప్ స్పిన్నర్ ఖాళీలకు ప్రాధాన్యమివ్వనున్నారు. జూన్ 2 నుంచి మూడువారాలపాటు జరుగనున్న ఈ ప్రపంచకప్ కు పటిష్టమైన, పవర్ ఫుల్ జట్టునే ఎంపిక చేయాలని అజిత్ అగార్కర్ అండ్ కో గట్టిపట్టుదలతో ఉంది.

బ్యాకప్ ఓపెనర్ స్థానం కోసం శుభ్ మన్ గిల్ తో యశస్వీ జైశ్వాల్ పోటీపడుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లో ఇప్పటి వరకూ ఆడిన 7 రౌండ్ల మ్యాచ్ ల్లో యశస్వీ కంటే శుభ్ మన్ గిల్ మాత్రమే నిలకడగా ఆడుతూ ఎక్కువ పరుగులు సాధించడం ద్వారా తన ఫామ్ ను చాటుకోగలిగాడు. 7 రౌండ్లలో గిల్ 263 పరుగులు సాధించాడు.యశస్వీ మాత్రం 7 గేమ్ ల్లో 121 పరుగులతో వెనుకబడి పోయాడు.

రాహుల్ తో సంజు శాంసన్ పోటీ..

రెండో వికెట్ కీపర్ బ్యాటర్ బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ సంజు శాంసన్, లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ప్రధానంగా పోటీపడుతున్నారు.

సంజు శాంసన్ 7 రౌండ్లలో 276 పరుగులు సాధిస్తే..రాహుల్ 204 పరుగులు మాత్రమే నమోదు చేయగలిగాడు. ఫినిషర్ స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్ పేస్ ఆల్ రౌండర్ శివం దూబే, కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ ల నడుమ గట్టిపోటీనే నెలకొని ఉంది. శివం దూబే 160కి పైగా స్ట్ర్రయిక్ రేట్ తో 242 పరుగులు సాధిస్తే..రింకూ సింగ్ 83 పరుగులు మాత్రమే సాధించగలిగాడు.

బ్యాకప్ స్పిన్నర్ బెర్త్ కోసం యజువేంద్ర చహాల్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్ పోటీపడుతున్నారు. యజువేంద్ర చహాల్, రవి బిష్నోయ్ లలో ఒకరికి మాత్రమే తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

అదనపు పేసర్ బెర్త్ కోసం ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్ పోటీపడుతున్నారు. ఇప్పటికే ప్రధాన పేసర్లుగా బుమ్రా, సిరాజ్ తమ స్థానాలను ఖాయం చేసుకొన్నారు.

ఈనెల ఆఖరి వారంలో 15 మంది సభ్యుల భారతజట్టు వివరాలను ముంబైలో బీసీసీఐ ఎంపిక సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఐసీసీ టీ-20 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉన్న భారత్..ఆరునూరైనా 2007 తరువాత టీ-20 ప్రపంచకప్ నెగ్గితీరాలన్నపట్టుదలతో ఉంది.

Tags:    
Advertisement

Similar News