నాకు ఏడాది పట్టింది.. నువ్వు త్వరలోనే 50కి చేరుకో.. కోహ్లీకి సచిన్ మెసేజ్
కోహ్లీ తన రికార్డును సమం చేయడంతో సచిన్ టెండుల్కర్ కూడా స్పందించాడు.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ నమోదు చేశారు. కొంత కాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. తన శైలికి భిన్నంగా ఇవ్వాళ చాలా ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో 119 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ కెరీర్‌లో ఇది 49వ వన్డే సెంచరీ. వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన సచిన్ రికార్డును ఇవ్వాళ కోహ్లీ సమం చేశాడు.
సచిన్ టెండుల్కర్ 451 ఇన్నింగ్స్‌లో 49 సెంచరీలు చేయగా.. కోహ్లీ మాత్రం కేవలం 277వ ఇన్నింగ్స్‌లోనే 49 సెంచరీలు మార్కు అందుకోవడం గమనార్హం. ఒక రకంగా సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించాడనే భావించవచ్చు. ఇక కోహ్లీ ఇవ్వాళ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా 121 బంతులు ఆడి 101 పరుగులు చేశాడు. కోహ్లీ తన రికార్డును సమం చేయడంతో సచిన్ టెండుల్కర్ కూడా స్పందించాడు.
'చాలా చక్కగా ఆడావు విరాట్. నాకు 49 నుంచి 50కి రావడానికి ఈ ఏడాది 365 రోజులు పట్టింది. కానీ నువ్వు మరి కొన్ని రోజుల్లోనే 49 నుంచి 50కి వచ్చి నా రికార్డును బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. కంగ్రాట్స్' అంటూ సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా మెసేజ్ పెట్టాడు. కాగా సచిన్ ఈ ఏడాదే 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తన ఏజ్ 49 నుంచి 50కి రావడానికి ఏడాది పట్టింది. కానీ నువ్వు మాత్రం 50కి (సెంచరీలకి) త్వరలోనే చేరుకో అని సరదాగా పోస్టు చేశాడు.