హైదరాబాద్ లో నేటినుంచి ఐపీఎల్ హంగామా!
ఐపీఎల్-17వ సీజన్ హంగామాకు హైదరాబాద్ సిద్ధమయ్యింది. ఈ రోజు జరిగే లీగ్ పోరులో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి.
ఐపీఎల్-17వ సీజన్ హంగామాకు హైదరాబాద్ సిద్ధమయ్యింది. ఈ రోజు జరిగే లీగ్ పోరులో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి.
దేశంలోని వివిధ నగరాలు వేదికలుగా జరుగుతున్న ఐపీఎల్-2024 సీజన్ షో హైదరాబాద్ నగరానికి చేరింది. ప్రస్తుత 17వ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హోంగ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మొత్తం ఐదురౌండ్ల మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనుంది.
ఓటమితో టైటిల్ వేట ముంబైకి మామూలే...
ప్రస్తుత సీజన్ లీగ్ తొలిరౌండ్ ను ఓటమితో మొదలు పెట్టిన సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఈ రోజు జరిగే మ్యాచ్ ద్వారా బోణీ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాయి.
ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు హార్థిక్ పాండ్యా, పాట్ కమిన్స్ నాయకత్వంలో రెండుజట్లూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
ఐపీఎల్ సీజన్ తొలిమ్యాచ్ ను ఓటమితో మొదలు పెట్టడం 2013 నుంచి ముంబైకి ఓ ఆనవాయితీగా వస్తోంది. గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన ప్రారంభమ్యాచ్ లో విజయం అంచుల వరకూ వచ్చిన ముంబై చివర్లో చతికిలపడిపోయింది.
ఆఖరి 6 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన ముంబై చివరకు 42 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల పరాజయం చవిచూసింది.మరోవైపు కోల్ కతా ప్రత్యర్థిగా ఆడిన తన తొలిరౌండ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ సైతం చేజింగ్ లో విఫలమయ్యింది. 209 పరుగుల భారీలక్ష్యానికి చేరువగా వచ్చి ఓటమి పాలయ్యింది. ఆఖరి 5 బంతుల్లో 7 పరుగులు సాధించలేకపోయింది.
సన్ రైజర్స్ కు ముంబై గండం...
హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ఆతిథ్యజట్టుకంటే ముంబైజట్టుకే మెరుగైన రికార్డు ఉంది. ఇదే వేదికగా ఆడిన గత రెండుమ్యాచ్ ల్లోనూ ముంబైజట్టే విజేతగా నిలిచింది.
గత సీజన్ పోరులో 201 పరుగుల భారీలక్ష్యాన్ని ముంబై అలవోకగా చేదించగలిగింది. అంతేకాదు..గత సీజన్లో సన్ రైజర్స్ తన హోంగ్రౌండ్లో చవిచూసిన మొత్తం 6 పరాజయాలలో ముంబై చేతిలో పొందినది కూడా ఒకటి కావడం విశేషం.
రాజీవ్ స్టేడియం పిచ్ ఇటు బ్యాటర్లకూ..అటు బౌలర్లకు సమానంగా ఉపకరిస్తుందని, గత సీజన్లో సగటున మ్యాచ్ కు 180 పరుగుల స్కోర్లు నమోదయ్యాయని క్యూరేటర్ చెబుతున్నారు.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 180కి పైగా స్కోరు సాధించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి. రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే ముంబై 12, సన్ రైజర్స్ 9
విజయాల రికార్డుతో ఉన్నాయి.
2020 తరువాత నుంచి ఈ రెండుజట్లు 7సార్లు పోటీపడితే ముంబై 5 విజయాలతో నిలిచింది.
రెండుజట్లకూ గాయాల దెబ్బ...
మ్యాచ్ ను మలుపు తిప్పేసత్తా కలిగిన ఆటగాళ్లు లేకుండా రెండుజట్లూ పోటీకి దిగుతున్నాయి. మ్యాజిక్ స్పిన్నర్ వనిందు హసరంగ లేకుండా హైదరాబాద్, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ లేకుండా ముంబై బరిలో నిలుస్తున్నాయి.
ముంబై ఓపెనింగ్ జోడీ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలకు సన్ రైజర్స్ సారథి పాట్ కమిన్స్, వాషింగ్టన్ సుందర్ ల నుంచి ముప్పు పొంచి ఉంది. ముంబై కెప్టెన్ పాండ్యా పై సన్ రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కు సైతం గట్టి పట్టే ఉంది.
మయాంక్ అగర్వాల్, మర్కరమ్, క్లాసెన్ జెన్సన్ లపైనే హైదరాబాద్ బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది. బౌలింగ్ లో నటరాజన్ ను ఇంపాక్ట్ సబ్ స్టి ట్యూట్ గా ప్రయోగిస్తున్నారు.
ముంబై జయాపజయాలు ఓపెనింగ్ జోడీ ఇషాన్- రోహిత్ ఇచ్చే ఆరంభం పైనే ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో జస్ ప్రీత్ బుమ్రా మరోసారి తురుపుముక్క కానున్నాడు. ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ గా వీరబాదుడు డేవాల్డ్ బ్రేవిస్ ను ముంబై వాడుకోనుంది.
రోహిత్, బుమ్రాలను ఊరిస్తున్న రికార్డులు...
ముంబై ఓపెనింగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మరో 2 వికెట్లు పడగొడితే 150 వికెట్లు సాధించిన భారత రెండో బౌలర్ గా నిలువగలుగుతాడు. సన్ రైజర్స్ పేసర్ భువనేశ్వర్ ఇప్పటికే 150కి పైగా వికెట్లతో టాపర్ గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో నిలిచే అవకాశం ప్రస్తుత ఈ మ్యాచ్ ద్వారా బుమ్రాకు దక్కనుంది.
ఓపెనర్ కమ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఫ్రాంచైజీ తరపున ఈ రోజు తన 200వ మ్యాచ్ ఆడనున్నాడు. గతంలో ఇదే ఘనత సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల సరసన నిలువనున్నాడు.
రాత్రి 7-30 గంటలకు ప్రారంభంకానున్న ఈ పోరు కోసం భారీసంఖ్యలో అభిమానులు తరలి రానున్నారు. ప్రస్తుత సీజన్ లో హైదరాబాద్ వేదికగా ఇదే తొలిమ్యాచ్ కావడంతో
ఎక్కడలేని ఉత్కంఠ జంటనగరాల అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.