రాజస్థాన్ రాయల్స్ గూటికి రాహుల్ ద్రావిడ్!
భారత మాజీ ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ తిరిగి రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరడం దాదాపు ఖాయమైపోయింది. 2025 ఐపీఎల్ లో జైపూర్ ఫ్రాంచైజీకి చీఫ్ కోచ్ హోదాలో నేతృత్వం వహించనున్నాడు.
భారత మాజీ ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ తిరిగి రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరడం దాదాపు ఖాయమైపోయింది. 2025 ఐపీఎల్ లో జైపూర్ ఫ్రాంచైజీకి చీఫ్ కోచ్ హోదాలో నేతృత్వం వహించనున్నాడు.
భారత క్రికెట్ జట్టును గత మూడేళ్లుగా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలపడంతో పాటు 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను అందించిన ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్..త్వరలో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నాడు.
టీ-20 ప్రపంచకప్ తో పాటే బీసీసీఐతో రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు సైతం ముగిసిపోయింది. గత కొద్దివారాలుగా నిరుద్యోగిగా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ లో తన మాజీ ఫ్రాంచైజీ జైపూర్ చీఫ్ కోచ్ గా తిరిగి బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమైపోయింది.
కెప్టెన్ గా, మెంటార్ గా, ప్రధాన శిక్షకుడిగా...
51 సంవత్సరాల రాహుల్ ద్రావిడ్ కు జైపూర్ ( రాజస్థాన్ రాయల్స్ ) ఫ్రాంచైజీతో చక్కటి, చిక్కటి అనుబంధమే ఉంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న ద్రావిడ్ ఆ తరువాత జట్టుకెప్టెన్ గా, రిటైర్మెంట్ తరువాత మెంటార్ గా, చీఫ్ కోచ్ గా కూడా వ్యవహరించాడు.
2008 ప్రారంభ ఐపీఎల్ సీజన్ నుంచి ద్రావిడ్ సుదీర్ఘకాలం జైపూర్ ప్రాంచైజీతో తన అనుబంధాన్ని వివిధ స్థాయిలలో కొనసాగిస్తూ వచ్చాడు. 2013లో ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్స్ చేర్చడంతో పాటు..చాంపియన్స్ లీగ్ టీ-20 ఫైనల్స్ కు సైతం రాజస్థాన్ రాయల్స్ ను చేర్చిన రికార్డు ద్రావిడ్ కు ఉంది. ద్రావిడ్ నాయకత్వంలో 40 మ్యాచ్ లు ఆడిన జైపూర్ జట్టు 23 విజయాలు సాధించడం కూడా ఓ రికార్డే.
రెండుసీజన్లపాటు రాజస్థాన్ రాయల్స్ కు మెంటార్ గా సేవలు అందించిన ద్రావిడ్ ను భారత అండర్ -19 జట్టుకు చీఫ్ కోచ్ గా బీసీసీఐ నియమించింది. భారత జూనియర్ జట్టును అండర్ -19 ప్రపంచకప్ విజేతగా నిలిపిన ద్రావిడ్ 2021 సీజన్ నుంచి భారత సీనియర్ జట్టు ప్రధాన శిక్షకుడుగా వ్యవహరించాడు. నెలకు కోటి రూపాయల వేతనం పై చీఫ్ కోచ్ గా సేవలు అందించాడు.
రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా, రోహిత్ శర్మ కెప్టెన్ గా భారతజట్టు క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. ఐసీసీ టెస్టు లీగ్ రన్నరప్, 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ రన్నరప్ స్థానాలు సాధించిన భారత్ ..చివరకు టీ-20 ప్రపంచకప్ విజేతగా కూడా నిలువగలిగింది.
ఐపీఎల్ 18వ సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ ప్రధాన శిక్షకుడిగా ద్రావిడ్ మరోసారి పగ్గాలు చేపడితే..కుమార సంగక్కర కేవలం జైపూర్ ఫ్రాంచైజీ డెైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.