టీ-20 క్రికెట్లో భారత్ రికార్డుల మోత!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్, విశ్వవిజేత భారత్ మరో రెండు సరికొత్త రికార్డులు నెలకొల్పింది....

Advertisement
Update:2024-07-16 16:16 IST

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్, విశ్వవిజేత భారత్ మరో రెండు సరికొత్త రికార్డులు నెలకొల్పింది....

టీ-20 ఫార్మాట్లో భారత్ జోరు కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమజట్టుగా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ర్యాంకింగ్స్, విజయాలు, సిరీస్ లు, ట్రోఫీల సాధనలో తనకు తానే సాటిగా నిలుస్తూ వస్తోంది.

జింబాబ్వే గడ్డపై జంట రికార్డులు...

ఐసీసీ తాజా టీ-20 ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచ నంబర్ వన్ స్థానంలో నిలిచిన భారత గత రెండేళ్లుగా స్థాయికి తగ్గట్టుగా రాణిస్తూ వస్తోంది. ద్వైపాక్షిక సిరీస్ లు, ఆసియాకప్, ఆసియాక్రీడలు లాంటి టోర్నీలలో మాత్రమే కాదు..ఐసీసీ ప్రపంచకప్ లోనూ తిరుగులేని విజేతగా నిలిచింది.

ఇటీవలే కరీబియన్ ద్వీపాలు- అమెరికా క్రికెట్ బోర్డు సంయుక్త ఆతిథ్యంలో జరిగిన 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను సైతం రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు గెలుచుకొని 17 ఏళ్ల తరువాత మరోసారి విశ్వవిజేతగా నిలిచింది.

ప్రపంచకప్ విజయం తరువాత కెప్టెన్ రోహిత్, వైస్ కెప్టెన్ పాండ్యా, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ జస్ ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్ స్టార్లు విశ్రాంతి తీసుకోడంతో..జింబాబ్వే టూర్ కోసం శుబ్ మన్ గిల్ నాయకత్వంలోని యువజట్టును ఎంపిక చేశారు.

విదేశీగడ్డపై అత్యధిక విజయాల భారత్...

జింబాబ్వేతో హరారే వేదికగా జరిగిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను భారత్ గెలుచుకోడం ద్వారా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకూ పాకిస్థాన్ పేరుతో ఉన్న

అత్యధిక విదేశీ విజయాల రికార్డును గిల్ నాయకత్వంలోని భారతజట్టు తెరమరుగు చేసింది. పాక్ జట్టు పేరుతో ఉన్న 50 విదేశీ విజయాల రికార్డును భారత్ 51 విజయాలతో సవరించింది.

సిరీస్ లోని తొలి టీ-20లో 13 పరుగుల తేడాతో పరాజయం పొందిన భారత్..ఆ తరువాతి నాలుగు మ్యాచ్ ల్లోనూ వరుస విజయాలతో సిరీస్ విజేత గా నిలిచింది.

టీ-20 చరిత్రలో తొలిజట్టు భారత్...

టీ-20 క్రికెట్ చరిత్రలో 150 విజయాలు సాధించిన తొలిజట్టుగా భారత్ మరో రికార్డును నమోదు చేసింది. జింబాబ్వేసిరీస్ లో మూడో టీ-20 మ్యాచ్ విజయంతో 150 విజయాల రికార్డు సాధించిన తొలిజట్టు ఘనతను భారత్ సాధించింది. నాలుగో టీ-20లో 10 వికెట్ల గెలుపు, ఆఖరి టీ-20లో 8 వికెట్ల విజయంతో 152 అంతర్జాతీయ విజయాలు సాధించిన ఏకైకజట్టుగా అవతరించింది.

పాకిస్థాన్ 142 విజయాలతో రెండు, 111 విజయాలతో న్యూజిలాండ్ మూడు, 105 విజయాలతో ఆస్ట్ర్రేలియా నాలుగు, 104 విజయాలతో దక్షిణాఫ్రికా ఐదు, 100 విజయాలతో ఇంగ్లండ్ ఆరు స్థానాలలో కొనసాగుతున్నాయి.

ఐపీఎల్ పుణ్యమా అంటూ తన టీ-20 ప్రమాణాలను అనూహ్యంగా మెరుగు పరచుకొన్న భారత్ జోరు, ఆధిపత్యం 2027 ప్రపంచకప్ వరకూ కొనసాగుతుందో..లేదో...వేచిచూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News