నేటినుంచే శాఫ్ సాకర్, పాక్ తో భారత్ తొలిసమరం!

దక్షిణాసియా దేశాల ఫుట్ బాల్ సమరంలో తొలిపోరులో భారత్ ను పాకిస్థాన్ ఢీ కొనబోతోంది. బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియం వేదికగా ఈరోజు.. ఈ సమరం ప్రారంభంకానుంది.

Advertisement
Update:2023-06-21 14:00 IST

దక్షిణాసియా దేశాల ఫుట్ బాల్ సమరంలో తొలిపోరులో భారత్ ను పాకిస్థాన్ ఢీ కొనబోతోంది. బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియం వేదికగా ఈరోజు.. ఈ సమరం ప్రారంభంకానుంది.

దక్షిణాసియా దేశాల నడుమ గత రెండుదశాబ్దాలుగా జరుగుతున్న శాఫ్ కప్ -2023 సమరానికి భారత్ వేదికగా నిలిచింది. బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియం వేదికగా జూన్ 21 నుంచి జూలై 4 వరకూ జరిగే గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో మొత్తం 8 దేశాలజట్లు ఢీ కొనబోతున్నాయి.

కువైట్, లెబనాన్ దేశాలజట్లు ప్రస్తుత 14వ శాఫ్ కప్ ద్వారా అరంగేట్రం చేయనున్నాయి.

8 దేశాలు- రెండు గ్రూపులు..

టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 8 దేశాలను రెండు గ్రూపులుగా విభజించి లీగ్ దశ పోటీలు నిర్వహిస్తున్నారు. లీగ్ కమ్ నాకౌట్ తరహాలో జరిగే మొత్తం 15 మ్యాచ్ లకూ శ్రీకంఠీరవ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

1993 నుంచి క్రమం తప్పకుండా రెండేళ్లకోమారు జరుగుతూ వస్తున్న ఈ టోర్నీలో ఎనిమిది దేశాల జట్లు మాత్రమే తలపడుతూ వస్తున్నాయి. ఈ పరంపరలో భాగంగా ఇప్పుడు 14వ శాఫ్ కప్ సమరాన్ని భారత ఫుట్ బాల్ సమాఖ్య నిర్వహిస్తోంది.

గ్రూప్- ఏ లీగ్ లో భారత్, పాకిస్థాన్, నేపాల్, కువైట్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ - బీ లీగ్ లో లెబనాన్, బంగ్లాదేశ్, భూటాన్ , మాల్దీవుల జట్లు పోటీపడనున్నాయి.

గ్రూప్ లీగ్ దశలో మొదటి రెండుస్థానాలలో నిలిచిన నాలుగుజట్లు ..నాకౌట్ సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

శాఫ్ సాకర్ కు మరోపేరు భారత్...

గత 13 శాఫ్ సాకర్ టోర్నీలలో 12సార్లు ఫైనల్స్ చేరిన ఏకైకజట్టు భారత్ మాత్రమే. మొత్తం 12 ఫైనల్స్ ఆడిన భారత్ ..రికార్డుస్థాయిలో ఎనిమిదిసార్లు విజేతగా నిలిచింది.

ప్రస్తుతం డిఫెండింగ్ చాంపియన్ గా ఉన్న భారత్ 2021 టోర్నీ ఫైనల్లో నేపాల్ ను 3-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా ఎనిమిదోసారి ట్రోఫీ అందుకొంది.

భారత్ తర్వాత..అత్యధిక శాఫ్ టైటిల్స్ నెగ్గిన జట్టుగా మాల్దీవ్స్ నిలిచింది. మాల్దీవ్స్ రెండుసార్లు శాఫ్ ట్రోఫీ నెగ్గడం ద్వారా భారత్ తర్వాతి స్థానంలో నిలిస్తే..బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి టైటిల్ సాధించాయి.

భారతజట్టుదే అత్యుత్తమ ర్యాంక్...

ప్రస్తుత శాఫ్ టోర్నీలో తలపడుతున్న మొత్తం ఎనిమిదిజట్లలో భారత్ దే అత్యుత్తమ ర్యాంకుగా ఉంది. సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారతజట్టు 101వ ర్యాంకులో ఉంటే.. కువైట్ 143,నేపాల్ 174, పాకిస్థాన్ 195వ ర్యాంకు జట్లుగా ఉన్నాయి.

రెండుసార్లు విజేత మాల్దీవ్స్ 154, భూటాన్ 185, బంగ్లాదేశ్ 192 ర్యాంకులలో ఉన్నాయి.

గత కొద్దిసంవత్సరాలుగా నిషేధంలో ఉన్న పాక్ ఫుట్ బాల్ జట్టు ఐదేళ్ల విరామం తర్వాత భారత్ తో తలపడబోతోంది. 101 ర్యాంకర్ భారత్ కు 195 వ ర్యాంకర్ పాక్ ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే.

భారత్- పాక్ జట్ల పోటీ ఈ రోజు రాత్రి 7-30 గంటలకు ప్రారంభంకానుంది. జూన్ 24న జరిగే రెండోరౌండ్ గ్రూపు పోరులో నేపాల్ తో భారత్ తలపడుతుంది. జూన్ 27న తన చివరి గ్రూప్ మ్యాచ్ ను కువైట్ తో భారత్ ఆడాల్సి ఉంది. సెమీఫైనల్స్ నాకౌట్ చేరాలంటే మూడింట రెండుమ్యాచ్ లు నెగ్గితీరాల్సి ఉంది. జులై 1న సెమీఫైనల్స్, జులై 4న ఫైనల్స్ నిర్వహిస్తారు.

పాక్ ప్రత్యర్థిగా ఉంటే ఒత్తిడి తప్పదు......

క్రీడలు ఏవైనా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ప్రత్యర్థిగా ఉంటే..భారత్ కు ఒత్తిడి అనివార్యమని కెప్టెన్ సునీల్ చెత్రీ అంటున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్, పాక్ ఆటగాళ్లు ఎంతో స్నేహంగా ఉంటారని,పంజాబీలో మాట్లాడుకొంటూ ఉంటారని, ఒక్కసారి పోటీ ప్రారంభమైతే బద్ధశత్రువులుగా మారిపోయి భీకరంగా పోరాడతారని భారత కెప్టెన్ సునీల్ చెత్రీ గుర్తు చేసుకొన్నాడు.

భారతజట్టు 13వసారి ఫైనల్ చేరి..9వసారి విజేతగా నిలుస్తుందో..లేదో తెలుసుకోవాలంటే నాకౌట్ సమరం ప్రారంభమయ్యే జులై 1 వరకూ వేచి చూడక తప్పదు. సాకర్ పండితులు మాత్రం..ప్రస్తుత 14వ శాఫ్ కప్ లో ఆతిథ్య భారత్ ను హాట్ ఫేవరెట్ గా పరిగణిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News