జింబాబ్వేతో సిరీస్ లో భారత కుర్రాళ్ల టాప్ గేర్!
జింబాబ్వేతో పాంచ్ పటకా టీ-20 సిరీస్ లో భారత యువజట్టు జోరు పెంచింది. మొదటి మూడు మ్యాచ్ లు ముగిసే సమయానికే పైచేయి సాధించింది.
జింబాబ్వేతో పాంచ్ పటకా టీ-20 సిరీస్ లో భారత యువజట్టు జోరు పెంచింది. మొదటి మూడు మ్యాచ్ లు ముగిసే సమయానికే పైచేయి సాధించింది.
జింబాబ్వే గడ్డపై భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరిగిన మూడో టీ-20 మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని భారతజట్టు ఆల్ రౌండ్ షోతో 23 పరుగుల విజయం సాధించి..సిరీస్ పై పట్టు బిగించింది.
హరారేలో ఆల్ రౌండ్ షో.....
జింబాబ్వే పర్యటనలో ద్వితీయశ్రేణిజట్టుతో పాల్గొంటున్న భారత్..తొలిమ్యాచ్ ను ఓటమితో ప్రారంభించినా..ఆ తర్వాతి రెండు మ్యాచ్ ల్లో దంచి కొట్టింది. సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియం మందకొడి వికెట్ పై తొలిపోరులో 13 పరుగులతో చతికిల పడిన భారత్..రెండోమ్యాచ్ లో 100 పరుగుల భారీవిజయంతో సమఉజ్జీగా నిలిచింది.
ఇక..సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన మూడో మ్యాచ్ లో భారతయువజట్టు ఆల్ రౌండ్ షోతో రాణించింది. జింబాబ్వే ఫీల్డర్లు విడిచి పెట్టిన క్యాచ్ లతో భారత బ్యాటర్లు పుంజుకోగలిగారు.
బ్యాటింగ్ కు అంతగా అనువుకాని హరారే పిచ్ పైన భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 4 వికెట్లకు 182 పరుగుల భారీస్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు.
గిల్- రుతురాజ్ ధనాధన్..
అంతకుముందు మూడుమార్పులతో పోటీకి దిగిన భారత ఇన్నింగ్స్ ను యశస్వీ జైశ్వాల్- శుభ్ మన్ గిల్ ప్రారంభించారు. యశస్వి 26 బంతుల్లోనే 37 పరుగులు చేసి అవుటయ్యాడు. వన్ డౌన్ అభిషేక్ శర్మ సైతం 9 బంతుల్లో 10 పరుగుల స్కోరుకే వెనుదిరిగాడు.
ఆ తరువాత వచ్చిన రుతురాజ్ గయక్వాడ్ తో కలసి శుభ్ మన్ గిల్ తన పరుగుల వేట కొనసాగించాడు. గిల్ 49 బంతుల్లో 66 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
గిల్ హాఫ్ సెంచరీలో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
మరోవైపు..రుతురాజ్ 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. సంజు శాంసన్ 10, రింకూ సింగ్ 1 పరుగుతో నాటౌట్ గా నిలవడంతో...భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 182 పరుగుల స్కోరు సాధించగలిగింది.
జింబాబ్వే బౌలర్లు, ఫీల్డర్లు కలసి 20 అదనపు పరుగులు ఇవ్వడంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయగలిగింది. జింబాబ్వే బౌలర్లలో పేసర్ ముజర్ బానీ, కెప్టెన్ కమ్ స్పిన్నర్ సికిందర్ రాజా చెరో 2 వికెట్లు పడగొట్టారు.
డియోన్ మేయర్స్ ఒంటరిపోరాటం...
మ్యాచ్ నెగ్గాలంటే 183 పరుగులు చేయాల్సిన జింబాబ్వే ఏదశలోనూ లక్ష్యం సాధించేలా కనిపించలేదు. డియోన్ మేయర్స్ ఒక్కడే 49 బంతుల్లో 65 పరుగుల నాటౌట్ స్కోరుతో ఒంటరిపోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. క్లయివ్ మడాండే 37 పరుగులు సాధించాడు. చివరకు జింబాబ్వే 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు, ఆవేశ్ ఖాన్ 2, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు. భారత్ 23 పరుగుల విజయంలో ప్రధానపాత్ర వహించిన వాషింగ్టన్ సుందర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సిరీస్ లోని నాలుగో టీ-20 ఈనెల 13న జరుగనుంది. నాలుగో టీ-20 మ్యాచ్ సైతం నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.
సీనియర్ స్టార్లు రోహిత్, విరాట్, జడేజా టీ-20కి రిటైర్మెంట్ ప్రకటించడం, బుమ్రా లాంటి పలువురు సీనియర్లకు విశ్రాంతి నివ్వడంతో ఎక్కువమంది యువఆటగాళ్లతో భారత్ ప్రస్తుత ఈ సిరీస్ లో పోటీపడుతోంది.