40 ఏళ్ల వయసులో శరత్.. కమాల్!.. కామన్వెల్త్ గేమ్స్ టీటీలో రెండు స్వర్ణాలు
వరుసగా గత ఐదు కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటూ వచ్చిన శరత్ కమల్ 2006 గేమ్స్ పురుషుల సింగిల్స్ లో తొలిసారిగా బంగారు పతకం సాధించాడు. ఆ తర్వాత ప్రస్తుత 2022 గేమ్స్ లో తిరిగి పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాడు.
బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ లో భారత దిగ్గజ ఆటగాడు, తెలుగు తేజం శరత్ కమల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్ లో 16 సంవత్సరాల విరామం తర్వాత బంగారు పతకం సాధించి తనకు తానే సాటిగా నిలిచాడు. నాలుగు పదుల వయసులో రెండు స్వర్ణాలతో సహా మొత్తం మూడు పతకాలు సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.
5 కామన్వెల్త్ గేమ్స్- 13 పతకాలు
వరుసగా గత ఐదు కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటూ వచ్చిన శరత్ కమల్ 2006 గేమ్స్ పురుషుల సింగిల్స్ లో తొలిసారిగా బంగారు పతకం సాధించాడు. ఆ తర్వాత నుంచి డబుల్స్, మిక్సిడ్ డబుల్స్, టీమ్ విభాగాలలో పతకాలు సాధిస్తూ వచ్చిన శరత్.. ప్రస్తుత 2022 గేమ్స్ లో తిరిగి పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాడు. హోరాహోరీగా సాగిన గోల్డ్ మెడల్ సమరంలో శరత్ కమల్ 11-13, 11-7, 11-2, 11-, 11-8 తో ఇంగ్లండ్ ఆటగాడు లైమ్ ఫిచ్ ఫోర్డ్ ను చిత్తు చేసి బంగారు పతకం అందుకున్నాడు. 24 సంవత్సరాల వయసులో సింగిల్స్ తొలి స్వర్ణ పతకం సాధించిన శరత్ మరో బంగారు పతకం కోసం 16 సంవత్సరాలపాటు ఓపికగా వేచి చూడాల్సి వచ్చింది. ప్రస్తుత బర్మింగ్ హామ్ గేమ్స్ పురుషుల డబుల్స్ లో రజత, టీమ్ విభాగంలో స్వర్ణ, మిక్సిడ్ డబుల్స్ లో ఆకుల శ్రీజతో కలసి బంగారు పతకాలు సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించడానికి వయసుతో ఏమాత్రం పనిలేదని శరత్ కమల్ చాటి చెప్పాడు. నాలుగు పదుల వయసు కేవలం ఓ అంకే మాత్రమేనని, అంకితభావం, నిరంతరసాధన, ఆడే క్రీడపట్ల ప్రేమ ఉంటే వయసును అధిగమించవచ్చని రాజమహేంద్రవరానికి చెందిన శరత్ కమల్ నిరూపించాడు.