రోహిత్, విరాట్ అల్విదా... విజేత భారత్ కు 20 కోట్ల ప్రైజ్ మనీ!

భారత టీ-20 క్రికెట్ చరిత్రలో ఇద్దరు మేటి బ్యాటర్ల శకం ముగిసింది. 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకోడంతోనే..కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తమ రిటైర్మెంట్ ను ప్రకటించారు.

Advertisement
Update: 2024-06-30 06:29 GMT

టీ-20 ఫార్మాట్లో భారత్ ను ప్రపంచ చాంపియన్ గా నిలపడంతో తమ టీ-20 కెరియర్ ను ముగించినట్లు భారత స్టార్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ప్రకటించారు...

భారత టీ-20 క్రికెట్ చరిత్రలో ఇద్దరు మేటి బ్యాటర్ల శకం ముగిసింది. 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకోడంతోనే..కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తమ రిటైర్మెంట్ ను ప్రకటించారు. వన్డే, టెస్టు ఫార్మాట్లలో తమ కెరియర్ కొనసాగుతుందని తెలిపారు.

మూడో ప్రయత్నంలో కెప్టెన్ రోహిత్ సఫలం...

విరాట్ కొహ్లీ నుంచి భారతజట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ తన మూడో ప్రయత్నంలో సఫలమయ్యాడు. మూడు వేర్వేరు ప్రపంచకప్ ఫైనల్స్ లో రోహిత్ నాయకత్వంలో టైటిల్ వేటకు దిగిన భారత్..సాంప్రదాయ టెస్టు, వన్డే ఫార్మాట్లలో రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

గతేడాది జరిగిన ఐసీసీ టెస్టులీగ్, వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ లో ఆస్ట్ర్రేలియా చేతిలో పరాజయాలు చవిచూసిన భారత్ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ లో మాత్రం ఓటమి అంచుల నుంచి బయటపడి దక్షిణాఫ్రికాపై సంచలన విజయంతో విశ్వవిజేతగా అవతరించగలిగింది.

2022 టీ-20 ప్రపంచకప్ లో భారత్ కు నాయకత్వం వహించిన రోహిత్..సెమీస్ ఓటమితో తీవ్రనిరుత్సాహానికి గురయ్యాడు. అయితే..వరుసగా రెండో టీ-20 ప్రపంచకప్ సెమీస్ కు భారతజట్టు చేరడంలో ప్రధానపాత్ర వహించిన రోహిత్ ప్రపంచకప్ విజయంతో భారత్ తరపున తన టీ-20 కెరియర్ ముగిసినట్లు ప్రకటించాడు.

159 మ్యాచ్ లు...4231 పరుగులు...

2007 టీ-20 ప్రపంచకప్ ద్వారా అరంగేట్రం చేసిన రోహిత్..గత తొమ్మిది టీ-20 ప్రపంచకప్ టోర్నీలలోనూ భారత్ తరపున ఆడిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

37 సంవత్సరాల రోహిత్ 18 సంవత్సరాల తన టీ-20 ప్రస్థానంలో 159 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి 5 శతకాలు, 32 అర్థశతకాలతో 4231 పరుగులు సాధించడం ద్వారా అత్యుత్తమ, అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకడిగా మిగిలిపోయాడు.

అంతేకాదు..భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ సైతం టీ-20లకు గుడ్ బై చెప్పాడు. ప్రపంచకప్ ఫైనల్స్ లో 76 పరుగుల టాప్ స్కోర్ తో భారత్ ను విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర వహించిన విరాట్..ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ అవార్డు సైతం అందుకొన్నాడు. తన కెరియర్ లో ఆరోసారి టీ-20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న విరాట్ కెప్టెన్ గా విఫలమైనా ఓ ఆటగాడిగా మాత్రం ప్రపంచకప్ బంగారు పతకం సాధించగలిగాడు.

అప్పుడు ధోనీ- ఇప్పుడు రోహిత్...

2007లో తొలిసారిగా నిర్వహించిన టీ-20 ప్రపంచకప్ టో్ర్నీలో మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ తొలిప్రయత్నంలోనే విశ్వవిజేతగా నిలువగలిగింది. జోహెన్స్ బర్గ్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన టైటిల్ పోరులో భారత్ చాంపియన్ గా నిలవడంలో ఓపెనర్ గా రోహిత్ శర్మ ప్రధానపాత్ర వహించాడు. తిరిగి 17 సంవత్సరాల తరువాత..భారత కెప్టెన్ గా రోహిత్ తనజట్టును మరోసారి టీ-20 చాంపియన్ గా నిలుపగలిగాడు.

విశ్వవిజేతగా నిలిచిన భారతజట్టు ప్రతిష్టాత్మక ఐసీసీ ట్రోఫీతో పాటు 20 కోట్ల 42 లక్షల ( 2.45 మిలియన్ డాలర్లు )రూపాయలు అందుకొంది. ఫైనల్లో ఓడి రన్నరప్ స్థానంతో సరిపెట్టుకొన్న దక్షిణాఫ్రికా ( 1.28 మిలియన్ డాలర్లు ) 10 కోట్ల 67 లక్షల రూపాయలతో సరిపెట్టుకొంది.

అప్ఘనిస్థాన్ కు 6 కోట్ల 56 లక్షలు..

టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో పరాజయాలు పొందిన అప్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లు చెరో 6 కోట్ల 56 లక్షల ( 787,500 డాలర్లు ) రూపాయలు దక్కించుకొన్నాయి.

భారతజట్టు 11 ఏళ్ల తరువాత ఓ ఐసీసీ ట్రోఫీని, 17 సంవత్సరాల తరువాత టీ-20 ప్రపంచకప్ ను గెలుచుకోడంతో కోట్లాదిమంది అభిమానులు మాత్రమే కాదు..ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ నియంత్రణమండలి సైతం ఊపిరిపీల్చుకోగలిగింది.

Tags:    
Advertisement

Similar News