నేడే మూడో టీ-20, భారత్ కు డూ ఆర్ డై!

వెస్టిండీస్ తో టీ-20 సిరీస్ లో టాప్ ర్యాంకర్ భారత్ చావో బతుకో సమరానికి సిద్ధమయ్యింది. గయానా వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే కీలక మూడోపోరులో నెగ్గితేనే సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలుగుతుంది.

Advertisement
Update:2023-08-08 16:53 IST

వెస్టిండీస్ తో టీ-20 సిరీస్ లో టాప్ ర్యాంకర్ భారత్ చావో బతుకో సమరానికి సిద్ధమయ్యింది. గయానా వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే కీలక మూడోపోరులో నెగ్గితేనే సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలుగుతుంది...

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ర్యాంకులతో పనిలేదని, ర్యాంకులు కేవలం అంకెలు మాత్రమేనని..టాప్ ర్యాంకర్ భారత్, 7వ ర్యాంకర్ వెస్టిండీస్ జట్ల పాంచ్ పటాకా సిరీస్ చెప్పకనే చెప్పింది నువ్వానేనా అన్నట్లుగా సాగిన మొదటి రెండు మ్యాచ్ ల్లోనూ 7వ ర్యాంకర్ వెస్టిండీస్ తన కంటే ర్యాంకింగ్స్ పరంగా ఆరుస్థానాలు పైనున్న భారత్ ను కంగు తినిపించడం ద్వారా సిరీస్ విజయానికి గురి పెట్టింది.

ట్రినిడాడ్ లో ముగిసిన తొలిపోరులో 4 పరుగుల తేడాతో ఓడిన భారత్ కు గయానా ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన రెండో పోరులో 2 వికెట్ల పరాజయం తప్పలేదు.

గత ఏడేళ్లలో ఇదే మొదటిసారి....

టీ-20 ఫార్మాట్లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారతజట్టు వరుసగా రెండుమ్యాచ్ ల్లో పరాజయాలు పొందటం 2016 తర్వాత నుంచి ఇదే మొదటిసారి. అంతేకాదు..వెస్టిండీస్ పై భారత్ 17 మ్యాచ్ లు నెగ్గితే..భారత్ ప్రత్యర్థిగా కరీబియన్ జట్టుకు కేవలం 9 విజయాలు మాత్రమే ఉన్నాయి.

హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని భారతజట్టు ప్రయోగాలకు దిగటం ద్వారా చేతులు కాల్చుకొంటోంది. వచ్చే టీ-20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకొని యువఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం జట్టు సమతౌల్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

ఇప్పటికే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ముకేశ్ కుమార్, రవి బిష్నోయ్ , శుభ్ మన్ గిల్ లాంటి యువక్రికెటర్లకు అవకాశాలు ఇచ్చి పరీక్షించింది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో సైతం మార్పులు చేర్పులు చేసే అవకాశాలు లేకపోలేదు.

సంజు స్థానంలో యశస్వి జైశ్వాల్?

మొదటి రెండు మ్యాచ్ ల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోడంలో విఫలమైన సంజు శాంసన్ స్థానంలో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను భారత టీమ్ మేనేజ్ మెంట్ తుదిజట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది.

బౌలింగ్ లో సైతం లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ కు బదులుగా కుల్దీప్ యాదవ్ కు జట్టులో అవకాశం కల్పించనున్నారు. ఐదుమ్యాచ్ ల ఈ సిరీస్ విజయావకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే..ఈరోజు జరిగే మూడో టీ-20లో భారత్ ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది.

వరుస పరాజయాలకు చెక్ చెప్పి తొలివిజయం సాధించాలన్న పట్టుదలతో భారత్ బరిలోకి దిగుతోంది. స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండే మందకొడి గయానా పిచ్ పైన మరో విజయానికి కరీబియన్ టీమ్ తహతహలాడుతోంది.

వెస్టిండీస్ బౌలర్లు వికెట్ కు తగ్గట్టుగా బౌలింగ్ చేస్తూ భారత్ ను కట్టడి చేస్తుంటే..భారత బౌలర్లు మాత్రం ప్రావిడెన్స్ స్టేడియం స్లో పిచ్ ను సద్వినియోగం చేసుకోడంలో విఫలమవుతున్నారు.

మరో లోస్కోరింగ్ మ్యాచ్ తప్పదా?

కరీబియన్ మందకొడి పిచ్ ల పైన భారీస్కోరింగ్ మ్యాచ్ లను ఆశించడం అత్యాశే అవుతుంది. ధూమ్ ధామ్ గా సాగే టీ-20 మ్యాచ్ ల్లో 150 స్కోర్లు సాధించడం కనాకష్టమైపోతోంది.

ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో వెస్టిండీస్ తరపున నికోలస్ పూరన్, భారత్ తరపున తిలక్ వర్మ మాత్రమే సాధికారికంగా పరుగులు సాధించగలిగారు.

మిగిలిన బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమైపోతున్నారు.

టీ-20 టాప్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ శుభ్ మన్ గిల్ వైఫల్యాలు భారత వరుస పరాజయాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గయానా మందకొడి పిచ్ పైన జరిగే ప్రస్తుత మూడో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టుకు 160 నుంచి 170 స్కోర్లు సాధించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి.

బ్యాటింగ్ వైఫల్యాల నుంచి బయటపడక పోతే సిరీస్ నెగ్గడం తమకు కష్టమేనని కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అంటున్నాడు.

పొంచిఉన్న వానముప్పు!

ఈరోజు జరిగే మూడో టీ-20కి వానముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో టాస్ కీలకంగా మారింది. ఆతిథ్య వెస్టిండీస్ ఏ విధమైన మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్ మాత్రం ఒకటి లేదా రెండుమార్పులతో మ్యాచ్ నెగ్గితీరాలన్న పట్టుదలతో సిద్ధమయ్యింది.

భారత కాలమానప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక పోరు వానగండం నుంచి బయటపడుతుందా? డాషింగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేస్తాడా?..వరుస పరాజయాలకు భారత్ చెక్ చెప్పి తొలివిజయంతో సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకొంటుందా? తెలుసుకోవాలంటే కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News