భారత్ కమాల్- పాక్ ఢమాల్!
వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా తనకు తిరుగేలేదని భారత్ మరోసారి చాటుకొంది. రౌండ్ రాబిన్ లీగ్ పోరులో 7 వికెట్లతో చిత్తు చేసి టేబుల్ టాపర్ గా నిలిచింది.
వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా తనకు తిరుగేలేదని భారత్ మరోసారి చాటుకొంది. రౌండ్ రాబిన్ లీగ్ పోరులో 7 వికెట్లతో చిత్తు చేసి టేబుల్ టాపర్ గా నిలిచింది.
2023 -ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఆతిథ్య భారత్ విజయపరంపర కొనసాగుతోంది. 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేయడం ద్వారా లీగ్ టేబుల్ అగ్రభాగంలో నిలిచింది.
పాక్ కు భారత్ 'అష్టఘాతం'!
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా..లక్షా 30వేల అభిమానుల సమక్షంలో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల నడుమ జరిగిన మూడోరౌండ్ పోరు బ్రుమా, రోహిత్ షోగా, ఏకపక్ష పోరుగా ముగిసింది.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూసిన ఈ కీలక సమరంలో టాప్ ర్యాంకర్ భారత్ కు రెండోర్యాంకర్ పాక్ ఏవిధంగానూ సరిజోడీగా, సమఉజ్జీగా నిలువలేకపోయింది.
టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్ ప్రత్యర్థిని 42.5 ఓవర్లలోనే కేవలం 191 పరుగుల స్కోరుకే కుప్పకూల్చింది.
భారత బౌలర్ల బ్యాంగ్ బ్యాంగ్....
మహ్మద్ షఫీక్- ఇమాముల్ హక్ లతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ జట్టు మొదటి వికెట్ కు 41 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం చేసింది. అయితే..భారత ఓపెనింగ్ బౌలర్ మహ్మద్ సిరాజ్...పాక్ ను తొలి దెబ్బ కొట్టాడు. షఫీక్ 20 పరుగుల స్కోరుకు వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బాబర్ అజమ్ తో కలసి మరో ఓపెనర్ ఇమాముల్ హక్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. పాక్ స్కోరు 73 పరుగుల వద్ద పాండ్యా బౌలింగ్ లో ఇమాముల్ సైతం అవుట్ కావడంతో రెండో వికెట్ కోల్పోయింది.
కెప్టెన్ బాబర్- వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 82 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో పాక్ 2 వికెట్లకు 155 పరుగులతో భారీ స్కోరు సాధించేలా కనిపించింది.
36 పరుగులకే ఆఖరి 8 వికెట్లు...
58 బంతుల్లోనే 7 బౌండ్రీలతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన పాక్ కెప్టెన్ బాబర్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పాక్ పతనం ప్రారంభమయ్యింది. బాబర్ 50 పరుగులకు అవుటయ్యాడు. ఆ తర్వాత డేంజర్ మాన్ రిజ్వాన్ ను బుమ్రా పడగొట్టాడు.
69 బంతుల్లో 7 బౌండ్రీలతో 49 పరుగులు సాధించిన రిజ్వాన్ క్లీన్ బౌల్డ్ కావడంతో పాక్ పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది. పాక్ మిడిల్, లోయర్ ఆర్డర్ పేకమేడలా కూలింది.
భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, జడేజా, పాండ్యా, కుల్దీప్ తలో రెండు వికెట్లు పడగొట్టి..పాక్ ఇన్నింగ్స్ ను 191 పరుగులకే పరిమితం చేశారు.
హిట్ మ్యాన్ సూపర్ హిట్......
మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 192 పరుగులు చేయాల్సిన భారత్ కు ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ మొదటి వికెట్ కు 23 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. డెంగ్యూజ్వరంతో మొదటి రెండురౌండ్ల మ్యాచ్ లకూ దూరమై..పాక్ తో పోరు ద్వారా రీ-ఎంట్రీ చేసిన గిల్ 11 బంతుల్లో 4 బౌండ్రీలతో 16 పరుగులకు అవుటయ్యాడు.
మరోవైపు..కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి..భారీసిక్సర్లతో పరుగుల మోత మోగించాడు. రెండోరౌండ్ పోరులో అఫ్ఘనిస్థాన్ పై రికార్డు శతకం బాదిన రోహిత్ పాక్ తో పోరులో సైతం అదేజోరు కొనసాగించాడు. స్పిన్నర్లు , పేసర్లు అన్న తేడా లేకుండా వీరవిహారం చేశాడు. కేవలం 63 బంతుల్లోనే 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 86 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.
అంతకుముందు స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ 18 బంతుల్లో 3 బౌండ్రీలతో 16 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు. మిడిలార్డర్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్- కెఎల్ రాహుల్ నాలుగో వికెట్ కు అజేయంగా నిలవడంతో భారత్ 30.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి విజయం లక్ష్యం చేరి 7 వికెట్ల విజయం నమోదు చేసింది. శ్రేయస్ అయ్యర్ 62 బాల్స్ లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53, రాహుల్ 19 పరుగుల స్కోర్లతో నాటౌట్ గా నిలిచారు.
భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన బూమ్ బూమ్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
8 మ్యాచ్ ల్లో భారత్ 8 విజయాల రికార్డు...
వన్డే ప్రపంచకప్ లో 1992 నుంచి 2023 ప్రపంచకప్ వరకూ భారత్ కు ఇది వరుసగా 8వ గెలుపు. 1992 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై 43 పరుగులతో నెగ్గిన భారత్ 1996 ప్రపంచకప్ లో 39 పరుగులు, 1999 ప్రపంచకప్ లో 47 పరుగులు, 2003 ప్రపంచకప్ లో 6 వికెట్లు, 2011 ప్రపంచకప్ లో 29 పరుగులు, 2015 ప్రపంచకప్ లో 76 పరుగులు, 2019 ప్రపంచకప్ లో 89 పరుగుల విజయానికి ప్రస్తుత ప్రపంచకప్ లో 7 వికెట్ల విజయంతో 8 కి 8 మ్యాచ్ లూ నెగ్గినట్లయ్యింది.
పాకిస్థాన్ ప్రత్యర్థిగా జరిగిన ఎనిమిది ప్రపంచకప్ మ్యాచ్ ల్లో మూడుసార్లు మాస్టర్ సచిన్ ( 192, 2003, 2011 ) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిస్తే.. 1996 ప్రపంచకప్ లో నవజోత్ సింగ్ సిధ్దూ, 1999లో వెంకటేశ్ ప్రసాద్, 2015 ప్రపంచకప్ లో విరాట్ కొహ్లీ, 2019 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ, 2023 ప్రపంచకప్ లో జస్ ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్లేయర్ అవార్డులు అందుకొన్నారు.
రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా భారత్ తన నాలుగోరౌండ్ మ్యాచ్ ను... ఈనెల 19న బంగ్లాదేశ్ తో ఆడనుంది.