ఇటు భారత్, అటు న్యూజిలాండ్..నేడే తొలిసెమీస్ పోరు!

ప్రపంచకప్ ఫైనల్లో చోటుకు టాప్ ర్యాంకర్ భారత్ గురిపెట్టింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు జరిగే తొలి సెమీస్ పోరులో న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

Advertisement
Update:2023-11-15 08:27 IST

ప్రపంచకప్ ఫైనల్లో చోటుకు టాప్ ర్యాంకర్ భారత్ గురిపెట్టింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు జరిగే తొలి సెమీస్ పోరులో న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత నాలుగువారాలుగా అలరించిన ప్రపంచకప్ 45 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ అంకం ముగియటంతోనే నాలుగుజట్ల సెమీఫైనల్స్ నాకౌట్ సమరానికి రంగం సిద్ధమయ్యింది.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే తొలిసెమీఫైనల్లో లీగ్ టేబుల్ టాపర్ భారత్ కు నాలుగోస్థానంలో నిలిచిన న్యూజిలాండ్ సవాలు విసురుతోంది.

భారత్ కు కివీస్ టెన్షన్....!

రౌండ్ రాబిన్ లీగ్ తొమ్మిదిరౌండ్లలో తొమ్మిదిజట్లను మట్టి కరిపించడం ద్వారా సెమీస్ లో అడుగుపెట్టిన నంబర్ వన్ టీమ్ భారత్ కు నాకౌట్ రౌండ్లో మరోసారి న్యూజిలాండ్ ప్రత్యర్థిగా నిలవడంతో ఏదో తెలియని టెన్షన్ ప్రారంభమయ్యింది.

గత ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలోనే భారత్ పరాజయం పొందడంతో ఆ ఓటమి ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. దానికితోడు..నాకౌట్ రౌండ్లలో న్యూజిలాండ్ జట్టుకు అత్యంత ప్రమాదకరమైన జట్టుగా కూడా పేరుంది.

మరోవైపు..2003 ప్రపంచకప్ నుంచి 2019 ప్రపంచకప్ వరకూ లీగ్ దశలో వరుస విజయాలు సాధించడం, నాకౌట్ రౌండ్లలో బోల్తా కొట్టడం భారతజట్టుకు ఆనవాయితీగా వస్తోంది. అయితే..ఆ ఆనవాయితీని తప్పించే సత్తా తమకు ఉందని రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు చెప్పకనే చెబుతోంది.

అన్ని విబాగాలలోనూ అత్యంత పటిష్టంగా...

2011 ప్రపంచకప్ టోర్నీ నుంచి ఆడిన ప్రతిటోర్నీలోనూ సెమీఫైనల్స్ చేరుతూ వచ్చిన భారత్ ప్రస్తుత ప్రపంచకప్ లో అత్యంత పటిష్టమైన, సమతూకంతో కూడిన జట్టుగా గుర్తింపు తెచ్చుకొంది.

బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ భారత్ భీకరంగా కనిపిస్తోంది.ఓపెనర్ రోహిత్ శర్మ నుంచి 7వ నంబర్ బ్యాటర్ రవీంద్ర జడేజా వరకూ భారత బ్యాటింగ్ ఆర్డర్ గతంలో ఎన్నడూలేనంత బలంగా, నిలకడగా రాణిస్తూ వస్తోంది.

ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ లీగ్ దశలో నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేస్తే..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 500 కు పైగా పరుగులతోనూ, పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ 586 పరుగులతోనూ వారేవ్వా అనిపించుకొన్నారు.

ఇక..నంబర్ -4 శ్రేయస్ అయ్యర్, 5వ డౌన్ ఆటగాడు కెఎల్ రాహుల్ ల జోడీ గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది. నెదర్లాండ్స్ తో బెంగళూరు వేదికగా ముగిసిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో 4వ వికెట్ కు ప్రపంచకప్ రికార్డు భాగస్వామ్యంతో వ్యక్తిగతంగా సెంచరీలు సాధించడం భారత బ్యాటింగ్ పవర్ కు నిదర్శనంగా నిలుస్తుంది.

6వ డౌన్ లో బ్యాటింగ్ కు దిగే 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ సైతం తనవంతు భారీస్కోరు కోసం ఎదురుచూస్తున్నాడు.

బౌలింగ్ లో ఐదుగురూ ఐదుగురే...!

లీగ్ దశ 9 రౌండ్లలో భారత బౌలర్లు విశ్వరూపమే ప్రదర్శించారు. పేస్ త్రయం బుమ్రా, షమీ,సిరాజ్ తో పాటు..స్పిన్ జోడీ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

ఐదు ప్రత్యర్థిజట్లను రెండంకెల స్కోర్లకే భారత బౌలర్లు కుప్పకూల్చారంటే బౌలింగ్ ఎటాక్ ఎంత పదునుతో ఉందీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిడిల్ ఓవర్లలో జడేజా, కుల్దీప్ కీలక వికెట్లు పడగొట్టడంతోపాటు..ప్రత్యర్థి బ్యాటర్లకు పగ్గాలు వేస్తూ విజయాలకు మార్గం సుగమం చేస్తూ వస్తున్నారు.

అత్యంత ప్రమాదకరమైన, ఖతర్నాక్ జట్టుగా పేరున్న న్యూజిలాండ్ ను నాకౌట్ రౌండ్లోనూ చిత్తు చేయాలంటే భారత బౌలర్లు స్థాయికి మించి రాణించాల్సి ఉంది.

న్యూజిలాండ్ తో డేంజర్, యమడేంజర్...

రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసినా..సెమీఫైనల్స్ నాకౌట్ లో ప్రమాదం పొంచే ఉంది. కివీ జట్టును ఏమాత్రం తక్కువగా అంచనావేసినా భారీమూల్యం చెల్లించుకోక తప్పదు.

కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్, యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ ల నుంచి భారత బౌలర్లకు గట్టి పరీక్ష ఎదురుకానుంది. బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, సాంట్నర్ లను భారత బ్యాటర్లు దీటుగా ఎదుర్కొనాల్సి ఉంది.

350కి పైగా పరుగులు సాధించగలిగితేనే....

ముంబై వాంఖడే పిచ్ బ్యాటింగ్ కు పూర్తి అనువుగా ఉంది. దీనికితోడు ముందుగా బ్యాటింగ్ కు దిగినజట్లు 350కి పైగా స్కోర్లు సాధించినా విజయానికి గ్యారెంటీ లేని పరిస్థితి ఉంది.

చేజింగ్ కు దిగిన జట్లే అత్యధిక విజయాలు సాధించిన రికార్డు..రెండుజట్లనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే గ్రౌండ్ వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్...ప్రత్యర్థిని రెండంకెల స్కోరుకే కుప్పకూల్చడం ద్వారా విజయం నమోదు చేసింది.

ఇక్కడి వాతావరణం రివర్స్ స్వింగ్ కు అనుకూలంగా ఉండటం కూడా భారత పేస్ త్రయానికి అదనపు బలం కానుంది.

తుదిజట్టులో మార్పు తప్పదా?

భారతజట్టుకు తుదిజట్టు కూర్పు పరీక్షగా మారింది. కీలక ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా లేని లోటును అదనపు బ్యాటర్ సూర్యకుమార్ తో పాటు..ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే భారత్ ఇప్పటి వరకూ పూడ్చుకోడం తో పాటు విజయపరంపర కొనసాగిస్తూ వచ్చింది. అయితే..సెమీఫైనల్ నాకౌట్ రౌండ్లో...ఎక్కువమంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లున్నన్యూజిలాండ్ ను కట్టడి చేయాలంటే అశ్విన్ ను అదనపు స్పిన్నర్ గా తుదిజట్టులోకి తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

సూర్యకుమార్ యాదవ్ అదనపు బ్యాటర్ గా ఉంటాడా? లేక సూర్యాకు బదులుగా స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ ను తీసుకోడం ద్వారా ఆరవ స్పెషలిస్ట్ బౌలర్ తో పాటు బ్యాటింగ్ ను సైతం పటిష్టం చేసుకొనే అవకాశం ఉంటుందని టీమ్ మేనేజ్ మెంట్ మల్లగుల్లాలు పడుతోంది.

చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ విన్నింగ్ ఫార్ములానే కొనసాగిస్తారా?లేక నాకౌట్ పోరు కావడంతో తురుపుముక్క అశ్విన్ ను బరిలోకి దించుతారా ? అన్నది సస్పెన్స్ గా మారింది.

కివీస్ పై భారత్ కే మెరుగైన రికార్డు...

వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ ప్రత్యర్థిగా 20 సంవత్సరాల తర్వాత ధర్మశాల వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో విజయం సాధించిన భారత్..నాకౌట్ సెమీస్ పోరులోనూ అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీస్ రౌండ్లలో భారత్ 3 విజయాలు, 4 పరాజయాలతో 42.86 విజయశాతాన్ని నమోదు చేస్తే..న్యూజిలాండ్ 2 విజయాలు, 6 పరాజయాలతో 25 శాతం మాత్రమే విజయశాతంతో నిలిచింది.

లీగ్ దశ మ్యాచ్ ల్లో పరుగుల మోత మోగించే భారత రన్ మెషీన్ విరాట్ కొహ్లీకి నాకౌట్ రౌండ్ మ్యాచ్ ల్లో 12.16 శాతం సగటు మాత్రమే ఉంది. వన్డే ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ ఆరు నాకౌట్ రౌండ్ మ్యాచ్ లు ఆడిన విరాట్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. కివీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ కు సైతం 34.67 సగటు మాత్రమే ఉంది.

ముంబై వేదికగా జరిగే ఈ సెమీఫైనల్స్ కు అభిమానులతో స్టేడియం కిటకిటలాడి పోనుంది. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రస్తుత ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ బదులు తీర్చుకొంటుందా? తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News