ఏడు వికెట్లు పడగొడితే పెర్త్‌ టెస్ట్‌ మనదే

గెలవాలంటే ఆసీస్‌ ఇంకో 522 రన్స్‌ కొట్టాలే

Advertisement
Update:2024-11-24 16:47 IST

బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫి ఫస్ట్‌ టెస్ట్‌ లో ఇండియా పట్టు భిగించింది. మూడో రోజు ఆటలో ఆల్‌ రౌండ్‌ ఆదిపత్యంతో విజయానికి ఇంకో ఏడు వికెట్ల దూరంలో ఉంది. 172 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌ వద్ద ఆదివారం ఉదయం బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 487 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. యశస్వీ జైస్వాల్‌ ఉదయమే సెంచరీ బాదగా, టెస్ట్‌ క్రికెట్‌ లో 16 నెలల విరామం తర్వాత విరాట్‌ కోహ్లీ సెంచరీ చేశాడు. 143 బంతుల్లో రెండు సిక్స్‌ లు, ఎనిమిది ఫోర్లతో 100 పరుగుల మార్క్‌ చేరుకున్నారు. చివరలో విరాట్‌ కోహ్లీ, నితీశ్ కుమార్‌ రెడ్డి దనాదన్‌ బ్యాటింగ్‌ తో పెర్త్‌ టెస్ట్‌ లో స్కోర్‌ బోర్డు పరుగులెత్తుతోంది. సిక్త్స్‌ డౌన్‌ లో వచ్చిన తెలుగు స్టార్‌ బ్యాటర్‌ నితీశ్‌ 27 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38పరుగులతో క్రీజ్‌ లో ఉన్నాడు. ఇద్దరు పోటాపోటీగా బ్యాట్‌ ఝలిపించడంతో ఆసీస్‌ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. కోహ్లీ సెంచరీ పూర్తి చేయగానే కెప్టెన్‌ జస్ప్రీత్ బూమ్రా రెండో ఇన్నింగ్స్‌ ను డిక్లేర్ చేశారు. టీమిండియా 134.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 487 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. ఆస్ట్రేలియాకు 533 పరగుల టార్గెట్‌ ఇచ్చారు. ఇండియా టీమ్‌లో జైస్వాల్‌ 161 పరుగులు, కేఎల్‌ రాహుల్‌ 77, పడిక్కల్‌ 25, వాషింగ్టన్‌ సుందర్‌ 29 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లయన్‌ రెండు వికెట్లు పడగొట్టగా, స్టార్క్‌, హాజల్‌వుడ్‌, కమిన్స్‌, మార్ష్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

533 పరుగుల పరుగుల భారీ టార్గెట్‌ చేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ బ్యాటర్లు మొదట్లోనే తడబడ్డారు. నాథన్‌ మెక్‌ స్వీనిని కెప్టెన్‌ బూమ్రా ఎల్‌బీడబ్ల్యూగా పెవిలిన్‌ కు చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే ప్యాట్‌ కమిన్స్‌ సిరాజ్‌ బౌలింగ్‌ లో కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మార్నస్‌ లబుషేన్‌ బూమ్రా బౌలింగ్‌ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మూడో రోజు ఆటో ముగిసే సమాయానికి ఆస్ట్రేలియా జట్టు 12 పరుగులు చేసి మూడు కీలక వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా మూడు పరుగులతో క్రీజ్‌ లో ఉన్నాడు. బూమ్రా ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌ 7 పరుగులు ఇచ్చి వికెట్‌ తీసుకున్నారు. పెర్త్‌ టెస్ట్‌ లో ఇంకో రెండు రోజులు మిగిలి ఉన్నాయి. ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే ఇంకా 522 పరుగులు చేయాలి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తన నాలుగో ఇన్నింగ్స్‌ లో 404 పరుగుల విజయలక్ష్యాన్ని మాత్రమే చేదించింది. ఈ లెక్కన ఇండియా సోమవారం రెండో సెషన్‌ లోనే విజయం సాధించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియా ఏడు వికెట్లు పడగొడితే మ్యాచ్‌ సొంతం చేసుకుంటుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ ను వైట్‌ వాష్‌గా సమర్పించేసిన టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై మొదటి టెస్టులో విజయం దిశగా పయనిస్తుండటంతో క్రికెట్‌ అభిమానులు సంబర పడుతున్నారు. ఈ సిరీస్‌ ను ఇండియా కైవసం చేసుకుంటే వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ కు చేరడం ఖాయం.

Tags:    
Advertisement

Similar News