పాక్ అవుట్... లోస్కోరింగ్ థ్రిల్లర్లో విన్నర్ భారత్!

ప్రపంచకప్ గ్రూపులీగ్ లో భారత్ కీలక విజయంతో సూపర్-8 రౌండ్ ముంగిట నిలిచింది. దాయాదుల సమరంలో విజేతగా నిలిచింది.

Advertisement
Update:2024-06-10 09:44 IST

ప్రపంచకప్ గ్రూపులీగ్ లో భారత్ కీలక విజయంతో సూపర్-8 రౌండ్ ముంగిట నిలిచింది. దాయాదుల సమరంలో విజేతగా నిలిచింది.

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భాగంగా జరిగిన దాయాదుల సమరంలో భారత్ విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో న్యూయార్క్ వేదికగా జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్లో భారత్ 6 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. వరుసగా రెండో ఓటమితో పాకిస్థాన్ ప్రపంచకప్ టైటిల్ రేస్ నుంచి నిష్క్ర్రమించింది.

కిటకిటలాడిన న్యూయార్క్ స్టేడియం...

ఐదు (భారత్, పాక్, కెనడా, అమెరికా, ఐర్లాండ్) జట్లతో కూడిన గ్రూపు-ఏ లీగ్ ఈ రెండోరౌండ్ పోరులో దాయాదిజట్లు భారత్, పాక్ తలపడ్డాయి. ఈ సూపర్ సండే సమరాన్ని ప్రత్యక్షంగా చూడటానికి వందలాది డాలర్లు ఖర్చుపెట్టి..న్యూయార్క్, పరిసర ప్రాంతాలలోని భారత్, పాక్ సంతతి క్రికెట్ అభిమానులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. మ్యాచ్ కు వేదికగా నిలిచిన నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం కిటకిటలాడింది.

సూపర్-8 రేస్ లో నిలవాలంటే నెగ్గితీరాల్సిన ఈ పోరులో పాక్ జట్టు కీలక టాస్ నెగ్గి మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొంది. మేఘావృత వాతావరణంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ ను రోహిత్ తో కలసి విరాట్ ప్రారంభించాడు. మొదటి ఓవర్లో రోహిత్ ఓ భారీసిక్సర్ తో తనజట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. మొదటి ఓవర్ ఆట ముగిసిన వెంటనే వర్షం పడడంతో కొద్దిసేపు అంతరాయం కలిగింది.

ఆ తర్వాత కొనసాగిన ఆటలో విరాట్ ఓ ఫోర్ కొట్టి అవుట్ కాగా..కెప్టెన్ రోహిత్ 13 పరుగులకు వెనుదిరగడంతో..వన్ డౌన్ రిషభ్ పంత్, రెండోడౌన్ అక్షర్ పటేల్ లపైన భారత భారం పడింది.

పంత్ 42..భారత్119 ....

మూడోవికెట్ కు రిషభ్- అక్షర్ జోడీ 38 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. వికెట్ పేస్ బౌలింగ్ కు అనువుగా ఉండడంతో పాక్ బౌలర్లు కట్టడితో బంతులు విసిరారు.

అక్షర్ 18 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ తో 20 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

సూర్య7, శివందూబే 3, హార్థిక్ పాండ్యా 7 పరుగులకు అవుట్ కాగా..జడేజా డకౌటయ్యాడు. అర్షదీప్ 9, సిరాజ్ 7 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడంతో భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది.

భారత బ్యాటర్లలో రిషభ్ పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగుల టాప్ స్కోరు సాధించాడు. పాక్ పేసర్లు హారిస్ రవూఫ్ 3, నసీమ్ షా 3 వికెట్లు, మహ్మద్ అమీర్ 2, షాహీన్ అఫ్రిదీ 1 వికెట్ పడగొట్టారు.

బుమ్రా బూమ్ బూమ్ బౌలింగ్....

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 120 పరుగులు మాత్రమే చేయాల్సిన పాక్ జట్టుకు ఓపెనింగ్ జోడీ మహ్మద్ రిజ్వాన్ ( 31)- బాబర్ అజమ్ ( 13 ) మొదటి వికెట్ కు 26 పరుగులతో చక్కటి భాగస్వామ్యం అందించారు.

అయితే...భారత యార్కర్లకింగ్ బుమ్రా ఓ సూపర్ బాల్ తో పాక్ కెప్టెన్ ను పడగొట్టడంతో పాక్ పతనం ప్రారంభమయ్యింది. వన్ డౌన్ ఉస్మాన్ ఖాన్ ను అక్షర్, ఫకర్ జమాన్ ను హార్థిక్ పాండ్యా 13 పరుగుల స్కోర్లకే అవుట్ చేశారు.

దూకుడుమీదున్న ఓపెనర్ రిజ్వాన్( 44 బంతుల్లో 31 పరుగులు)తో పాటు, ఇఫ్తీకర్ అహ్మద్( 5 ) ను సైతం బుమ్రా సాగనంపాడు. ఆల్ రౌండర్ షదాబ్ ఖాన్ సైతం 4 పరుగులకే అవుటయ్యాడు.

విజయానికి ఆఖరి 6 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన పాక్ జట్టు 12 పరుగులు మాత్రమే సాధించగలిగింది. 113 పరుగులకే పరిమితం కావడంతో భారత్ 6 పరుగుల విజయంతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకొంది.

భారత బౌలర్లలో బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. హార్థిక్ పాండ్యా 3 వికెట్లు, అక్షర్, అర్షదీప్ చెరో వికెట్ పడగొట్టారు.

పాక్ ప్రత్యర్థిగా భారత్ 7వ గెలుపు...

టీ-20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా భారత్ కు ఇది 7వ గెలుపు కావడం విశేషం. 2007 ప్రారంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుత 2024 ప్రపంచకప్ వరకూ ఈ రెండుజట్లు 8సార్లు తలపడితే భారత్ 7 విజయాలు, పాక్ ఓ విజయం రికార్డుతో ఉన్నాయి.

ఈమ్యాచ్ లో ఓటమితో పాకిస్థాన్ ప్రపంచకప్ టైటిల్ రేస్ నుంచి నిష్క్ర్రమించినట్లయ్యింది. గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో ఆతిథ్య అమెరికా చేతిలో సూపర్ ఓవర్ ఓటమి చవిచూసిన పాక్ జట్టు బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో సూపర్- 8 రౌండ్ చేరుకోలేకపోయింది.

భారత్ తన మూడవ గ్రూప్ లీగ్ మ్యాచ్ ను బుధవారం సంచలనాల అమెరికాతో న్యూయార్క్ వేదికగానే ఆడనుంది. పాక్ జట్టు తన చివరి రెండులీగ్ మ్యాచ్ లను పసికూనజట్లు కెనడా, ఐర్లాండ్ లతో ఆడాల్సి ఉంది.

మొత్తం 20 జట్లు, నాలుగు గ్రూపుల లీగ్ నుంచి 8 జట్లు సూపర్-8 రౌండ్ చేరనున్నాయి.

Tags:    
Advertisement

Similar News