భారత్, పాక్ దొందూదొందే- షోయబ్ అక్తర్!

భారత్, పాకిస్థాన్ జట్లకు ప్రపంచకప్ గెలిచే సత్తాలేదని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్, కామెంటీటర్ షోయబ్ అక్తర్ జోస్యం చెబుతున్నాడు.

Advertisement
Update:2022-10-29 10:30 IST

భారత్, పాకిస్థాన్ జట్లకు ప్రపంచకప్ గెలిచే సత్తాలేదని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్, కామెంటీటర్ షోయబ్ అక్తర్ జోస్యం చెబుతున్నాడు. పాక్ జట్టు సూపర్ -12 రౌండ్ నుంచి, భారత్ సెమీఫైనల్ రౌండ్ నుంచే ఇంటిదారి పట్టడం ఖాయమని ప్రకటించాడు.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో ఆసియాదిగ్గజ జట్లు, మాజీ చాంపియన్లు భారత్, పాకిస్థాన్ లకు మరోసారి ప్రపంచకప్ గెలిచే సత్తాలేదని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అభిఫ్రాయపడ్డాడు. పైగా సూపర్ -12 దశ నుంచే పాకిస్థాన్, సెమీఫైనల్ రౌండ్ నుంచి భారత్ ఇంటిదారి పట్టడం ఖాయమని తేల్చి చెప్పాడు.

భారత్ అలా...పాక్ డీలా....

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ గ్రూప్ -2 లీగ్ లో భారత్ వరుస విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిస్తే...పాకిస్థాన్ వరుస పరాజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది.

గ్రూప్ ప్రారంభరౌండ్ పోరులో పాకిస్థాన్ ను 4 వికెట్లతో అధిగమించిన భారత్..రెండోరౌండ్లో పసికూని నెదర్లాండ్స్ ను 56 పరుగులతో చిత్తు చేయడం ద్వారా 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మరోవైపు...భారత్ చేతిలో తొలిరౌండ్ పరాజయం చవిచూసిన పాక్ జట్టు...కీలక రెండోరౌండ్లో జింబాబ్వే చేతిలో ఒక్క పరుగు ఓటమితో డీలా పడిపోయింది.

నేనుచెప్పినట్లే జరుగుతుంది- అక్తర్

ప్రపంచకప్ లో పాకిస్థాన్ జట్టు వైఫల్యాలను తాను ముందే ఊహించానని, నాసిరకం జట్టుతో నాసిరకం ఫలితాలే వస్తాయని షోయబ్ అక్తర్ విసుర్లు విసిరాడు. ప్రతిభావంతులైన ఆటగాళ్లను పక్కన పెట్టి...తమ కావాల్సిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేస్తే చక్కటి ఫలితాలు ఎక్కడ నుంచి వస్తాయని తమ సెలెక్టర్లను అక్తర్ నిలదీశాడు. ఆరుజట్ల గ్రూపు-2 లీగ్ 5వ స్థానంలో కొనసాగుతున్న పాక్ జట్టు మిగిలిన మూడురౌండ్లలోనూ నెగ్గినా నాకౌట్ రౌండ్ చేరుకోడం అంతతేలికకాదని, పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాపై నెగ్గితీరాల్సి ఉందని, అయితే అదిసాధ్యమయ్యే పనికాదని చెప్పాడు. పాకిస్థాన్ ఆటతీరు తనను, పాక్ క్రికెట్ అభిమానులను తీవ్రనిరాశకు గురిచేసిందని మండి పడ్డాడు.

భారత్ కు అంతసీన్ లేదు...

పాకిస్థాన్ ను మాత్రమే కాదు..చివరకు భారతజట్టును సైతం షోయబ్ అక్తర్ విడిచిపెట్టలేదు. ఆస్ట్ర్రేలియన్ ఫాస్ట్ ,బౌన్సీ పిచ్ లపైన ప్రపంచకప్ నెగ్గే సత్తా భారత్ కు లేదని, రోహిత్ శర్మ నాయకత్వంలోని ప్రస్తుత భారతజట్టు సెమీఫైనల్ నుంచే ఇంటిదారి పట్టడం ఖాయమని అక్తర్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా చెప్పాడు.

భారత్ కు ప్రపంచకప్ విజేతగా నిలిచే సత్తాలేదని, ప్రస్తుత జట్టులో గొప్పగొప్ప ఆటగాళ్ళు,మ్యాచ్ విన్నర్లు లేనేలేరని వివరించాడు. తన దృష్టిలో ఇటు భారత్, అటు పాక్ జట్లు..దొందూదొందేనని చురకలంటించాడు.

మరి..షోయబ్ అక్తర్ బాబా జోస్యం నిజం కాబోదని నిరూపించాల్సిన బాధ్యత ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్, 4వ ర్యాంకర్ పాకిస్థాన్ ల పైన ఎంతైనా ఉంది.

Tags:    
Advertisement

Similar News