304 రన్స్‌ తేడాతో భారత్‌ భారీ విజయం

మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత్‌

Advertisement
Update:2025-01-15 17:39 IST

ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌ స్వీప్‌ చేసింది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో 304 రన్స్‌ తేడాతో భారీ విజయం సాధించింది. 436 రన్స్‌ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ జట్టు.. 31.4 ఓవర్లలో 131 రన్స్‌కు ఆలౌట్‌ అయ్యింది. సారా (41), ఓర్లా (36) మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, తనూజా కాన్వార్‌ 2, సయీలీ 1, సాధు 1, మిన్ను 1 వికెట్‌ తీశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 435/5 రికార్డు స్కోర్‌ చేసింది. రన్స్‌ పరంగా భారత్‌ అత్యధిక తేడాతో విజయం సాధించిన మ్యాచ్‌ ఇదే. అంతకు ముందు ఐర్లాండ్‌పైనే 2017లో 249 రన్స్‌ తేడాతో టీమిండియా గెలిచింది. 

అంతకుముందు టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నది. టీమిండియా మొదటిసారి వన్డేల్లో 400కిపైగా రన్స్‌ చేసింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (135: 80 బాల్స్‌లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు), మరో ఓపెనర్‌ ప్రతీకా రావల్‌ (154: 129 బాల్స్‌లో 20 ఫోర్లు ఒక సిక్స్‌) సెంచరీలతో చెలరేగారు. వన్‌డౌన్‌లో వచ్చిన రిచా ఘోష్‌ (59) దూకుడుగా ఆడింది. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 435 రన్స్‌ చేసింది. ఇప్పటివరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు 370/5. ఐర్లాండ్‌పైనే జనవరి 12న చేయడం గమనార్హం. ఇప్పుడు మరోసారి ఆ రికార్డును అధిగమించింది.

మొదటి బాల్‌ నుంచే దూకుడుగా ఆడిన స్మృతి మంధాన కెరీర్‌లో పదో సెంచరీని పూర్తి చేసింది. ఈ క్రమంలో భారత్‌ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచింది. 70 బాల్స్‌లోనే ఈ మార్క్‌ను అందుకున్నది. మంధానకు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. రెండో వన్డేలోనూ ఆమె సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతీకా రావల్‌ తొలి సెంచరీని 100 బాల్స్‌లో సాధించింది. తొలి వికెట్‌కు మంధాన-ప్రతీకా రావల్‌ జోడి 233 రన్స్‌ రాబట్టారు. మహిళల వన్డే చరిత్రలో ఆరో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యంగా నిలిచింది. 

Tags:    
Advertisement

Similar News