కివీస్‌తో సెమీస్.. రోహిత్ సేన గండం గట్టెక్కేనా..?
ఇప్పటివరకూ వరల్డ్‌కప్‌లో భాగంగా 9 మ్యాచులాడిన టీమిండియా అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఇక 9 మ్యాచులాడిన కివీస్ 5 మ్యాచుల్లో గెలిచి.. నాలుగింట ఓడింది.
వరల్డ్‌కప్‌లో ఎదురు లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా.. సెమీస్ సవాల్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ న్యూజిలాండ్‌తో తలపడనుంది. టోర్నీలో ఇప్పటివరకు టీమ్ ప్రదర్శన, ప్లేయర్స్ ఫామ్ చూసుకుంటే.. భారత్ హాట్ ఫేవరెట్‌గా ఉంది. ముంబై వాంఖడే మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇప్పటివరకూ వరల్డ్‌కప్‌లో భాగంగా 9 మ్యాచులాడిన టీమిండియా అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఇక 9 మ్యాచులాడిన కివీస్ 5 మ్యాచుల్లో గెలిచి.. నాలుగింట ఓడింది. లీగ్ స్టేజ్ ప్రారంభం నుంచి ఆఖరు వరకు టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఇక కివీస్ నాలుగు విజయాలతో టోర్నీని ఘనంగా స్టార్ట్ చేసినప్పటికీ.. తర్వాత వరుసగా నాలుగింట ఓడింది. చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నారు బ్లాక్ క్యాప్స్.
వాంఖడేలో పరుగుల వరద పారడం ఖాయంగా భావిస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో ఇదే రుజువైంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కాస్త కష్టంగా మారింది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత ప్లేయర్లు దాదాపు అందరూ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం.
2019 ప్రపంచకప్‌లోనూ టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్‌తోనే తలపడింది. అయితే ఆ మ్యాచ్‌లో ఓటమికి.. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది భారత జట్టు. ఆ మ్యాచ్‌లో కివీస్ 18 పరుగుల తేడాతో గెలిచింది. చివర్లో ధోని రనౌట్ కావడాన్ని అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు.
ఇక వాంఖడేలో ఇప్పటివరకూ 21 మ్యాచులాడిన టీమిండియా 12 మ్యాచుల్లో గెలిచి 9 మ్యాచుల్లో ఓడింది. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీస్ చేరడం ఇది తొమ్మిదో సారి కాగా.. రెండుసార్లు మాత్రమే ఆ జట్టు ఫైనల్ చేరింది. ఇక ఇండియా ఇప్పటివరకూ రెండు సార్లు ప్రపంచకప్ గెలవగా.. కివీస్ ఒక్కసారి కప్ దక్కించుకోలేదు.