జూనియర్ ప్రపంచకప్ లో నేడు భారత్- బంగ్లా పోరు!
2024-ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో ఐదుసార్లు విజేత భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈరోజు జరిగే తన ప్రారంభమ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది.
2024-ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో ఐదుసార్లు విజేత భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈరోజు జరిగే తన ప్రారంభమ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న 2024-ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్ గా టైటిల్ వేటకు దిగింది. గ్రూప్ లీగ్ లో భాగంగా ఈరోజు జరిగే తన ప్రారంభమ్యాచ్ లో ఆసియా చాంపియన్ బంగ్లాదేశ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఆసియాకప్ అండర్ -19 టోర్నీ సెమీస్ లో బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న భారత్ ప్రస్తుత ప్రపంచకప్ లో బదులుతీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది.
ఉదయ్ సహ్రాన్ నాయకత్వం...
పలువురు ప్రతిభావంతులైన కుర్రాళ్లతో కూడిన భారతజట్టుకు ఉదయ్ సహ్రాన్ నాయకత్వం వహిస్తున్నాడు. ప్రపంచకప్ కు సన్నాహకంగా జరిగిన ముక్కోణపు ( భారత్, దక్షిణాఫ్రికా, అప్ఘనిస్తాన్ ) సిరీస్ టోర్నీలో అజేయంగా నిలవడంతో పాటు ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కలసి సంయుక్త విజేతగా మిగిలిన భారత్ అసలు సిసలు ప్రపంచకప్ టైటిల్ వేట మొదలు పెట్టింది.
సన్నాహక మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్..బ్లూమ్ ఫాంటెయిన్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభమయ్యే తొలి లీగ్ పోరులో బంగ్లాదేశ్ కు సవాలు విసురుతోంది.
అండర్ -19 ప్రపంచకప్ కు మరోపేరు...
19 సంవత్సరాల లోపు కుర్రాళ్లకు నిర్వహించే జూనియర్ ప్రపంచకప్ చరిత్రలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ఘనత కేవలం భారత్ కు మాత్రమే ఉంది. 1988 నుంచి రెండేళ్లకు ఓమారు నిర్వహిస్తూ వస్తున్న ఈ టోర్నీఫైనల్స్ కు ఎనిమిదిసార్లు చేరిన ఒకే ఒక్కజట్టుగా, ఐదుసార్లు విజేతగా నిలిచిన ఏకైకజట్టుగా భారత్ కు రికార్డు ఉంది.
మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, విరాట్ కొహ్లీ, ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్ లాంటి ఎందరో ప్రతిభావంతులైన, ప్రపంచ మేటి సూపర్ స్టార్ క్రికెటర్లు ఈ అండర్ -19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే.
1988 నుంచి 2020 వరకూ జరిగిన ప్రపంచకప్ టోర్నీలలో భారత్ (2000 , 2008, 2012, 2018, 2022); ఆస్ట్ర్రేలియా (1988, 2002, 2010); పాకిస్థాన్ (2004, 2006); ఇంగ్రండ్ (1998); దక్షిణాఫ్రికా (2014); వెస్టిండీస్ (2016); బంగ్లాదేశ్ (2020) విజేతలుగా నిలిచాయి.
ఉదయ్ సహ్రాన్ నాయకత్వంలోని ప్రస్తుత భారతజట్టులో అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంశు మోల్యా, ముషీర్ ఖాన్, అరవిల్లి అవింశరావ్, సౌమ్య కుమార్ పాండే, మురుగన్ అభిషేక్, ఇన్నెశ్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ సభ్యులుగా ఉన్నారు.
గ్రూప్-ఏ లీగ్ లో భారత్ పోటీ...
బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాజట్లతో కూడిన గ్రూప్ - ఏ లీగ్ లో భారత్ పోటీపడనుంది. గ్రూప్ - బీ లో అమెరికా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్, గ్రూప్- సీ లో ఆస్ట్ర్రేలియా, శ్రీలంక ,జింబాబ్వే, నమీబియా, గ్రూప్- డీలో పాకిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్, అఫ్ఘనిస్థాన్ తలపడనున్నాయి.
తొలిఅంచె లీగ్ దశ తరువాత..ఆరుజట్లతో కూడిన సూపర్ సిక్స్ రౌండ్లను ఆ తరువాత సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లను నిర్వహిస్తారు.