హార్థిక్ పాండ్యా అవుట్, రాహుల్ కు వైస్ కెప్టెన్సీ!
ప్రపంచకప్ 5వ రౌండ్ నుంచి భారతజట్టుకు వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు.
ప్రపంచకప్ 5వ రౌండ్ నుంచి భారతజట్టుకు వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. తుదిజట్టులో హార్థిక్ పాండ్యా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ కు చోటు దక్కనుంది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో వరుసగా నాలుగు విజయాలు సాధించిన భారత్ కు హార్థిక్ పాండ్యా గాయం రూపంలో తొలిదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ తో కీలక 5వ రౌండ్ మ్యాచ్ ప్రారంభానికి ముందే వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
కాలిమడమ గాయంతో పాండ్యా అవుట్...
పూణే వేదికగా బంగ్లాదేశ్ తో నాలుగో రౌండ్ మ్యాచ్ ఆడుతూ గాయపడిన భారత వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. భారతజట్టులో అత్యంత కీలకమైన ఆల్ రౌండర్ గా ఉన్న పాండ్యా కాలిమడమ గాయంతో బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు.
హార్థిక్ పాండ్యా అందుబాటులో లేకపోడంతో వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా నియమిస్తు టీమ్ మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకొంది.
పాండ్యా గాయం కారణంగా స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కు తుదిజట్టులో చోటు కల్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
న్యూజిలాండ్ తో సూపర్ సండే కీలక సమరం...
ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా జరిగే కీలక 5వ రౌండ్ పోరులో లీగ్ టేబుల్ టాపర్లు న్యూజిలాండ్, భారత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
మొదటి నాలుగురౌండ్లలో రెండుజట్లూ అజేయంగా నిలవడం ద్వారా 8 పాయింట్లు చొప్పున సాధించి లీగ్ టేబుల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
తన తొలిరౌండ్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను చిత్తు గా ఓడించడం ద్వారా శుభారంభం చేసిన కివీజట్టు రెండోరౌండ్లో నెదర్లాండ్స్, మూడోరౌండ్లో బంగ్లాదేశ్, నాలుగో రౌండ్లో అప్ఘనిస్థాన్ జట్లపై విజయాలు నమోదు చేసింది.
మరోవైపు టాప్ ర్యాంకర్ భారత్ మాత్రం తన తొలిరౌండ్ మ్యాచ్ లో ఆస్ట్ర్రేలియాను, రెండోరౌండ్లో అఫ్ఘనిస్థాన్ ను , మూడోరౌండ్లో పాకిస్థాన్ ను, నాలుగో రౌండ్లో బంగ్లాదేశ్ ను కంగు తినిపించడం ద్వారా అజేయంగా నిలిచింది.
కీలక ఆటగాళ్లకు గాయాలు..
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్, భారత వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా గాయాల పాలు కావడంతో రెండుజట్లూ కీలక ఆటగాళ్లు లేకుండా పోటీకి దిగనున్నాయి.
వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లేధమ్ నాయకత్వంలో కివీజట్టు నిలకడగా రాణిస్తూ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్ లతో కూడిన పేస్, రచిన్ రవీంద్ర, సాంట్నర్ లతో స్పిన్ బౌలింగ్ ఎటాక్ తో ప్రత్యర్థిజట్లకు న్యూజిలాండ్ సవాలు విసురుతోంది.
బ్యాటింగ్ ఆర్డర్ సైతం సమతూకంతో ఉండడంతో న్యూజిలాండ్ నిలకడగా రాణిస్తూ వరుస విజయాలతో టేబుల్ టాపర్ గా నిలువగలిగింది.
అశ్విన్ కు తుదిజట్టులో చోటు ఖాయం..
ప్రస్తుత ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లో మాత్రమే భారత్ తరపున ఆడిన జాదూస్పిన్నర్ రవిచంద్రన్ అశ్వన్ ఆ తర్వాతి మూడుమ్యాచ్ లకూ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే..హార్థిక్ పాండ్యా గాయంతో పాటు..ధర్మశాల స్టేడియం పిచ్ స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉండడంతో తుదిజట్టులో అశ్విన్ కు చోటు దక్కడం ఖాయం కానుంది.
జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్ లు పేస్, జడేజా, కుల్దీప్, అశ్విన్ లు స్పిన్ విభాగంలో న్యూజిలాండ్ కు సవాలు విసరనున్నారు.
సమానబలం కలిగిన భారత్- న్యూజిలాండ్ జట్ల సూపర్ సండే పోరు కోట్లాదిమంది అభిమానులకు పసందైన క్రికెట్ విందేకానుంది...