ఉత్కం'టై 'గా ముగిసిన భారత్- శ్రీలంక తొలివన్డే!

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్- శ్రీలంకజట్ల తొలివన్డే ఉత్కంఠభరితమైన టైగా ముగిసింది. రెండుజట్లూ 230 స్కోర్లే సాధించడం ద్వారా సమఉజ్జీలుగా నిలిచాయి.

Advertisement
Update:2024-08-03 14:45 IST

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్- శ్రీలంకజట్ల తొలివన్డే ఉత్కంఠభరితమైన టైగా ముగిసింది. రెండుజట్లూ 230 స్కోర్లే సాధించడం ద్వారా సమఉజ్జీలుగా నిలిచాయి.

ఐసీసీ మినీ ప్రపంచకప్ ( చాంపియన్స్ ట్రోఫీ)కి సన్నాహకంగా ..కొలంబో వేదికగా భారత్- శ్రీలంకజట్ల మధ్య ప్రారంభమైన మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లోని తొలిపోరు ఉత్కంఠభరితమైన ఫలితంతో ముగిసింది.

స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉన్న ప్రేమదాస ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలివన్డే నువ్వానేనా అన్నట్లుగా సాగింది. స్పిన్ బౌలర్ల స్వర్గంగా పేరుపొందిన పిచ్ పైన జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది.సమాధానంగా 231 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ సైతం చివరకు 47.5 ఓవర్లలోనే 230 పరుగులకే కుప్పకూలడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

స్లోబౌలర్ల హవా.....

సిరీస్ లోని ఈ తొలిమ్యాచ్ లో కీలక టాస్ నెగ్గిన ఆతిథ్య శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని ఒకదశలో 197 పరుగులకే 7 టాపార్డర్ వికెట్లు నష్టపోయింది. అయితే..భారత బౌలర్లు పట్టుబిగించలేకపోడంతో శ్రీలంక పుంజుకొని ఆడి 50 ఓవర్లలో 230 పరుగుల స్కోరు చేయగలిగింది.

ఓపెనర్ పతుమ్ నిస్సంక 56, ఆల్ రౌండర్ దునిత వెల్లలాగే 67 పరుగుల స్కోర్లు సాధించడంతో శ్రీలంక పుంజుకోగలిగింది. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

వన్డే చరిత్రలో ఇది 44వ 'టై'!

ఆ తరువాత 231 పరుగుల లక్ష్యంతోచేజింగ్ దిగిన భారత్ కు కెప్టెన్ రోహిత్ శర్మ- వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ మొదటి వికెట్ కు 12.4 ఓవర్లలోనే 75 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

గిల్ 16, వన్ డౌన్ విరాట్ కొహ్లీ 24, వాషింగ్టన్ సుందర్ 5 పరుగుల స్కోర్లకు అవుట్ కావడంతో భారత్ ఆత్మరక్షణలో పడింది. అయినా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తనదైన శైలిలో బ్యాట్ ఝళిపిస్తూ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 46 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగుల స్కోరుకు స్పిన్నర్ వెల్లలాగే బౌలింగ్ లో అవుట్ కావడంతో భారత్ ఎదురీత ప్రారంభమయ్యింది.

మిడిల్ ఓవర్లలో పరుగులు రాబట్టడానికి భారత బ్యాటర్లు నానాపాట్లు పడాల్సి వచ్చింది. శ్రేయస్ అయ్యర్ 23, రాహుల్ 31, అక్షర్ పటేల్ 33, శివం దుబే 25 పరుగులు చేసినా..భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకే కుప్పకూలింది. ఆఖరి 14 బంతుల్లో విజయానికి ఒక్క పరుగు మాత్రమే అవసరమైన సమయంలో క్రీజులోకి వచ్చిన 11వ నంబర్ బ్యాటర్ అర్షదీప్ సింగ్ ను శ్రీలంక కెప్టెన్ అసలంక అవుట్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

50 ఓవర్ల వన్డే క్రికెట్ చరిత్రలో 44వ 'టై' మ్యాచ్ గా భారత్- శ్రీలంకజట్ల పోరు రికార్డుల్లో చేరింది. సిరీస్ లోని రెండో వన్డే ఆగస్టు 4న ప్రేమదాస స్టేడియం వేదికగానే జరుగనుంది.

కెప్టెన్ రోహిత్ సిక్సర్ల రికార్డు...

ఉత్కంఠభరితంగా సాగిన ఈ తొలివన్డేలో భారత్ ను విజయం వరించకపోయినా..కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం సిక్సర్ల బాదుడులో సరికొత్త ప్రపంచరికార్డు నమోదు చేయగలిగాడు.

వన్డే క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వోయిన్ మోర్గాన్ పేరుతో ఉన్న 232 సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించగలిగాడు.

ఈ తొలివన్డేలో రోహిత్ 47 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. భారత కెప్టెన్ గా వన్డే క్రికెట్లో రోహిత్ సాధించిన సిక్సర్ల సంఖ్య 234కు చేరింది.

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన మొదటి ఐదుగురు కెప్టెన్లలో రోహిత్, ధోనీ నిలిచారు. రోహిత్ శర్మ 234, మోర్గాన్ 233, ధోనీ 211, రికీ పాంటింగ్ 171, బ్రెండన్ మెకల్లమ్ 170 సిక్సర్లతో ఉన్నారు.

15000 పరుగుల క్లబ్ లో రోహిత్...

అంతేకాదు..రోహిత్ శర్మ మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకోగలిగాడు. వన్డే క్రికెట్లో 15000 పరుగుల మైలురాయి చేరిన భారత మూడో క్రికెటర్ గా నిలిచాడు.

వీరేంద్ర సెహ్వాగ్ 16119 పరుగులతో మొదటి స్థానంలో ఉంటే..సచిన్ టెండుల్కర్ 15335 పరుగులతో రెండు, రోహిత్ శర్మ 15039 పరుగులతో మూడు స్థానాలలో కొనసాగుతున్నారు.

Tags:    
Advertisement

Similar News