బెన్‌స్టోక్స్ షాకింగ్ నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు గుడ్‌బై

రేపు దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచే తన కెరీర్‌లో చివరి వన్డే అని స్పష్టం చేశాడు.

Advertisement
Update:2022-07-18 18:19 IST

ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. వన్డే ఫార్మాట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్తున్నట్లు కాసేపటి క్రితం ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇకపై కేవలం టెస్టు, టీ20 ఫార్మాట్‌లో మాత్రమే ఆడతానని.. మూడు ఫార్మాట్లలో ఆడటం వల్ల క్రికెట్‌కు సరైన న్యాయం చేయలేకపోతున్నట్లు స్టోక్స్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. రేపు దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచే తన కెరీర్‌లో చివరి వన్డే అని స్పష్టం చేశాడు.

31 ఏళ్ల బెన్‌స్టోక్స్ ఇప్పటి వరకు 104 వన్డేల్లో 39.44 సగటుతో 2919 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 102 నాటౌట్ అతడి వన్డే అత్యధిక స్కోర్. అదే విధంగా 6.02 ఎకానమీతో 74 వికెట్లు తీశాడు. 5/61 అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. 2019 వరల్డ్ కప్ ఫైనల్‌లో బెన్‌స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే ఇంగ్లాండ్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్నది. మంగళవారం తన సొంత గ్రౌండ్ దుర్హమ్‌లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ఆడనున్నాడు.

'మంగళవారం దుర్హమ్‌లో సౌత్‌ఆఫ్రికాతో జరుగనున్న వన్డేనే నా కెరీర్‌లో చివరి 50 ఓవర్ ఫార్మాట్ మ్యాచ్. నేను ఇకపై వన్డేలు ఆడొద్దనే నిర్ణయం తీసుకున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయమే. కానీ తప్పలేదు. ఇంగ్లాండ్ తరపున ఆడుతున్న ప్రతీ క్షణాన్ని నేను ఆస్వాదించాను. తోటి క్రికెటర్లతో అద్భుతమైన ప్రయాణం చేశాను. ఇది కఠినమైన నిర్ణయమే అయినా.. ఈ ఫార్మాట్‌లో ఆడుతున్న నా సహచర క్రికెటర్ల లాగానే, నేను 100 శాతం ప్రదర్శన చేయలేకపోతున్నాను. బిజీ షెడ్యూల్ కారణంగా నేను అన్ని ఫార్మాట్లకు న్యాయం చేయలేకపోతున్నాను. నా శరీరం కూడా అనుకున్నంత సహకరించడం లేదు. నేను తప్పుకోవడం వల్ల నా స్థానంలో మరో క్రికెటర్ ఎదుగుతాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఇకపై నేను టెస్టు క్రికెట్, టీ20 ఫార్మాట్లలో పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని భావిస్తున్నట్లు స్టోక్స్ చెప్పాడు. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన జాస్ బట్లర్, మాథ్యూ మాట్, ఇతర ప్లేయర్లు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

Tags:    
Advertisement

Similar News