హైదరాబాద్‌లో పాకిస్తాన్ జట్టు.. ఎక్కడ బస చేశారో తెలుసా?
శుక్రవారం పాకిస్తాన్ జట్టు తమ తొలి వార్మప్ మ్యాచ్‌ను న్యూజీలాండ్‌తో ఆడనున్నది. భద్రతా కారణాల దృష్ట్యా ఆ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకున్నది. వీసా పనులు కాస్త ఆలస్యం కావడంతో వార్మప్ మ్యాచ్‌కు కేవలం రెండు రోజుల ముందు పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ వచ్చింది. పాకిస్తాన్ నుంచి దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బుధవారం రాత్రి చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టు ఇండియాకు రావడంతో ఎయిర్‌పోర్టులో వందలాది మంది క్రికెట్ అభిమానులు టీమ్‌ను చూడటానికి వచ్చారు. పాకిస్తాన్ జీతేగా అనే నినాదాలతో ఎయిర్‌పోర్టును మర్మోగించారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పాకిస్తాన్ జట్టును బంజారా హిల్స్‌లోని పార్క్ హయత్‌కు పోలీసులు చేర్చారు. అక్కడ పాకిస్తాన్ టీమ్‌కు హోటల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. వినాయక నిమజ్జనం జరుగుతుండటంతో హైదరాబాద్ అంతా సందడిగా ఉన్నది. ఈ రోజు పాకిస్తాన్ జట్టు ఉప్పల్ స్టేడియంకు వెళ్లి ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. దీంతో వారి కోసం ప్రత్యేక భద్రత కల్పించారు. శుక్రవారం పాకిస్తాన్ జట్టు తమ తొలి వార్మప్ మ్యాచ్‌ను న్యూజీలాండ్‌తో ఆడనున్నది. భద్రతా కారణాల దృష్ట్యా ఆ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు.
పాకిస్తాన్ జట్టు రెండో వార్మప్ మ్యాచ్ అక్టోబర్ 3న పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరుగనున్నది. ఇక గ్రూప్ దశలో రెండు మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే ఆడనున్నది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో, అక్టోబర్ 10న శ్రీలంకతో ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నది. ఒక్క న్యూజీలాండ్ మ్యాచ్‌కు తప్ప మిగిలిన మ్యాచ్‌లు అన్నింటికీ ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌ల టికెట్లు అన్నీ బుక్ అయినట్లు తెలుస్తున్నది.