ఆ రాత్రి కంటిమీద కునుకే లేదు- జురెల్!

భారత టెస్టు సిరీస్ విజయంలో ప్రధానపాత్ర వహించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ గాల్లో తేలిపోతున్నాడు.

Advertisement
Update:2024-02-29 16:08 IST

భారత టెస్టు సిరీస్ విజయంలో ప్రధానపాత్ర వహించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ గాల్లో తేలిపోతున్నాడు. టెస్ట్ క్రికెట్ ఆడాలన్న తన జీవిత లక్ష్యం కేవలం 22 సంవత్సరాల ప్రాయంలోనే సఫలం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న5 మ్యాచ్ ల సిరీస్ మొదటి నాలుగు టెస్టులు ముగిసే సమయానికి ఆతిథ్య భారత్ 3-1తో పైచేయి సాధించడంలో పలువురు యువక్రికెటర్లు కీలకపాత్ర పోషించారు.

ఐదుగురు సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా..అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఏమాత్రం లేని భారత్ వరుసగా మూడుటెస్టుల్లో విజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది.

హైదరాబాద్ నుంచి రాంచీ వరకూ జరిగిన సిరీస్ లోని మొదటి నాలుగుటెస్టుల్లో ఇప్పటికే నలుగురు యువఆటగాళ్లు టెస్ట్ క్యాప్ లు అందుకొన్నారు. మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ మాత్రమే దారుణంగా విఫలం కాగా...సరఫ్రాజ్ ఖాన్, వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్, ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ అంచనాలకు మించి రాణించడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నారు.

ధృవ్ జురెల్ సూపర్ హిట్...

సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ వరుస వైఫల్యాలతో విసిగిపోయిన భారత టీమ్ మేనేజ్ మెంట్..రాజకోట వేదికగా జరిగిన మూడోటెస్టు ద్వారా 22 సంవత్సరాల యూపీ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ తో అరంగేట్రం చేయించింది.

వికెట్ కీపర్ గా, లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ గా తన తొలిటెస్టులోనే అంచనాలకు తగ్గట్టుగా ఆడిన జురెల్..రాంచీ వేదికగా జరిగిన నాలుగోటెస్టులో భారత్ కు ఒంటిచేత్తో విజయం అందించాడు. ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తొలిఇన్నింగ్స్ లో 90 పరుగుల స్కోరు సాధించడంతో పాటు...టెయిల్ ఎండర్ కుల్దీప్ యాదవ్ తో కలసి 73 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు.

ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్ స్కోరు 353 పరుగులకు బదులుగా రెండోరోజుఆట ముగిసే సమయానికి భారత్ 219 పరుగుల స్కోరుకే 7 వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

జురెల్ రివర్స్ ఎటాక్........

భారత్ ను ఆదుకొనే భారం జురెల్ తో పాటు కుల్దీప్ యాదవ్ లాంటి టెయిల్ ఎండర్లపైన పడింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి జురెల్ 30 పరుగులు, కుల్దీప్ 17 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలిచారు.

ఆ రోజు రాత్రి తనకు కంటిమీద కునుకేలేదని, జట్టును కష్ట్రాల నుంచి బయట ఎలా పడవేయాలి అన్న ఆలోచనలతోనే గడిచింది. చివరి అంచె బ్యాటర్లతో కలసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాలన్న పట్టుదల తనలో పెరిగిపోయిందని, రాత్రంతా నిదురలేకుండానే గడిపానని ధృవ్ జురెల్ గుర్తు చేసుకొన్నాడు.

8వ వికెట్ కు కుల్దీప్ యాదవ్ తో కలసి 73 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా జురెల్ మ్యాచ్ ను మలుపు తిప్పాడు. తన కెరియర్ లో కేవలం రెండో టె్స్టుమ్యాచ్ మాత్రమే ఆడుతున్న జురెల్ 90 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. భారత్ 307 పరుగులకు ఆలౌట్ కావడం ద్వారా 46 పరుగుల తొలిఇన్నింగ్స్ లోటుతో ఊపిరిపీల్చుకోగలిగింది.

అంతేకాదు..రెండో ఇన్నింగ్స్ లో సైతం భారత్ పరుగుల కోసం సతమతమవుతుంటే..శుభ్ మన్ గిల్ తో కలసి 5వ వికెట్ కు జురెల్ అజేయభాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా 5 వికెట్ల విజయం అందించాడు. చివరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

తన జీవిత లక్ష్యం టెస్టు క్రికెట్ ఆడటమని, క్రికెటర్ కావడానికి తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, తాను ఎన్నో బాధలు, అవమానాలు భరించానని..చివరకు 22 సంవత్సరాల వయసులోనే తన కల సాకారమయ్యిందంటూ జురెల్ పొంగిపోయాడు.

క్రీజులో సాధ్యమైనంత ఎక్కువసేపు ఉంటే పరుగులు వాటంతట అవే వస్తాయని తనకు అనుభవమయ్యిందని, టెయిల్ ఎండర్ల బ్యాటింగ్ సత్తాపైన తనకు విశ్వాసం ఉందని ప్రకటించాడు.

అమ్మత్యాగం..నాన్న తిట్ల ఫలితమే....

క్రికెట్ కిట్టు, బ్యాటు కొనుక్కోడానికి తగిన డబ్బులు లేని సమయంలో తనతల్లి నగలు కుదువ పెట్టిన విషయం తనకు జీవితకాలం గుర్తుండిపోతుందని, క్రికెట్ వద్దు, చదువే ప్రధానమంటూ నాన్న తిట్టిన తిట్లు సైతం చెవిలో మార్మోగిపోతూనే ఉంటాయని జురెల్ గుర్తుచేసుకొన్నాడు.

తన తల్లికి క్రికెట్ గురించి ఏమీ తెలియదని, అమ్మనాన్నలిద్దరూ గొప్పభక్తిపరులని, తాను సాధించిన పరుగులను దేవుడికి సమర్పించమని తన తల్లి కోరిందని జురెల్ తెలిపాడు..

క్రికెటర్ గా తన తొలి అడుగు నుంచి టెస్టు అరంగేట్రం వరకూ తనకు ఓ కలలా అనిపిస్తోందని, తల్లిదండ్రుల దీవెనలు, ప్రేరణ, త్యాగాలే తనను ముందుకు నడిపిస్తున్నాయని జురెల్ చెప్పాడు.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు జురెల్ 20 లక్షల రూపాయల కాంట్రాక్టుపై ఆడుతూ వస్తున్నాడు. భారతజట్టు తరపున ఆడిన ఒక్కో టెస్టుమ్యాచ్ కు..జురెల్ మ్యాచ్ ఫీజుగా 15 లక్షల రూపాయల చొప్పున అందుకోనున్నాడు.

అంతేకాదు..బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో గ్రేడ్-సీ జాబితాలో చోటు సంపాదించిన జురెల్ కు ఏడాది కాలానికి కోటిరూపాయల గ్యారెంటీ మనీ సైతం అందనుంది.

దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన జురెల్ తండ్రి కార్గిల్ యుద్ధవీరుడు కూడా. జురెల్ అంతర్జాతీయ క్రికెటర్ కావడంతో ఆర్ధిక కష్టాలన్నీ ఒక్కసారిగా దూదిపింజాలు మాదిరిగా ఎగిరిపోయాయి.

దేశంలోని కోట్లాదిమంది యువతకు 22 సంవత్సరాల ధృవ్ జురెల్ జీవితం, క్రికెట్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News