కుస్తీ సమాఖ్యమాజీ అధ్యక్షుడిపై ఎఫ్ఐఆర్!

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజెపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఢిల్లీ న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement
Update:2024-05-13 16:50 IST

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజెపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఢిల్లీ న్యాయస్థానం ఆదేశించింది.

భారత్ కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఏడుగురు మహిళా వస్తాదులను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ..బీజెపీ పెద్దల అండదండలతో దర్జాగా తిరుగుతున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.

బ్రిజ్ భూషణ్ పై ఎట్టకేలకు....

అంతర్జాతీయ కుస్తీ పోటీలలో భారత్ పలు పతకాలు సాధించి పెట్టిన వినేశ్ పోగట్ తో సహా ఏడుగురు మహిళా వస్తాదులను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజెపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పాపం ఎట్టకేలకు పండింది.

బ్రిజ్ భూషణ్ అత్యాచారాలను నిరసిస్తూ 30 మంది వస్తాదులు న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెండు నెలలపాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించినా, న్యాయస్థానాలను ఆశ్రయించినా...రాజకీయ అధికారం అడ్డుపెట్టుకొని గత కొద్దిమాసాలుగా దర్జాగా తిరుగుతున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి తగిన ఆధారాలున్నాయని, మహిళల ఆత్మగౌరవాన్నే పరిహసించిన బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాల్సిందేనని ఢిల్లీ కోర్టు ఎడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మాజిస్ట్ర్రేట్ ప్రియాంక రాజ్ పుట్ తేల్చి చెప్పారు.

ఐపీసీ 354, 354-ఏ సెక్షన్ల కింద కేసు...

భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా పదేళ్లపాటు చక్రం తిప్పిన బ్రిజ్ భూషణ్..ఉత్తరప్రదేశ్ లోని కేసరి గంజ్ నియోజకవర్గం నుంచి బీజెపీ ఎంపీగా అధికారం చెలాయించారు. తన పదవీకాల సమయంలో మహిళా వస్తాదులతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధించినట్లుగా కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.

బ్రిజ్ భూషణ్, ఆయన అనుచరుల నుంచి లైంగిక వేధింపులకు గురైన ఏడుగురు మహిళా వస్తాదులు ఎవరికి వారుగా ఫిర్యాదులు చేయడంతో పాటు..రోడెక్కి ఆందోళనకు దిగారు. అయినా..కేంద్రప్రభుత్వం ఖాతరు చేయకుండా తీవ్రఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ ఎంపీని కాపాడుకోడానికే ప్రాధాన్యమిచ్చింది.

దీంతో మహిళా వస్తాదులు ఢిల్లీ న్యాయస్థానాన్ని కొద్ది మాసాల క్రితమే ఆశ్రయించారు.

ఇదే సమయంలో బ్రిజ్ భూషణ్ కుస్తీ సమాఖ్య అధ్యక్షపదవి నుంచి వైదొలిగి తన చేతిలో కీలుబొమ్మ సంజయ్ సింగ్ ను ఆ పదవిలో కూర్చోబెట్టి పరోక్షంగా పెత్తనం చేయటం ప్రారంభించాడు.

పైగా..ప్రస్తుత ఎన్నికల్లో కేసరిగంజ్ స్థానం నుంచి తాను పోటీ చేయకుండా తన కుమారుడికి బీజెపీ టికెట్ ఇప్పించుకోగలిగాడు. బ్రిజ్ భూషణ్ పై పోరాటంలో ఒలింపిక్ మాజీ పతక విజేత సాక్షి మాలిక్ తన కెరియర్ నే పణంగా పెట్టగా..భజరంగ్ పూనియా త్వరలో జరిగే పారిస్ ఒలింపిక్స్ కు దూరమయ్యాడు. వినేశ్ పోగట్ మాత్రమే..

బ్రిజ్ భూషణ్ పై తన పోరాటం కొనసాగిస్తునే..ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అర్హత సంపాదించగలిగింది.

మహిళల ఆత్మగౌరవంతోనే ఆటలా...

అంతర్జాతీయ కుస్తీ పోటీలలో దేశానికి పతకాలు సంపాదించి పెడుతున్న మహిళా వస్తాదుల ఆత్మగౌరవంతో ఆటలాడుతూ..లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని ఢిల్లీ కోర్టు తీవ్రంగా పరిగణించింది.

బాధితుల ఆరోపణలను సమగ్రంగా పరిశీలించిన పిమ్మట బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయదగ్గ ఆధారాలు లభించినట్లు న్యాయమూర్తి ప్రియాంకా తమ తీర్పులో పేర్కొన్నారు.

బాధితుల్లో 6వ వస్తాదు చేసిన ఆరోపణల్లో బ్రిజ్ భూషణ్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని, 354, 354-ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 2012 నుంచి తమను లైంగికంగా బ్రిజ్ భూషణ్ తో పాటు ఆయన అనుచరులు వేధిస్తూ వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మొదటి బాధితురాలు, 5వ బాధితురాలిపై బ్రిజ్ భూషణ్ నేరపూరితంగా వ్యవహరిస్తూ దౌర్జన్యం చేసినట్లుగా ఆధారాలు లభించాయని, 506 (1) సెక్షన్ తో పాటు..

354 -డీ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

కుస్తీ సమాఖ్య మాజీ కార్యదర్శి వినోద్ తోమర్ పేరు ను సైతం ఎఫ్ఐఆర్ లో చేర్చాలని సూచించారు.

బ్రిజ్ భూషణ్ విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు..

తనపై జరుగుతున్న విచారణను మరింత లోతుగా చేయాలని , మహిళా వస్తాదులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సమయంలో తాను ఢిల్లీలో లేనేలేనని తన న్యాయవాది ద్వారా బ్రిజ్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి ప్రియాంకా తిరస్కరించారు.

నాలుగు రాష్ట్ర్రాలకు చెందిన సాక్షులు, సంబంధిత వ్యక్తులను విచారించిన అనంతరం ఢిల్లీ పోలీసులు మొత్తం 1500 పేజీలతో కూడిన చార్జిషీట్ ను తయారు చేశారు.

మొత్తం ఐదు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

గతంలోనే పాటియాలా హౌస్ కోర్టుకు..విచారణ నిర్వహించిన ఢిల్లీ పోలీసులు 550 పేజీల నివేదికను సమర్పించారు. పలువురు వస్తాదులు, శిక్షకులు, నిర్వాహకులు, కుస్తీ సమాఖ్య వివిధ హోదాలలోని వ్యక్తులను విచారించారు.

బ్రిజ్ భూషణ్ పై పెట్టిన పోక్సో చట్టం కేసును ఉపసంహరించుకోవాలని కోరిన సమయంలోనే ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయటంతో కథ అడ్డం తిరిగింది.

ఎన్నికల సమయంలోనే బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటూ న్యాయమూర్తి ఆదేశించడంతో బీజెపీ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బ్రిజ్ భూషణ్ కుమారుడికి కష్ట్లాలు తప్పవు.

ఆలస్యంగానైనా....

బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటూ న్యాయమూర్తి ఆదేశించడం పట్ల విఖ్యాత వస్తాదు, బాధితురాలు వినేశ్ పోగట్ సంతోషం వ్యక్తం చేసింది.

ఆలస్యంగానైనా న్యాయం జరిగినందుకు తృప్తిగా ఉందని, ఇకనుంచి తాము ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా తలెత్తుకు తిరుగుతామని, బ్రిజ్ భూషణ్ కళ్లలోకి సూటిగా చూడగలమని వ్యాఖ్యానించింది.

ఇటీవలే జరిగిన ఒలింపిక్స్ అర్హత కుస్తీ పోటీలలో రాణించడం ద్వారా పారిస్ గేమ్స్ బెర్త్ ఖాయం చేసుకోడం ద్వారా వినేశ్ పోగట్..బ్రిజ్ భూషణ్ అనుచరుల దుష్ప్ర్రచారానికి అడ్డుకట్ట వేసినట్లయ్యింది.

Tags:    
Advertisement

Similar News