పంత్ పటాఫట్ బ్యాటింగ్..విశాఖ వేదికగా ఢిల్లీ బోణీ!

ఐపీఎల్-17వ సీజన్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణి కొట్టింది. 15 మాసాల విరామం తరువాత రిషభ్ పంత్ తన తొలి హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.

Advertisement
Update:2024-04-01 08:09 IST

ఐపీఎల్-17వ సీజన్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణి కొట్టింది. 15 మాసాల విరామం తరువాత రిషభ్ పంత్ తన తొలి హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.

ఐపీఎల్-2024 సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ 12, 13 రౌండ్ల మ్యాచ్ ల్లో ఫలితాలు తారుమారయ్యాయి. భారీవిజయాలతో దూకుడు మీదున్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చాయి.

విశాఖ వేదికగా ఐపీఎల్ షురూ..

2019 తరువాత విశాఖపట్నం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా 2024 సీజన్ తొలిమ్యాచ్ విజయవంతంగా ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో హోంగ్రౌండ్ గా విశాఖ ప్రస్తుత సీజన్ లో వేదికగా నిలిచింది.

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఈ పోరులో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. మొదటి రెండురౌండ్లలోనూ అలవోక విజయాలతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన చెన్నైకి ప్రస్తుత సీజన్లో తొలి ఓటమి ఎదురయ్యింది.

ఓపెనింగ్ జోడీ డేవిడ్ వార్నర్- పృథ్వీ షా ఇచ్చిన మెరుపు ఆరంభానికి..కెప్టెన్ రిషభ్ పంత్ సాధించిన అర్థశతకం జత కలవడంతో 20 ఓవర్లలో 191 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.

15 మాసాల తరువాత పంత్ మెరుపులు...

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత 15 మాసాలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ప్రస్తుత సీజన్ మూడవ మ్యాచ్ లోనే తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేయగలిగాడు. తనదైన శైలిలో బ్యాటు ఝళిపిస్తూ కేవలం 32 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు సైతం ఉన్నాయి.

సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 35 బంతుల్లోనే 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 52 పరుగులు సాధించడం ద్వారా క్రిస్ గేల్ పేరుతో ఉన్న 110 టీ-20 హాఫ్ సెంచరీల రికార్డును సమం చేయగలిగాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 27 బంతుల్లోనే 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 43 పరుగులతో మెరిశాడు.

ధోనీ బ్యాట్ ఝళిపించినా....

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 192 పరుగులు చేయాల్సిన చెన్నై సూపర్ కింగ్స్ ను 171 పరుగులకే ఢిల్లీ బౌలర్లు కట్టడి చేయగలిగారు. ఓపెనింగ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ పవర్ ప్లే ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టడం, మిడిల్ ఓవర్లలో అక్షర్ పటేల్ పగ్గాలు వేయడంతో చెన్నై పుంజుకోలేకపోయింది.

రవీంద్ర జడేజా 21, ధోనీ 37 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించినా ప్రయోజనం లేకపోయింది. వెటరన్ ధోనీ 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిపోయాడు.

ఈ మ్యాచ్ లో ఓటమి పాలైనా చెన్నైజట్టు లీగ్ టేబుల్ టాపర్ గా తన స్థానం నిలుపుకోగలిగింది. తొలివిజయం సాధించడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ 10 జట్ల లీగ్ టేబుల్ 7వ స్థానానికి చేరుకోగలిగింది.

సన్ రైజర్స్ కు గుజరాత్ షాక్...

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మరో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను కంగు తినిపించింది. సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా టైటాన్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికే లక్ష్యం సాధించడం ద్వారా 3 రౌండ్లలో రెండో విజయం నమోదు చేయగలిగింది.

లీగ్ మొదటి మూడురౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ రెండు విజయాలు, ఓ పరాజయంతో 4 పాయింట్లు సాధించడం ద్వారా మెరుగైన నెట్ రన్ రేట్ తో టాపర్ గా తన స్థానం కాపాడుకోగలిగింది.

రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించినా కోల్ కతా నైట్ రెైడర్స్ రెండోస్థానంలో కొనసాగుతోంది. ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ టేబుల్ 5వస్థానం సాధిస్తే..పంజాబ్ కింగ్స్, బెంగళూరు 8, 9 స్థానాలలో ఉన్నాయి.

ఆరెంజ్ క్యాప్ రేస్ లో విరాట్ జోరు...

అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేస్ లో విరాట్ కొహ్లీ దూసుకుపోతున్నాడు. 181 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. సన్ రైజర్స్ వికెట్ కీపర్ హెన్రిక్ క్లాసెన్ 167 పరుగులతో విరాట్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లకు ఇచ్చే పర్పుల్ క్యాప్ రేస్ లో చెన్నై సూపర్ కింగ్స్ సీమర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 7 వికెట్లతో టాపర్ గా ఉన్నాడు.

గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ సైతం 6 వికెట్లతో రెండోస్థానం సాధించాడు.

ఈ రోజు జరిగే పోరులో మాజీ చాంపియన్లు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్..వాంఖడే స్టేడియం వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Tags:    
Advertisement

Similar News