పిల్లజట్టుపై ఇంగ్లండ్ పెద్ద విజయం!

ప్రపంచకప్ లీగ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ వరుస పరాజయాల తరువాత ఎట్టకేలకు ఓ పెద్ద విజయం సాధించింది.

Advertisement
Update:2023-11-09 11:07 IST

ప్రపంచకప్ లీగ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ వరుస పరాజయాల తరువాత ఎట్టకేలకు ఓ పెద్ద విజయం సాధించింది.

2023 -ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ వేటకు దిగిన ఇంగ్లండ్ పరిస్థితి ఇంత బతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది.

ఇప్పటికే సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు దూరమైన ఇంగ్లండ్ మొదటి 8 రౌండ్లలో ఐదు వరుస పరాజయాల తరువాత తొలివిజయం నమోదు చేసింది.

పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా పిల్లజట్టు నెదర్లాండ్స్ తో జరిగిన 8వ రౌండ్ మ్యాచ్ లో 160 పరుగుల భారీవిజయంతో ఊపిరి పీల్చుకొంది.

రాణించిన స్టోక్స్, వోక్స్ ....

లీగ్ దశలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ లాంటి మేటిజట్లపై సంచలన విజయాలు సాధించిన నెదర్లాండ్స్...8వ రౌండ్ లో మాత్రం చాంపియన్ ఇంగ్లండ్ ముందు తేలిపోయింది.

టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఇంగ్లండ్ 9 వికెట్లకు 339 పరుగుల భారీస్కోరు నమోదు చేసి ప్రత్యర్థి ఎదుట 340 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఓపెనర్ డేవిడ్ మలన్ 87, జో రూట్ 28, బెయిర్ స్టో 15 పరుగులకు అవుట్ కాగా..ఆల్ రౌండర్లు బెన్ స్టోక్స్ సెంచరీ, క్రిస్ వోక్స్ 51 పరుగుల స్కోర్లు సాధించారు.

బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు...

బెన్ స్టోక్స్ కేవలం 84 బంతుల్లోనే 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 108 పరుగులతో సెంచరీ సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో ఓ ఇంగ్లండ్ బ్యాటర్ సాధించిన ఏకైక సెంచరీ స్టోక్స్ సాధించినదే కావడం విశేషం.

ఈ శతకంతో స్టోక్స్ ఓ అరుదైన ఘనతను దక్కించుకొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 10వేల పరుగులు, 100 వికెట్లు సాధించిన దిగ్గజ ప్లేయర్ల జాబితాలో చోటు సంపాదించాడు.

నెదర్లాండ్స్ పై సాధించిన 108 పరుగులతో స్టోక్స్ సాధించిన మొత్తం అంతర్జాతీయ పరుగుల సంఖ్య 10,081కి చేరింది.

గతంలో అదే ఘనత సాధించిన దిగ్గజ క్రికెటర్లలో తిలకరత్నే దిల్షాన్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్, జాక్ కలిస్, సనత్ జయసూర్య ఉన్నారు.

32 సంవత్సరాల బెన్ 2011 ప్రపంచకప్ ద్వారా అరంగేట్రం చేశాడు. నాటినుంచి ప్రస్తుత ప్రపంచకప్ వరకూ 113 అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడి 3, 379 పరుగులు, 74 వికెట్లు సాధించాడు.

2013లో టెస్టు అరంగేట్రం చేసిన బెన్ 97 మ్యాచ్ ల్లో 6వేల 117 పరుగులతో పాటు 197 వికెట్లు పడగొట్టాడు. 2011లో టీ-20ల్లో అడుగుపెట్టిన బెన్ 585 పరుగులు, 26 వికెట్ల రికార్డు సాధించాడు. వన్డే లలో స్టోక్స్ కు ఇది 5వ శతకం కాగా..టెస్టు క్రికెట్లో 13 సెంచరీలున్నాయి.

బోథమ్ సరసన క్రిస్ వోక్స్....

బ్యాటింగ్ లో 51 పరుగులతో రాణించిన ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ బౌలర్ గా 7 ఓవర్లలో 19 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇయాన్ బోథమ్ రికార్డును సమం చేయగలిగాడు. ప్రపంచకప్ టోర్నీలలో క్రిస్ వోక్స్ కు ఇది 30వ వికెట్ కావడం విశేషం.

ఇయాన్ బోథమ్, క్రిస్ వోక్స్ చెరో 30 వికెట్లతో సంయుక్త అగ్రస్థానంలో నిలిస్తే..ఫిలిప్ డిఫ్రేటస్ 29 వికెట్లతో రెండు, జిమ్మీ యాండర్సన్ 27వికెట్లతో మూడు స్థానాలలో ఉన్నారు.

340 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 179 పరుగులకే కుప్పకూలి 160 పరుగుల ఘోరపరాజయం మూటగట్టుకొంది. ఇప్పటి వరకూ ఆడిన 8 రౌండ్లలో ఇంగ్లండ్ కు ఇది రెండో గెలుపు కాగా..4 పాయింట్లతో లీగ్ టేబుల్ 7వ స్థానానికి చేరుకోగలిగింది.

పసికూన నెదర్లాండ్స్ సైతం 8 రౌండ్లలో 2 విజయాలు, 6 పరాజయాలతో 4 పాయింట్లు సాధించినా..నెట్ రన్ రేట్ ప్రకారం లీగ్ టేబుల్ అట్టడుగున నిలిచింది.

తమ ఆఖరి రౌండ్ మ్యాచ్ ల్లో ఆతిథ్య భారత్ తో నెదర్లాండ్స్, పాకిస్థాన్ తో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News