డకౌట్లలో సచిన్ సరసన విరాట్ కొహ్లీ!

అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ 34వసారి డకౌటయ్యాడు. మాస్టర్ సచిన్ టెండుల్కర్ సరసన నిలిచాడు.

Advertisement
Update:2023-10-30 10:56 IST

డకౌట్లలో సచిన్ సరసన విరాట్ కొహ్లీ!

అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ 34వసారి డకౌటయ్యాడు. మాస్టర్ సచిన్ టెండుల్కర్ సరసన నిలిచాడు.

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో పరుగుల మోత మోగిస్తున్న భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీని ఇంగ్లండ్ డకౌట్ గా పడగొట్టింది. లక్నో లోని ఏక్నా స్టేడియం వేదికగా జరిగిన 6వ రౌండ్ మ్యాచ్ లో విరాట్ 9 బంతులు ఎదుర్కొని కనీసం ఒక్క పరుగు చేయకుండా పెవీలియన్ దారి పట్టాడు.

వన్డే క్రికెట్లో అరుదైన డకౌట్....

50 ఓవర్ల వన్డే క్రికెట్లో విరాట్ కొహ్లీకి 49 శతకాలతో 11వేలకు పైగా పరుగులు సాధించిన ఘనత ఉంది. మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న గొప్పగొప్ప రికార్డులను అధిగమిస్తూ వస్తున్న విరాట్ ..చివరకు మాస్టర్ పేరుతో ఉన్న ఓ చెత్త రికార్డును సైతం సమం చేయగలిగాడు.

వన్డే ఫార్మాట్లో విరాట్ అత్యంత అరుదుగా డకౌటవుతూ ఉంటాడు. అలాంటి అరుదైన డకౌట్ ప్రస్తుత వన్డే ప్రపంచకప్ 6వ రౌండ్ మ్యాచ్ లో చోటు చేసుకొంది. ఇంగ్లండ్ తో జరిగిన 6వ రౌండ్ మ్యాచ్ లో భారత్ 5వ ఓవర్లో ఓపెనర్ శుభ్ మన్ గిల్ వికెట్ నష్టపోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ తొమ్మిది బంతులు ఆడినా ఖాతా తెరవలేకపోయాడు. చివరకు సీమర్ పీటర్ విల్లే బౌలింగ్ లో బెన్ స్టోక్స్ పట్టిన క్యాచ్ కు డకౌట్ గా వెనుదిరిగాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటికే ఓ సూపర్ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 354 పరుగులు సాధించిన విరాట్ కు అంతర్జాతీయ క్రికెట్లో ఇది 34వ డకౌట్ గా రికార్డుల్లో నమోదయ్యింది. ప్రపంచకప్ లో 56 ( టీ-20, వన్డే ) మ్యాచ్ లు ఆడిన విరాట్ కు ఇదే తొలి డకౌట్ కావడం మరో అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

వన్డే క్రికెట్లో మాత్రం విరాట్ కు ఇది 16వ డకౌట్. టెస్టు క్రికెట్లో 14సార్లు డకౌట్లయిన విరాట్ ..టీ-20ల్లో నాలుగుసార్లు ఖాతా తెరువ కుండానే అవుటయ్యాడు.

5వ స్థానంలో విరాట్ ....

క్రికెట్ చరిత్రలో అత్యధిక డకౌట్ల రికార్డు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేరుతో ఉంది. జహీర్ 44 డకౌట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 40 డకౌట్లతో ఇషాన్ శర్మ రెండు, 37 డకౌట్లతో హర్భజన్ సింగ్ మూడు, 35 డకౌట్లతో అనీల్ కుంబ్లే నాలుగు స్థానాలలో ఉంటే...మాస్టర్ సచిన్, నయామాస్టర్ విరాట్ చెరో 34 డకౌట్లతో సంయుక్త 5వ స్థానంలో కొనసాగుతున్నారు.

సచిన్ తన కెరియర్ లో 200 టెస్టులు, 358కి పైగా వన్డేలతో సహా మొత్తం 360కి పైగా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 34 సార్లు మాత్రమే డకౌట్లు కావడం విశేషం. సచిన్ 200 టెస్టుల్లో 14 డకౌట్లు, వన్డేలలో 20 డకౌట్ల రికార్డుతో ఉన్నాడు. తన కెరియర్ లో ఆడిన ఒకే ఒక్క టీ-20 మ్యాచ్ లో 10 పరుగుల స్కోరు సాధించాడు.

35 సంవత్సరాల విరాట్ తన కెరియర్ లో 4వసారి వన్డే ప్రపంచకప్ ఆడుతూ...మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న 49 శతకాల రికార్డును అధిగమించాలని భావిస్తే...చివరకు 34 డకౌట్ల రికార్డును సమం చేయాల్సి వచ్చింది.

రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లతో జరుగనున్న చివరి మూడు రౌండ్ల మ్యాచ్ ల్లో విరాట్ ఒక్కశతకం బాదినా సచిన్ పేరుతో ఉన్న 49 సెంచరీల ప్రపంచ రికార్డును అధిగమించిన వాడవుతాడు. అదే మరోసారి డకౌట్ గా వెనుదిరిగినా సచిన్ పేరుతో ఉన్న 34 డకౌట్ల రికార్డును మించి మరో చెత్త రికార్డును మూట్టగట్టుకొనే ప్రమాదం సైతం లేకపోలేదు.

Tags:    
Advertisement

Similar News