శ్రీలంకతో టీ-20 సిరీస్ లో భారత్ 'టాప్ గేర్'!
ప్రపంచ చాంపియన్ భారత్ శ్రీలంక గడ్డపై మరో టీ-20 సిరీస్ సాధించింది. కెప్టెన్ గా సూర్యకుమార్ తనజట్టును మరో సిరీస్ లో విజేతగా నిలిపాడు.
ప్రపంచ చాంపియన్ భారత్ శ్రీలంక గడ్డపై మరో టీ-20 సిరీస్ సాధించింది. కెప్టెన్ గా సూర్యకుమార్ తనజట్టును మరో సిరీస్ లో విజేతగా నిలిపాడు.
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో నయాకోచ్ గౌతం గంభీర్, సరికొత్త కెప్టెన్ సూర్యకుమార్ ల నేతృత్వంలో తొలిసిరీస్ విజయంతో బోణీ కొట్టింది. శ్రీలంకతో జరుగుతున్న తీన్మార్ సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లోనే సిరీస్ విజయాన్ని ఖాయం చేసుకోగలిగింది.
శ్రీలంకకు దెబ్బ మీద దెబ్బ....
టీ-20 ఫార్మాట్లో 8వ ర్యాంకర్ గా ఉన్న శ్రీలంక తొలి పోరులో గట్టి పోటీ ఇచ్చినా..మిడిలార్డర్ వైఫల్యంతో రెండో టీ-20లో తేలిపోయింది. సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన ఈ పోరును సైతం పల్లెకెలీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగానే నిర్వహించారు.
టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఒక దశలో 2 వికెట్లకు 130 పరుగుల స్కోరుతో పటిష్టమైన స్థితిలో కనిపించినా..మిడిలార్డర్ కుప్పకూలడంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగుల స్కోరుకే పరిమితమయ్యింది.
కుశాల్ పెరెరా 34 బంతుల్లో 53 పరుగులు, పతుమ్ నిస్సంకా 24 బంతుల్లో 32, కమిందు మెండిస్ 23 బంతుల్లో 26 పరుగులు సాధించారు.
భారత బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
వానదెబ్బతో....
శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే పడిన వర్షంతో చాలాసేపు ఆట నిలిచిపోయింది. దీంతో డక్ వర్త్ లూయిస్ విధానం పాటించడం ద్వారా భారతలక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు.
ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 30, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్, హార్థిక్ పాండ్యా 9 బంతుల్లో 4 ఫోర్లు, ఓసిక్సర్ తో22 పరుగులు సాధించడంతో మరో 9 బంతులు మిగిలిఉండగానే భారత్ 7 వికెట్ల విజయంతో సిరీస్ ను 2-0తో ఖాయం చేసుకోగలిగింది.
భారత్ విజయంలో ప్రధాన పాత్ర వహించిన లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇదేజోరు కొనసాగిస్తాం- సూర్య...
టీ-20 ఫార్మాట్లో తమజట్టు ఇదే జోరు, దూకుడు కొనసాగిస్తుందని సిరీస్ విజయానంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించాడు. ప్రస్తుత సిరీస్ లోని తొలి టీ-20 ని 43 పరుగులతో గెలుచుకొన్న భారత్ రెండోమ్యాచ్ ను 7 వికెట్లతో సొంతం చేసుకోగలిగింది.
యశస్వీ జైశ్వాల్ 1000 పరుగుల రికార్డు...
భారతయువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ప్రస్తుత సిరీస్ రెండోమ్యాచ్ లో 30 పరుగులు సాధించడం ద్వారా..ప్రస్తుత ఏడాదిలో వెయ్యి పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఆడిన మ్యాచ్ ల ద్వారా 1000 పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు.
కేవలం 13 అంతర్జాతీయ మ్యాచ్ ల్లోనే యశస్వీ ఈ అరుదైన రికార్డు నెలకొల్పగలిగాడు.
యశస్వీ సాధించిన మొత్తం 1023 పరుగుల్లో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 94.54 స్ట్ర్రయిక్ రేటుతో 63.93 సగటుతో వెయ్యి పరుగుల మైలురాయిని చేరగలిగాడు.
శ్రీలంక ఆటగాడు కుశల్ మెండిస్ 26 మ్యాచ్ ల్లో 888 పరుగులతో రెండు, అఫ్ఘన్ బ్యాటర్ ఇబ్రహీం జడ్రాన్ 25 మ్యాచ్ ల్లో 844 పరుగులతో మూడు స్థానాలలో ఉన్నారు.
ప్రస్తుత ఏడాదిలో 6 టెస్టులు, 11 ఇన్నింగ్స్ ఆడిన యశస్వి 74.00 సగటుతో740 పరుగులు సాధించాడు. ఇందులో రెండు ద్విశతకాలు,3 అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 214 నాటౌట్ కావడం విశేషం.
7 టీ-20 మ్యాచ్ ల్లో 175. 77 స్ట్ర్రయిక్ రేటుతో 283 పరుగులు సాధించాడు. రెండు హాఫ్ సెంచరీలతో 47.16 సగటు నమోదు చేశాడు.