టెస్టులీగ్ లో పాక్ గడ్డపై పాక్ కు బంగ్లాదేశ్ షాక్!

పాక్ జట్టును పాక్ గడ్డపై ఓ టెస్టుమ్యాచ్ లో చిత్తు చేయాలన్న బంగ్లాదేశ్ చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది.సీనియర్ స్టార్ల ప్రతిభతో అరుదైన ఈ ఘనత సాధించగలిగింది.

Advertisement
Update:2024-08-26 11:47 IST

పాక్ జట్టును పాక్ గడ్డపై ఓ టెస్టుమ్యాచ్ లో చిత్తు చేయాలన్న బంగ్లాదేశ్ చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది.సీనియర్ స్టార్ల ప్రతిభతో అరుదైన ఈ ఘనత సాధించగలిగింది.

అంతర్యుద్ధ వాతావరణంలో అశాంతితో అల్లకల్లోలమైన బంగ్లాదేశ్ కు క్రికెట్ జట్టు ఉపశమనం కలిగించే విజయాన్ని సాధించింది. సాంప్రదాయ టెస్టు క్రికెట్లో పాకిస్థాన్ పై 14వ ప్రయత్నంలో విజేతగా నిలువగలిగింది.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా రావల్పిండి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు ఆఖరిరోజు ఆటలో బంగ్లాజట్టు 10 వికెట్లతో పాకిస్థాన్ ను కంగుతినిపించింది. రెండుమ్యాచ్ ల సిరీస్ లో 1-0తో పైచేయి సాధించింది.

బంగ్లా సీనియర్ స్టార్ల జోరుకు పాక్ బేజారు...

బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్లు ముష్ ఫికుర్ రహీం, స్పిన్ ఆల్ రౌండర్ల జోడీ షకీబుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ తమ అనుభవాన్నంతా ఉపయోగించి ఆడటం ద్వారా ఈ చరిత్రాత్మక విజయంలో ప్రధానపాత్ర పోషించారు.

స్లోబౌలర్ల స్వర్గంగా మారిన రావల్పిండి స్టేడియం పిచ్ పైన బంగ్లా బ్యాటర్లు, స్పిన్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 448 పరుగుల భారీస్కోరుతో డిక్లేర్ చేసిన పాక్ జట్టును రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా చరిత్ర సృష్టించారు.

తొలిఇన్నింగ్స్ లో మిడిలార్డర్ బ్యాటర్లు షకీల్ ( 141 ), మహ్మద్ రిజ్వాన్ ( 171 నాటౌట్ ) భారీస్కోర్లు సాధించినా ప్రయోజనం లేకపోయింది. పైగా..మరో వంద పరుగులైనా చేయకుండా డిక్లరేషన్ ప్రకటించిన పాక్ జట్టు చేజేతులా ఓటమి కొనితెచ్చుకొంది.

లేటు వయసులో ముష్ ఫికుర్ ఘాటైన శతకం..

పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 448 పరుగుల స్కోరుకు సమాధానంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 565 పరుగులతో 94 పరుగుల కీలక తొలిఇన్నింగ్స్ ఆధిక్యత సాధించగలిగింది.

మాజీ కెప్టెన్, సీనియర్ బ్యాటర్ ముష్ ఫికుర్ రహీం 191, ఓపెనర్ సద్మాన్ ఇస్లాం 93, మోమినుల్ 50, లిట్టన్ దాస్ 56, మెహిదీ హసన్ 77 పరుగులు సాధించారు.

37 సంవత్సరాల 104 రోజుల వయసులో టెస్టు శతకం సాధించిన బంగ్లా తొలి బ్యాటర్ గా ముష్ ఫికుర్ రికార్డు నెలకొల్పగలిగాడు.

షకీబుల్- మెహదీ స్పిన్ మ్యాజిక్...

94 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆతిథ్య పాక్ ను బంగ్లా స్పిన్ జోడీ షకీబుల్, మెహిదీ దెబ్బ మీద దెబ్బ కొడుతూ కేవలం 141 పరుగుల స్కోరుకే కుప్పకూల్చారు. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ( 51) మినహా మిగిలిన స్టార్ బ్యాటర్లంతా విఫలమయ్యారు.

మెహిదీ 21 పరుగులిచ్చి 4 వికెట్లు, షకీబుల్ 44 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు.

విజయానికి అవసరమైన 30 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా సాధించడం ద్వారా 10 వికెట్లతో అతిపెద్ద విజయం నమోదు చేయగలిగింది.

ఇప్పటి వరకూ పాక్ ప్రత్యర్థిగా 14 టెస్టులు ఆడిన బంగ్లాదేశ్ కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం.

సిరీస్ లోని కీలక ఆఖరి టెస్టు రావల్పిండి వేదికగానే ఆగస్టు 30 నుంచి జరుగనుంది.

Tags:    
Advertisement

Similar News