నాలుగో రోజు ఆస్ట్రేలియాదే పై చేయి
9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసిన ఆసీస్
బాక్సింగ్ డే టెస్టులో అన్నింటా ఆస్ట్రేలియా ఆదిపత్యం కొనసాగుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో వంద పరుగులకు పైగా భారీ ఆదిక్యం సాధించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లోనూ నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. నాలుగో రోజు (ఆదివారం) ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. భారత్ పై 333 పరుగుల ఆదిక్యంలో నిలిచింది. ఈ టెస్టు మ్యాచ్ లో ఐదో రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఆస్ట్రేలియా చివరి రోజు తన చివరి వికెట్ కోల్పోయే వరకు ఆడుతుందా.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి భారత్ ను బ్యాటింగ్ కు దించుతుందా తేలాల్సి ఉంది. ఆదివారం తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మరో 11 పరుగులు చేసి చివరి వికెట్ కోల్పోయింది. సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డి 114 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్ది సేపటికే మొదటి వికెట్ కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సామ్ కాన్ట్సాస్ ను బూమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లబుషేన్ 70 పరుగులు, ప్యాట్ కమిన్స్ 41 పరుగులు చేశారు. టెయిలెండర్లు నాథన్ లయన్ 41, స్కాట్ బోలాండ్ 10 పరుగులతో అజేయంగా క్రీజ్ లో ఉన్నారు. 91 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత మూడు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చివరి వికెట్ కు లయన్, బోలాండ్ అజేయంగా 55 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా నాలుగు, మహ్మద్ సిరాజ్ మూడు, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
చివరి రోజు టీమిండియా నిలబడితే గెలుపు
మెల్‌బోర్న్ టెస్ట్ లో చివరి రోజు సోమవారం టీమిండియా నిలబడితేనే గెలుపు సాధ్యమవుతుంది. ఓపెనర్లతో పాటు టాప్ ఆర్డర్ వికెట్లను ఆస్ట్రేలియా త్వరగా పడగొడితే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఆదిపత్యం దక్కడంతో పాటు టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మెల్‌బోర్న్ పిచ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో హయ్యెస్ట్ చేజింగ్ స్కోర్ 332 పరుగులు మాత్రమే.. ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట దగ్గరే ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసినా టీమిండియా 334 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసే ఆలోచనలో లేదు. సోమవారం ఉదయం వీలైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడి తమ స్కోర్ బోర్డుకు మరిన్ని పరుగులు జోడించాలనే యోచనలో ఉన్నారు. దీంతో భారత విజయలక్ష్యం మరింత పెరిగే అవకాశమే ఉంది. 1929లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసి విజయం సాధించింది. 1895లో ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసి గెలిచింది. 1953లో సౌత్ ఆఫ్రికా జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసి గెలిచింది. మెల్‌బోర్న్ పిచ్ పై హయ్యెస్ట్ చేజింగ్ స్కోర్లు ఇవి మాత్రమే. ఒకవేళ టీమిండియా నిలకడగా ఆడి ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మెల్‌బోర్న్ పిచ్ పై హయ్యెస్ట్ చేజింగ్ రికార్డును తన పేరుతో నమోదు చేసుకోవచ్చు.