మొహాలీ వన్డేలో భారత్ విజయలక్ష్యం 277 పరుగులు!

ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరుగుతున్న తీన్మార్ సిరీస్‌లోని తొలి వన్డేలో భారత్ ఎదుట ఆస్ట్రేలియా 277 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. రెండు జట్లు పలువురు ప్రధాన ఆటగాళ్లు లేకుండా పోటీకి దిగాయి...

Advertisement
Update:2023-09-22 19:42 IST

భారత్ వేదికగా అక్టోబర్‌లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్‌లోని తొలిపోరుకు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం ఆతిథ్యమిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, మ్యాజిక్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లేకుండా భారత్ బరిలో నిలిస్తే.. సూపర్ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్, మెరుపు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ లేకుండా ఆస్ట్రేలియా జట్టు పోటీకి దిగాయి.

బ్యాటింగ్‌కు స్వర్గధామమైన‌ మొహాలీ పిచ్‌పైన భారత స్టాప్ గ్యాప్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ముందుగా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోడంతో కంగారూ టీమ్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది.


మహ్మద్ షమీ 'పాంచ్ పటాకా'!

బ్యాటింగ్‌కు అనువుగా ఉన్న మొహాలీ పిచ్ పైన ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ మిషెల్ మార్ష్- డేవిడ్ వార్నర్ మొదటి వికెట్‌కు 4 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వెంటనే.. సూపర్ హిట్టర్ మార్ష్ వికెట్‌ను భారత్ పడగొట్టగలిగింది. ఆ తర్వాత ఓపెనర్ డేవిడ్ వార్నర్- వన్ డౌన్ స్టీవ్ స్మిత్ రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించిన అనంతరం భారత బౌలర్లు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. స్టీవ్ స్మిత్ 60 బంతుల్లో 41, వార్నర్ 53 బంతుల్లో 52 పరుగుల స్కోర్లకు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో వెనుదిరిగారు. మిడిలార్డర్ బ్యాటర్ లబుషేన్‌ను 39 పరుగుల స్కోరుకు వెటరన్ స్పిన్నర్ అశ్విన్ పడగొట్టగా.. ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ 31 పరుగులకు రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఇంగ్లిస్ మెరుపు బ్యాటింగ్...

ఒక దశలో 186 పరుగులకే 5 టాప్ ఆర్డర్ వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా జట్టును వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ తన మెరుపు ఇన్నింగ్‌తో ఆదుకొన్నాడు. కేవలం 45 బంతుల్లోనే 3 ఫోర్లు , 2 సిక్సర్లతో 45 పరుగులతో ఎదురుదాడికి దిగాడు. ఆల్ రౌండర్ స్టోయినిస్ 29, కెప్టెన్ పాట్ కమిన్స్ 21 పరుగులు సాధించడంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 276 పరుగులు సాధించగలిగింది.

భారత బౌలర్లలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన కోటా 10 ఓవర్లలో 51 పరుగులిచ్చి 5 వికెట్లు, బుమ్రా, అశ్విన్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. భారత్ మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 277 పరుగుల స్కోరు సాధించాల్సి ఉంది. భారత ఇన్నింగ్స్ ను శుభ్ మన్ గిల్- రుతురాజ్ గైక్వాడ్ ల జోడీ ప్రారంభించారు. 


Tags:    
Advertisement

Similar News