టెస్టు చరిత్రలో మరో 1 పరుగువిజయం!

సాంప్రదాయ టెస్టు క్రికెట్ 14 దశాబ్దాల చరిత్రలో మరో అపూర్వ ఘట్టం వెల్లింగ్టన్ బేసిన్ రిజర్వ్ పార్క్ వేదికగా చోటు చేసుకొంది. ఉత్కంఠభరితపోరులో న్యూజిలాండ్ ఒక్క పరుగుతేడాతో ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధించింది.

Advertisement
Update:2023-02-28 12:14 IST

సాంప్రదాయ టెస్టు క్రికెట్ 14 దశాబ్దాల చరిత్రలో మరో అపూర్వ ఘట్టం వెల్లింగ్టన్ బేసిన్ రిజర్వ్ పార్క్ వేదికగా చోటు చేసుకొంది. ఉత్కంఠభరితపోరులో న్యూజిలాండ్ ఒక్క పరుగుతేడాతో ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధించింది....

ఐదురోజులపాటు నాలుగు ఇన్నింగ్స్ గా సాగే సాంప్రదాయ టెస్టు క్రికెట్ మ్యాచ్ లు సైతం పట్టుగా సాగుతున్నాయి. టీ-20 లను తలపించే రీతిలో ఆఖరి పరుగు వరకూ సస్పెన్స్ థ్రిల్లర్లా సాగుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

వెలింగ్టన్ లో థ్రిల్లింగ్ మ్యాచ్....

న్యూజిలాండ్ విజయాల అడ్డా వెలింగ్టన్ బేసిన్ రిజర్వ్ పార్క్ వేదికగా గత ఐదురోజులుగా సాగిన కీలక రెండోటెస్టుమ్యాచ్ చరిత్రలో నిలిచిపోయేలా జరిగింది. ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టును ఇంగ్లండ్ 267 పరుగుల భారీఆధిక్యంతో నెగ్గి 1-0తో పైచేయి సాధించింది.

అయితే..న్యూజిలాండ్ కు ఓటమి అన్నదే లేని వెలింగ్టన్ బేసిన్ రిజర్వ్ పార్క్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఆఖరి ( రెండవ) టెస్టుమ్యాచ్ లో ఆతిథ్యజట్టు ఫాలోఆన్ ఆడుతూ..ఇంగ్లండ్ పై ఒక్క పరుగు తేడాతో అత్యంత అరుదైన, అసాధారణ విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేయగలిగింది.

కేన్ విలియమ్స్ సన్ షో.......

సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ టెస్టుమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 435 పరుగుల స్కోరుతో డిక్లేర్ చేసింది.

సమాధానంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 209 పరుగులకే కుప్పకూలింది.

దీంతో భారీ తొలిఇన్నింగ్స్ లోటుతో ఫాలో ఆన్ లో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్స్ సన్ ఫైటింగ్ సెంచరీతో ఊపిరిపోశాడు.

కేన్ 132 పరుగులు చేయటంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 483 పరుగుల భారీస్కోరు సాధించడం ద్వారా ప్రత్యర్థి ఇంగ్లండ్ ఎదుట 258 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది.

ఫాస్ట్ బౌలర్లు నీల్ వాగ్నర్, టిమ్ సౌథీ నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఇంగ్లండ్ ను 256 పరుగులకే కుప్పకూల్చారు.మాజీ కెప్టెన్ జో రూట్ 95 పరుగులు సాధించినా ఇంగ్లండ్ పుంజుకోలేకపోయింది. వాగ్నర్ 62 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం ద్వారా న్యూజిలాండ్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు.

టెయిల్ ఎండర్ జేమ్స్ యాండర్సన్ ను వాగ్నర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ టామ్ బ్లుండెల్ క్యాచ్ అవుట్ ద్వారా పడగొట్టడంతో ఇంగ్లండ్ ఒక్క పరుగు తేడాతో పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

టెస్టు చరిత్రలో రెండో ఒక్క పరుగు గెలుపు...

టెస్టు క్రికెట్ 14 దశాబ్దాల చరిత్రలో కొన్ని వందల మ్యాచ్ లు జరిగినా..ఒక్క పరుగు తేడాతో కేవలం రెండంటే రెండుమ్యాచ్ లు మాత్రమే ముగిశాయి. 1993 సిరీస్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ లో ఆస్ట్ర్రేలియాపై వెస్టిండీస్ ఒక్క పరుగు విజయం నమోదు చేసింది.

ఆ తర్వాత మరో ఒక్క పరుగు విజయం కోసం 2023 వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

అంతేకాదు..ఫాలోఆన్ ఆడుతూ టెస్ట్ మ్యాచ్ నెగ్గిన మూడో జట్టుగా న్యూజిలాండ్ రికార్డుల్లో చేరింది. గతంలో ఫాలోఆన్ ఆడుతూ ఇంగ్లండ్ రెండుసార్లు, భారత్ ఓసారి విజేతలుగా నిలిచాయి.

1894, 1981 సిరీస్ మ్యాచ్ ల్లో ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ఫాలోఆన్ ఆడుతూ ఇంగ్లండ్ విజయాలు నమోదు చేసింది. ఆ తర్వాత 2001 టెస్టు సిరీస్ లో ఆస్ట్ర్రేలియాపైన భారత్ సైతం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫాలోఆన్ ఆడుతూ సంచలన విజయం సాధించగలిగింది.

ఇప్పుడు ఇంగ్లండ్, భారతజట్ల సరసన న్యూజిలాండ్ సైతం నిలువగలిగింది.

Tags:    
Advertisement

Similar News