ఆసియా క్రీడల్లో మరో గోల్డ్.. క్రికెట్‌లో విజేతగా నిలిచిన మహిళా జట్టు
చైనాలోని హాంగ్‌జౌలో నిర్వహిస్తున్న ఆసియా గేమ్స్‌లో భాగంగా పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్‌లో ఇండియా-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.
ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. సోమవారం రోజు రెండో పతకం భారత ఖాతాలోకి చేరింది. ఉదయం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంగా భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. తాజాగా భారత క్రికెట్ జట్టు ఫైనల్‌లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సాధించింది. చైనాలోని హాంగ్‌జౌలో నిర్వహిస్తున్న ఆసియా గేమ్స్‌లో భాగంగా పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్‌లో ఇండియా-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.
టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతీ మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్ (42) రాణించడంతో భారత జట్టు చెప్పుకోదగిన స్కోర్ సాధించింది. ఒకానొక దశలో భారత జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అంచనా వేసినా.. స్మృతీ మంధాన ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్లు వరుసగా వికెట్లు పారేసుకున్నారు. షఫాలీ వర్మ (9), రిచా ఘోష్ (9), హర్మన్ ప్రీత్ కౌర్ (2), పూజా వస్త్రాకర్ (2)లు విఫలమయ్యారు. చివర్లో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత జట్టు 20 ఓవర్లలలో 7 వికెట్ల కోల్పోయి 116 పరుగులు చేసింది.
117 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన శ్రీలంక మొదట్లోనే కీలకమైన వికెట్లు కోల్పోయింది. భారత పేసర్ టిటాస్ సాధు తన అద్బుతమైన బౌలింగ్‌తో చమరి ఆటపట్టు (12), అనుష్క సంజీవిని (1), విష్మి గుణరత్నే (0)లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చింది. ఆ తర్వాత హాసిని పెరీరా (25), నీలాక్షి డిసిల్వా (23), ఓషది రణసింగ్ (19) శ్రీలంక జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్లు చివర్లో వరుసగా వికెట్లు తీశారు. దీంతో ఒత్తిడి పెరిగి శ్రీలంక బ్యాటర్లు పరుగులు చేయలేక పోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 97 పరుగులే చేసింది. దీంతో భారత జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించి.. స్వర్ణ పతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నది.
స్కోర్ బోర్డు :
ఇండియా మహిళలు :
20 ఓవర్లలో 116/7 (స్మృతీ మంధాన 46, జెమీమా రోడ్రిగ్స్ 46)
శ్రీలంక మహిళలు :
20 ఓవర్లలో 98/8 (హాసిని పెరీరా 25, నీలాక్షి డిసిల్వా 23)