భారత చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్?
భారత క్రికెట్లో అత్యంత కీలకమైన చీఫ్ సెలెక్టర్ పదవిని మాజీ ఆల్ రౌండర్, క్రికెట్ వ్యాఖ్యాత అజిత్ అగార్కర్ త్వరలో చేపట్టనున్నాడు.
భారత క్రికెట్లో అత్యంత కీలకమైన చీఫ్ సెలెక్టర్ పదవిని మాజీ ఆల్ రౌండర్, క్రికెట్ వ్యాఖ్యాత అజిత్ అగార్కర్ త్వరలో చేపట్టనున్నాడు.
భారత క్రికెట్ సీనియర్ సెలెక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న చీఫ్ సెలెక్టర్ పోస్టును ముంబైకి చెందిన అజిత్ అగార్కర్ మరికొద్దిరోజుల్లో భర్తీ చేయనున్నాడు. 45 సంవత్సరాల ఈ మాజీ ఆల్ రౌండర్ తర్జనభర్జనల అనంతరం ముళ్లకిరీటం లాంటి ఈ చీఫ్ సెలెక్టర్ పోస్టుకు తన దరఖాస్తును పంపాడు. అగర్కార్ ఎంపిక కేవలం లాంఛనం మాత్రమేనని, త్వరలోనే బాధ్యతలు స్వీకరించడం ఖాయమని బోర్డు వర్గాలు అంటున్నాయి.
ఏడాదికి కోటి రూపాయల వేతనంతో....
దేశంలోని 30కి పైగా క్రికెట్ సంఘాలు అనుబంధంగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణమండలి సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి అంటే..ముళ్లకిరీటమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
భారతజట్ల ఎంపికలో ఏమాత్రం పొరపాట్లు జరిగినా క్రికెట్ వ్యాఖ్యాతలు, విశ్లేషకులు, విమర్శకులతో పాటు దేశంలోని కోట్లాదిమంది అభిమానులు సెలెక్టర్లు, సెలెక్షన్ కమిటీపైన విమర్శల వర్షం కురిపించడం సాధారణ విషయమే. జట్టులో చోటు దక్కని కొందరు క్రికెటర్లు సైతం బాహాటంగా తమ అక్కసును వెళ్లగక్కడం కూడా తెలిసినదే.
అలాంటి గురుతరమైన బాధ్యతను గతంలో విజయ్ మర్చెంట్, లాలాఅమర్ నాథ్, రాజ్ సింగ్ దుంగర్ పూర్, గుండప్ప విశ్వనాథ్, దిలీప్ వెంగ్ సర్కార్, జైసింహా లాంటి ఎందరో దిగ్గజాలు విజయవంతంగా నిర్వర్తించారు.
ఆదాయం తక్కువ- బాధ్యతలు ఎక్కువ..
దేశంలోని మొత్తం ఐదుజోన్లకు ప్రాతినిథ్యం వహించే విధంగా జాతీయ క్రికెట్ ఎంపిక సంఘం ఏర్పాటు ఉంటుంది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్ ల నుంచి ఒక్కో సెలెక్టరును ఎంపిక చేస్తారు. వీరిలో సీనియర్ కు మాత్రమే చీఫ్ సెలెక్టర్ లేదా ఎంపిక సంఘం చైర్మన్ బాధ్యతలు అప్పజెపుతారు.
ఒక్కో సెలెక్టర్ కు ఏడాదికి 90 లక్షల రూపాయలు, చీఫ్ సెలెక్టర్ కు కోటి రూపాయలు వేతనంగా బీసీసీఐ చెల్లిస్తూ వస్తోంది. తమ జోన్ పరిథిలో జరిగే దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లను విధిగా చూడటం ద్వారా ఆయా జోన్లకు ప్రాతినిథ్యం వహించే సెలెక్టర్ ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి బీసీసీఐ దృష్టికి తీసుకువెళుతూ ఉంటారు.
గత కొద్దిమాసాలుగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ లేకుండానే నెట్టుకువస్తోంది. గతంలో చీఫ్ సెలెక్టర్ గా పనిచేసిన చేతన్ శర్మ వివాదాస్పద రీతిలో తన పదవికి రాజీనామా చేయటంతో...ఈస్ట్ జోన్ కు చెందిన శివసుందర్ దాస్..తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
త్వరలో జరిగే ప్రపంచకప్ కు 16 మంది సభ్యుల భారతజట్టు ఎంపిక కీలకం కానుండడంతో చీఫ్ సెలెక్టర్ ను నియమించడం కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.
ఆల్ రౌండ్ అనుభవంతో అగార్కర్...
భారతజట్టుకు టెస్టులు, వన్డేలలో నమ్మదగిన ఆల్ రౌండర్ గా సేవలు అందించిన 45 సంవత్సరాల అజిత్ అగార్కర్ కు క్రికెట్ వ్యాఖ్యాతగా కూడా చక్కటి పేరుంది.
అగార్కర్ భారత్ తరపున 26 టెస్టులు, 191 వన్డేలు ఆడటం ద్వారా చీఫ్ సెలెక్టర్ పదవికి అర్హత సంపాదించాడు.
ప్రస్తుత ఎంపిక సంఘంలో శివసుందర్ దాస్ ఈస్ట్ జోన్ కు, సలీల్ అంకోలా వెస్ట్ జోన్ కు, శరత్ సౌత్ జోన్ కు, సుబ్రతో బెనర్జీ సెంట్రల్ జోన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ పదవి కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించడం తో అజిత్ అగార్కర్ ఒక్కడే స్పందించారు. తన దరఖాస్తును బోర్డుకు పంపారు.
సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా అగార్కర్ నియామకం కేవలం లాంఛనం మాత్రమేనని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు సహాయ శిక్షకుడుగా ఉంటూ వచ్చిన అజిత్ అగార్కర్ తన పదవికి రాజీనామా చేసినట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రకటించింది.
2017 నుంచి 2019 వరకూ ముంబై క్రికెట్ సంఘం సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం అగార్కర్ కు ఉంది.