వరుసగా నాలుగు సెంచరీలు... అగ్ని చోప్రా ప్రపంచ రికార్డు!
బాలీవుడ్ విఖ్యాత దర్శకుడు విదు వినోద్ చోప్రా తనయుడు అగ్నిచోప్రా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
బాలీవుడ్ విఖ్యాత దర్శకుడు విదు వినోద్ చోప్రా తనయుడు అగ్నిచోప్రా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత దేశవాళీ క్రికెట్ రంజీట్రోఫీ ప్లేటు గ్రూపు నాలుగు వరుస మ్యాచ్ ల్లో సెంచరీలు బాదడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
మిజోరం జట్టు సభ్యుడిగా అరంగేట్రం...
అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో జన్మించి భారత దేశవాళీ క్రికెట్లో మిజోరం జట్టుకు ఆడుతున్న అగ్నిచోప్రా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ల్లో సెంచరీల జోరు, పరుగుల హోరు కొనసాగిస్తున్నాడు.
2023-24 సీజన్ రంజీట్రోఫీలో మిజోరం జట్టు సభ్యుడిగా అరంగేట్రం చేసిన అగ్నిచోప్రా తన తొలిమ్యాచ్ లోనే 258 పరుగులు సాధించడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు.
రంజీట్రోఫీ ప్లేటు గ్రూప్ లీగ్ లో భాగంగా జనవరి 5 నుంచి 8 వరకూ నడియాడ్ వేదికగా సిక్కింతో జరిగిన తొలిపోటీ ద్వారా అగ్నిచోప్రా తన రంజీ కెరియర్ మొదలు పెట్టాడు.
25 సంవత్సరాల అగ్ని చోప్రా 179 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు, 7 సిక్సర్లతో 166 పరుగులతో సూపర్ సెంచరీ సాధించాడు. భారత దేశవాళీ క్రికెట్లో తన తొలిశతకాన్ని మిజోరం తరపున నమోదు చేయగలిగాడు.
మిజోరం జట్టులోని మరో ఆరుగురు బ్యాటర్లు డకౌట్లు కాగా..ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగలిగారు. అగ్ని చోప్రా మాత్రమే ఒంటరిపోరాటం చేసి కళ్లు చెదిరే సెంచరీ సాధించగలిగాడు. ఫాలోఆన్ ఆడిన తమజట్టు రెండో ఇన్నింగ్స్ లో సైతం అగ్ని 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అంతేకాదు...ఆ తర్వాత జరిగిన మ్యాచ్ ల్లో సైతం తన జోరు కొనసాగించాడు.
8 ఇన్నింగ్స్ లో 767 పరుగులు.....
ద్వితీయశ్రేణిజట్లతో కూడిన రంజీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్ ల్లో అగ్ని చెలరేగిపోయాడు. సిక్కింపై 92 బంతుల్లో 166 పరుగులు, నాగాలాండ్ పై 150 బంతుల్లో 166 పరుగులు,
అరుణాచల్ ప్రదేశ్ పై 114 పరుగులు, మేఘాలయ పై 101 బంతుల్లో 105 పరుగులు సాధించాడు.
మేఘాలయతో ఆడిన మ్యాచ్ అగ్ని కెరియర్ లో కేవలం 4వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే కావడం విశేషం. నాలుగుకు నాలుగు మ్యాచ్ ల్లోనూ శతకాలు బాదడం ద్వారా..రంజీ చరిత్రలోనే కాదు..ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనూ వరుసగా నాలుగు శతకాలు బాదిన తొలి బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
మేఘాలయ పైన మిజోరం 359 పరుగుల స్కోరు సాధించడంలో అగ్ని ప్రధానపాత్ర పోషించాడు. కేవలం 90 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 105 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు.
నాగాలాండ్ తో తొలి ఇన్నింగ్స్ లో 164, రెండో ఇన్నింగ్స్ లో 15 పరుగులు, అరుణాచల్ పైన 114 పరుగులు సాధించాడు. మొత్తం నాలుగుమ్యాచ్ లు, 8 ఇన్నింగ్స్ లో 767 పరుగులు సాధించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ గా, భారీషాట్లు నిలకడగా ఆడే సత్తా అగ్నిలో పుష్కలంగా ఉంది.
లిస్ట్ - ఏ మ్యాచ్ ల్లో సైతం రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
జమ్ము-కాశ్మీర్ జట్టుతో జరిగిన టీ-20 మ్యాచ్ లో అగ్నిచోప్రా 76 పరుగుల స్కోరు సాధించడం ద్వారా సత్తా చాటుకొన్నాడు. మొత్తం మీద తన అరంగేట్రం సీజన్ మొదటి నాలుగుమ్యాచ్ ల్లోనే నాలుగు సెంచరీలు బాదడం ద్వారా దేశవాళీ క్రికెట్లో అగ్ని సరికొత్త సంచలనంగా మారాడు.