భారత కెప్టెన్ ను ఊరిస్తున్న 5 రికార్డులు!

2023 ఆసియాకప్ వన్డే క్రికెట్ టోర్నీలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఐదు రికార్డులు ఊరిస్తున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ప్రారంభమ్యాచ్ ద్వారా రోహిత్ తన రికార్డుల వేటను ప్రారంభించనున్నాడు.

Advertisement
Update:2023-09-02 10:45 IST

2023 ఆసియాకప్ వన్డే క్రికెట్ టోర్నీలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఐదు రికార్డులు ఊరిస్తున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ప్రారంభమ్యాచ్ ద్వారా రోహిత్ తన రికార్డుల వేటను ప్రారంభించనున్నాడు...

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2023 ఆసియాకప్ వన్డే టోర్నీ..భారతజట్టుతో పాటు..కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం సవాలుగా నిలిచింది.

రోహిత్ నాయకత్వంలోని భారతజట్టులో విరాట్ కొహ్లీ, హార్థిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ, కుల్దీప్ లాంటి ప్రపంచ మేటి ఆటగాళ్లున్నారు.

ఒకటికాదు..రెండుకాదు..ఏకంగా ఐదు...

ఇప్పటికే వైట్ బాల్ ( వన్డే, టీ-20 ) ఫార్మాట్లలో ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పిన భారత డాషింగ్ ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మను ఒకటి కాదు, రెండు కాదు...ఏకంగా ఐదు సరికొత్త రికార్డులు ఊరిస్తున్నాయి.

2018 ఆసియాకప్ వన్డే టోర్నీలో రోహిత్ నాయకత్వంలోనే భారత్ ఆసియాకప్ విజేతగా నిలిచింది. తన ఆసియాకప్ కెరియర్ లో ఇప్పటి వరకూ 22 మ్యాచ్ లు ఆడి 745 పరుగులు సాధించిన రోహిత్ ప్రస్తుత ఆసియాకప్ మొత్తం ఆరుమ్యాచ్ ల్లో మరో 227 పరుగులు సాధించగలిగితే...మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న 971 పరుగుల రికార్డును అధిగమించగలుగుతాడు.

ప్రస్తుతం ఆసియాకప్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల వరుసలో రోహిత్ మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

కెప్టెన్ గా రెండో ఆసియా వన్డే కప్ కు గురి..

కెప్టెన్ గా భారత్ ను రెండుమార్లు ఆసియాకప్ విజేతగా నిలిపిన ఘనత మహ్మద్ అజరుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీల పేరుతో ఉంది. ఇప్పటికే 2018 ఆసియాకప్ ను భారత్ కు కెప్టెన్ గా అందించిన రోహిత్..ప్రస్తుత 2023 ఆసియాకప్ ను సైతం సాధించగలిగితే...అజర్, ధోనీల సరసన నిలువగలుగుతాడు.

31వ వన్డే శతకానికి తహతహ...

వన్డే ఫార్మాట్లో 30 శతకాలు బాదిన ఇద్దరు బ్యాటర్లలో ఒకడిగా ఉన్న రోహిత్ శర్మ..ప్రస్తుత ఆసియాకప్ లో కనీసం ఒక్క సెంచరీ సాధించినా..ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను అధిగమించగలుగుతాడు. వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన మొదటి ఇద్దరు బ్యాటర్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, కింగ్ విరాట్ కొహ్లీ..మొదటి రెండుస్థానాలలో ఉంటే..రోహిత్, పాంటింగ్ మూడోస్థానంలో సంయుక్తంగా కొనసాగుతున్నారు.

ఇప్పటి వరకూ ఆడిన మొత్తం 244 వన్డేలలో రోహిత్ 30 సెంచరీలు నమోదు చేశాడు. మూడు డబుల్ సెంచరీలు సైతం రోహిత్ పేరుతో ఉన్నాయి.

10వేల పరుగుల రికార్డుకు 163 పరుగుల దూరంలో...

వన్డే ఫార్మాట్లో 10వేల పరుగులు సాధించిన భారత ఆరవ బ్యాటర్ ఘనత సైతం రోహిత్ కోసం ఎదురుచూస్తోంది. రోహిత్ 244 మ్యాచ్ ల్లో 9వేల 837 పరుగులు సాధించడం ద్వారా అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల వరుస 15వ స్థానంలో కొనసాగుతున్నాడు.

భారత క్రికెటర్లలో 10వేల వన్డే పరుగులు సాధించిన దిగ్గజాలలో సచిన్, విరాట్, ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే ఉన్నారు.

అత్యధిక ఆసియాకప్ మ్యాచ్ ల రికార్డు...

అత్యధిక ఆసియాకప్ మ్యాచ్ లు ఆడిన శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే రికార్డును రోహిత్ సమం చేసే అవకాశం ఉంది. మహేల తన కెరియర్ లో మొత్తం 28 ఆసియాకప్ మ్యాచ్ లు ఆడటం ద్వారా...అత్యధిక ఆసియాకప్ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ మాత్రం 22 మ్యాచ్ లతో ఉన్నాడు.

ప్రస్తుత ఆసియాకప్ లో భారత్ లీగ్ దశ రెండు, సూపర్ -4 దశలో మూడుమ్యాచ్ లతో పాటు ఫైనల్స్ కు అర్హత సాధించే పక్షంలో..రోహిత్ మొత్తం 6 మ్యాచ్ లు ఆడటం ద్వారా..మహేల జయవర్థనే పేరుతో ఉన్న 28 మ్యాచ్ ల రికార్డును సమం చేయటం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ తరపున అత్యధికంగా 23 ఆసియాకప్ మ్యాచ్ లు ఆడిన రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉంది.

సచిన్ 23 మ్యాచ్ ల రికార్డును అధిగమించడం రోహిత్ కు ఖాయమే అయినా.. భారతజట్టు ఫైనల్స్ కు చేరుకోగలిగితేనే 28 మ్యాచ్ ల రికార్డును సమం చేయగలుగుతాడు.

భారతజట్టు ప్రస్తుత ఆసియాకప్ లీగ్ గ్రూపు- ఏలో భాగంగా సెప్టెంబర్ 2న పాకిస్థాన్, 4న నేపాల్ జట్లతో తొలిదశ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. సూపర్- 4 రౌండ్లో..పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అప్ఘనిస్థాన్ ల్లో మూడుజట్లతో పోటీపడనుంది.

సూపర్ -4 రౌండ్ మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్లకు మాత్రమే సెప్టెంబర్ 17న జరిగే టైటిల్ సమరంలో తలపడే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News