ముంబయి ఇండియన్స్ తోనే హిట్ మ్యాన్
కెప్టెన్ లను వదలుకున్న ఢిల్లీ, లక్నో, కోల్ కతా ఐపీఎల్ టీమ్ లు
ఐపీఎల్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ జట్టులోనే కొనసాగుతారో.. మరో టీమ్ కు షిఫ్ట్ అవుతారా అనే ఉత్కంఠకు తెరపడింది. గడిచిన సీజన్ లో రోహిత్ ను ముంబయి ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ నుంచి తప్పించి హార్థిక్ పాండ్యాను తెచ్చి కెప్టెన్ ను చేసింది. దీంతో ముంబయి టీమ్ ఐపీఎల్ లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. రోహిత్ శర్మ ముంబయిని వీడి ఇంకో టీమ్ తో జత కట్టడం ఖాయమని కూడా ప్రచారం జరిగింది. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ హిట్ మ్యాన్ ను తమ టీమ్ లోనే అట్టిపెట్టుకుంది. మరో వారం, పది రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ఐపీఎల్ టీమ్ లు తమ రిటెన్షన్ లిస్ట్ ను గురువారం విడుదల చేశాయి. ఐపీఎల్ గత సీజన్ లో కోల్ కతాను విజేతగా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను నైట్ రైడర్స్ వదులుకుంది. అందరూ ఊహించినట్టుగానే కేఎల్ రాహుల్ ను లక్నో వదులుకుంది. తమ జట్టు కెప్టెన్ రిషన్ పంత్ ను ఢిల్లీ పక్కన పెట్టేసింది. వీళ్లంతా ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొని తమ అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. బెంగళూరు టీమ్ మేనేజ్‌మెంట్ ఏకంగా ముగ్గురు ప్రముఖ క్రికెటర్లను పక్కన పెట్టేసింది. మ్యాక్స్‌వెల్, కామెరున్ గ్రీన్ తో పాటు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ను ఆర్సీబీ వదులుకుంది. రిటెన్షన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ రూ.23 కోట్లతో అత్యధిక మొత్తం తీసుకోనున్నాడు. విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ రూ.21 కోట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. కింగ్స్ లెవన్ పంజాబ్ టీమ్ ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకోగా మిగతా టీమ్ మొత్తం కొత్తగా తీసుకోనుంది.
ముంబయి ఇండియన్స్ జట్టు జస్ప్రీత్ బూమ్రా (రూ.18 కోట్లు), రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు), హార్థిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు) ను తమ జట్టుతో పాటే కొనసాగించనుంది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఆ జట్టు రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), పతిరన (రూ.13 కోట్లు), శివమ్ దుబె (రూ.12 కోట్లు)ను రిటైన్ చేసుకుంది. బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (రూ.18 కోట్లు), రజత్ పటిదార్ (రూ.11 కోట్లు), యశ్ దయాల్ (రూ.5 కోట్లు) రిటైన్ చేసుకుంది. హైదరాబాద్ జట్టు క్లాసెన్ తో పాటు ప్యాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి (రూ.6 కోట్లు) రిటైన్ చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ (సంజు శాంసన్ (రూ.18 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు), రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు), ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు), హిట్‌మెయిర్ రూ.11 కోట్లు), సందీప్ శర్మ (రూ.4 కోట్లు)ను రిటైన్ చేసుకుంది. ఢిల్లీ జట్టు అక్షర్ పటేల్ (రూ.16.50 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు), స్టబ్స్ (రూ.10 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ.4 కోట్లు) రిటైన్ చేసుకుంది. కోల్ కతా టీమ్ రింకూ సింగ్ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), సునీల్ నరైన్ (రూ.12 కోట్లు), ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు), హర్షిత్ రాణా (రూ.4 కోట్లు), రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు) రిటైన్ చేసుకుంది. గుజరాత్ జట్టు రషీద్ ఖాన్ (రూ.18 కోట్లు), శుభ్‌మన్ గిల్ (రూ.16.5 కోట్లు), సాయి సుదర్శన్ (రూ.8.5 కోట్లు), రాహుల్ తెవాటియా (రూ.4 కోట్లు), షారూక్ ఖాన్ (రూ.4 కోట్లు) రిటైన్ చేసుకుంది. లక్నో టీమ్ నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోనీ (రూ.కోట్లు)ని రిటైన్ చేసుకుంది. పంజాబ్ టీమ్ శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు), ప్రభుసిమ్రాన్ సింగ్ (రూ.4 కోట్లు) ను రిటైన్ చేసుకుంది.
వేలంలో క్రికెటర్లను దక్కించుకోవడానికి పంజాబ్ కింగ్స్ లెవన్ టీమ్ దగ్గర అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. చెన్నై దగ్గర రూ.55 కోట్లు, ముంబయి టీమ్ వద్ద రూ.45 కోట్లు, ఢిల్లీ దగ్గర రూ.76.25 కోట్లు, కోల్ కతా దగ్గర రూ.63 కోట్లు, బెంగళూరు టీమ్ వద్ద రూ.83 కోట్లు, లక్నో టీమ్ దగ్గర రూ.69 కోట్లు, హైదరాబాద్ దగ్గర రూ.45 కోట్లు, రాజస్థాన్ దగ్గర రూ.41 కోట్లు, గుజరాత్ దగ్గర రూ.69 కోట్లు నిల్వ ఉన్నాయి. నవంబర్ రెండో, లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నారు.