మా వాటా మాకివ్వండి...కేంద్రం పై కోటి లేఖల యుద్దం
కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూ రావాల్సిన నిధులను కూడా విడుదల చేయడం లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేక సార్లు కేంద్రానికి లేఖలు కూడా రాశారు. ఇప్పుడు బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే బాటలో నడవనుంది.
బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్ర బీజేపీ సర్కార్ వివక్షకు గురిచేస్తున్నదనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై భారత రాష్ట్ర సమితి పెద్ద యుద్దమే చేస్తున్నది. కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూ రావాల్సిన నిధులను కూడా విడుదల చేయడం లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేక సార్లు కేంద్రానికి లేఖలు కూడా రాశారు. ఇప్పుడు బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అదే బాటలో నడవనుంది. తమ వాటాగా రావాల్సిన నిధులనుకేంద్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ వినూత్న రీతిలో నిరసన మొదలుపెట్టింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA )పథకం కింద బెంగాల్‌కు రావాల్సిన నిధుల విడుదల కోసం తృణమూల్ కాంగ్రెస్ కోటి లేఖల కార్యక్రమాన్ని చేపట్టింది.
‘‘మా వాటా నిధులను మాకివ్వండి అని డిమాండ్ చేస్తూ కోటి మంది బెంగాల్ ప్రజలు రాసే కోటి లేఖలు ప్రధానికి పంపుతాం. ఈ లేఖలన్నింటిని స్వయంగా మేమే తీసుకెళ్తాం. ఈ లేఖలు రాకుండా కేంద్రం ఎలా అడ్డుకుంటుందో చూస్తాం. " అని పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రకటించారు.
ఈ లేఖలను తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బూత్ స్థాయి నాయకులు సేకరిస్తారు. MGNREGA కింద పనులు చేసి కూడా డబ్బులు రాని లబ్ధిదారులతో కలిసి ఢిల్లీకి తీసుకువెళతామని అభిషేక్ బెనర్జీ చెప్పారు.
ఇటీవల, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బెంగాల్‌కు పెండింగ్ బకాయిలు కేంద్రం విడుదల చేయాలని కోల్‌కతాలో రెండు రోజుల పాటు ధర్నాచేశారు.
"బెంగాలీ నూతన సంవత్సరం పొయిలా బోయిసాఖ్ నుండి, మేము ప్రతి బూత్‌లో ఈ ఆందోళనను చేపడతాము. ఒక నెల పాటు సంతకాలు సేకరిస్తాం. ఒక నెల తర్వాత, 50,000 మంది లబ్దిదారులతో, ఒక కోటి లేఖలతో మేము ఢిల్లీకి వెళ్తాము. పీఎంఓకి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయానికి కోటి లేఖలు అందజేస్తాం. ధైర్యం ఉంటే మమ్మల్ని అడ్డుకోండి’’ అని అభిషేక్ బెనర్జీ సవాల్ విసిరారు.
MGNREGA నిధుల విడుదల కై అభిషేక్ బెనర్జీ ఇటీవల తృణమూల్ ఎంపీల ప్రతినిధి బృందంతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలవడానికి ఢిల్లీ వెళ్ళారు. కానీ ప్రతినిధి బృందం మంత్రిని కలవలేకపోయింది. ‘‘మూడు రోజుల క్రితం 25 మంది ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ను కలిసేందుకు ప్రయత్నించాము. ఆయన ఢిల్లీలో ఉన్నా మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. అందుకు కారణం గిరిరాజ్. సింగ్‌కు మమ్మల్ని కలిసే దమ్ము లేదు. కేంద్ర మంత్రి దగ్గర మా ప్రశ్నలకు సమాధానం లేదు. అందుకే మమ్మల్ని కలవకుండా తప్పించుకున్నారు” అని బెనర్జీ ఆరోపించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడం వల్లే తమ రాష్ట్రానికి కేంద్ర బీజేపీ సర్కార్ నిధులు నిలిపివేసిందని బెనర్జీ ఆరోపించారు.