ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశాన్నీ స్పశించేలా బడ్జెట్
పెట్టుబడులు, రుణాలు, కొత్త వంగడాల సృష్టి.. ఇలా అనేక రకాలుగా రైతులకు మద్దతిస్తున్నామన్న కేంద్ర మంత్రి
వ్యవసాయ రంగానికి అన్నిరకాలుగా అండగా ఉన్నామని.. విత్తనం నుంచి మార్కెట్ వరకు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులు, రుణాలు, కొత్త వంగడాల సృష్టి.. ఇలా అనేక రకాలుగా రైతులకు మద్దతిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపరిచాం. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశాన్నీ స్పశించేలా బడ్జెట్ రూపొందించాం. ఖర్చు చేసే ప్రతి రూపాయి విషయంలో అత్యంత వివేకంతో వ్యవహరించామని అన్నారు.
బడ్జెట్లో ఆదాయ పన్ను శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో రూ.8 లక్షల ఆదాయం ఉన్నవారు ఇప్పటివరకు రూ. 30 వేలు పన్ను కట్టేవారు. ఇకపై ఏమీ కట్టనక్కరలేదు. అలాగే మిగతా శ్లాబుల్లో ఉన్నవారికీ ఊరట కల్పించాం. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ పెంపుతో కోటి మందికి పైగా ప్రజలు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
ఈ బడ్జెట్‌లో విద్యుత్ తయారీ, పంపిణీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా విద్యుదుత్పత్తి పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చాం. అవసరమైన మూలధన వ్యయం కల్పించామని ఆర్థికమంత్రి వివరించారు.